- హరీష్.. కేటీఆర్ తర్వాత మళ్లీ వేట
- వరుసగా కుటుంబ సభ్యులకే ‘సిట్’ సినిమా
- అందువల్ల కవితకు పిలుపు వచ్చే ఛాన్స్
- ఆమె నోరు విప్పితే కుటుంబంలో ప్రకంపనలే
- పోలీసులకు పూర్తిగా సహకరించే అవకాశం
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతోంది. హరీష్ రావు, కేటీఆర్ ల విచారణ ముగియకముందే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అండతో జరిగిన ఈ అక్రమాల్లో ఆయన పాత్రపై అధికారులు దృష్టి పెట్టారు. మంగళవారం జరగనున్న ఈ విచారణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నేడు సిట్ ముందుకు సంతోష్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. వారిని ప్రశ్నించిన క్రమంలో సంతోష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇంటెలిజెన్స్ విభాగంలో జరిగిన చీకటి దందాల్లో ఆయన ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. అందుకే ఆయనను నేరుగా విచారించి అసలు నిజాలు రాబట్టాలని ప్రత్యేక బృందం నిర్ణయించింది. సంతోష్ ఆదేశాల మేరకే కొందరు ప్రముఖుల ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాల్ డేటా, డిజిటల్ రికార్డులను ముందు పెట్టి ఆయనను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు సర్వం సిద్ధం చేశారు.
బయటపడనున్న అసలు సూత్రధారులు
ఈ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంతోష్ విచారణ తర్వాత మరికొంత మంది కీలక నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. గత పదేళ్లలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారనే దానిపై అధికారులు జాబితా సిద్ధం చేశారు. విచారణ ముగిస్తే ఈ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటాయి. పోలీసుల విచారణ ఒక క్రమపద్ధతిలో జరుగుతుండటంతో తదుపరి వంతు ఎవరిదనే టెన్షన్ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
కవిత పిలుపుపై ఉత్కంఠ
కుటుంబ సభ్యుల్లో హరీష్, కేటీఆర్, సంతోష్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి కవితపై పడింది. ఇప్పటికే ఆమె సొంత పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆమెకు కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఆమెను విచారణకు పిలిస్తే.. అది పార్టీలో మరిన్ని ప్రకంపనలకు దారితీసే ప్రమాదం ఉంది. ఆమె ద్వారా మరిన్ని రహస్యాలు బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
ఆమె నోరు విప్పితే ఇక్కట్లే
ప్రస్తుతం కవిత పార్టీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. పోలీసులు విచారణకు పిలిస్తే ఆమె సహకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె నోరు విప్పితే గత ప్రభుత్వంలోని అనేకమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఆమెకు తెలిసిన కీలక విషయాలను అధికారులకు వివరిస్తే.. ఈ కేసు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా పార్టీలోని కొందరు నేతలకు శాపంగా మారేలా కనిపిస్తోంది.