- చెత్త డైలాగులతో మురికిగుంటలా మూవీలు
- కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొన్న నటీమణులు
- చెత్త బుర్రల సినీ పెద్దల్లో వక్రబుద్ధి బట్టబయలు
- 90 శాతం పైగా సినిమాలు ఏం నేర్పాయి?
- వినోదం మాటున బూతు డైలాగులతో సినిమా
- చెత్త తీస్తూ కాస్టింగ్ కౌచ్ లేదంటే ఎలా?
- ఆడవాళ్లకు ఏమాత్రం విలువ ఇవ్వని పెద్దలు
సహనం వందే, హైదరాబాద్:
తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ మళ్ళీ సెగలు పుట్టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. ఒక పక్క పరిశ్రమ స్వచ్ఛమైనది అని ఆయన అంటుంటే, లేదు అది కేవలం భ్రమ అని సింగర్ చిన్మయి గట్టిగా నిలదీశారు. బాధితుల తరపున ఆమె చేస్తున్న పోరాటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అద్దం కాదు అది మురికి గుంట…
మన శంకర వరప్రసాద్ సినిమా వేడుకలో చిరంజీవి చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. సినిమా ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిదని ఆయన పేర్కొన్నారు. మనం నీతిగా ఉంటే అంతా బాగానే ఉంటుందని ఆయన సూచించారు. అయితే దీనిపై గాయని చిన్మయి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదని అది చాలా మురికిగా మారిందని మండిపడ్డారు. చిరంజీవి కాలంలో మహిళలకు గౌరవం ఉండేదేమో కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందని ఆమె కుండబద్దలు కొట్టారు. ఇక్కడ పని కంటే ఎక్కువగా శరీరాలను కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైరముత్తు వేధింపుల ప్రస్తావన
గతంలో జరిగిన చేదు అనుభవాలను చిన్మయి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రముఖ గీత రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. తన తల్లి పక్కన ఉన్నా కూడా ఆయన అసభ్యంగా ప్రవర్తించారని వాపోయారు. ఇలాంటి వ్యక్తులే సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీటూ’ ఉద్యమం సమయంలో తాను గొంతు ఎత్తినందుకు తనను అవకాశాలు రాకుండా తొక్కేశారని ఆమె ఆవేదన చెందారు. ప్రతిభ ఉన్నా సరే కమిట్‌మెంట్‌కు నో చెబితే ఇక్కడ మనుగడ కష్టమని చిన్మయి స్పష్టం చేశారు.
కమిట్‌మెంట్ అంటే…
సినీ రంగంలో కమిట్‌మెంట్ అనే పదానికి వక్రార్థం ఉందని చిన్మయి విమర్శించారు. అవకాశాలు ఇవ్వాలంటే కచ్చితంగా లైంగికంగా సహకరించాలనే నిబంధనలు విధిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు పరిశ్రమకు దూరం అవుతున్నారని తెలిపారు. ఒక సంగీత కళాకారిణిని స్టూడియోలో బంధించి వేధించిన ఉదంతాన్ని ఆమె ఉదాహరణగా చెప్పారు. ప్రాణభయంతో ఆ యువతి సౌండ్ బూత్‌లో దాక్కుని ఏడ్చిన సంఘటనను వివరించారు. ఈ రకమైన వేధింపుల వల్లే ఆమె తన కెరీర్‌ను వదిలేసిందని చిన్మయి వాపోయారు.
పాత వివాదాలూ తెరపైకి
కాస్టింగ్ కౌచ్ వివాదం ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. గతంలో శ్రీరెడ్డి వంటి వారు టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా పెద్ద దుమారం రేగింది. అప్పట్లో నటి షావుకారు జానకి వంటి వారు బాధితులనే తప్పుబట్టేలా మాట్లాడటంపై చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దలు కూడా వాస్తవాలను దాచిపెట్టి పరిశ్రమ పరువు కాపాడాలని చూడటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అవకాశాల కోసం మహిళలను వాడుకోవడం అనేది ఒక వ్యవస్థీకృత నేరంలా మారిందని ఆమె విమర్శించారు.
బూతు వెనుక నీతి ఉంటుందా?
పాట… మాట… డాన్స్… డ్రెస్సు… అంగాంగం కనిపించేలా చూపెట్టడం… ఇవన్నీ ఉన్నప్పుడు ఆ సినిమా తీసినోళ్ల బుర్ర నీతిమంతంగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? సారాయి కొట్టులో సుద్దపూసలు ఉంటారా? సినిమా రంగం ఇంత చెత్తగా మారిన తర్వాత అందులో ఉండే మనుషులు నీతిమంతంగా ఉంటారని అనుకోవడం పిచ్చితనమే అవుతుంది. బూతు డైలాగులు, డబుల్ మీనింగ్ మాటలు, ఆడవాళ్లను అసభ్యంగా చూపించే బాపత్ గాళ్ళకు వక్రబుద్ధి తప్ప మరొకటి ఉంటుందని అనుకోగలమా? చెత్త సినిమాలు చేస్తూ నీతి గురించి మాట్లాడితే నమ్మాలా? గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పమనండి… బూతులు లేకుండా సినిమాలు చేసిన పెద్దలు ఎంతమంది ఉన్నారని? దాన్నిబట్టి నిర్ణయించండి కాస్టింగ్ కౌచ్ ఉందో లేదోనని. బూతు పురాణమే వినోదంగా చెప్పుకునే దౌర్భాగ్యంలో నేడు సినీ పరిశ్రమ భ్రష్టు పట్టిందనేది అందరి విమర్శ. మన సినీ బుర్రలకు బూతుతో తప్ప మంచి సబ్జెక్టుతో సినిమా తీసే సామర్థ్యం లేదని అందరికీ తెలుసు. గత్యంతరం లేక ప్రేక్షకులు పిచ్చి వినోదాన్ని చూసి చప్పట్లు కొట్టాల్సి వస్తుంది. ఈ బూతుతోనే కోట్లు కూడబెట్టుకుని మైకుల ముందు నీతి బోధలు చేయటం మన దౌర్భాగ్యం.
90 శాతం నటీమణులకు వేధింపులే…
సినిమా రంగంలో వేధింపులపై ఇప్పటికీ స్పష్టమైన నివేదికలు లేకపోవడం శోచనీయం. కానీ హేమ కమిటీ నివేదిక వంటివి మలయాళ చిత్ర పరిశ్రమలో ఇలాంటి అరాచకాలు ఉన్నాయని తేల్చాయి. టాలీవుడ్‌లో కూడా ఇలాంటి కమిటీలు వేయాలని డిమాండ్ వినిపిస్తోంది. సుమారు 90 శాతం మంది చిన్న నటీమణులు ఏదో ఒక దశలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.