‘అమ్మో’రికా వీసా – స్లాట్లకు వెయిటింగ్ షాక్

Hi-B Visa No slots
  • 2027 వరకు ఎదురుచూడాల్సిందే
  • హైదరాబాద్ సహా అన్నిచోట్ల ఇదే పరిస్థితి
  • హెచ్-1బీ షాక్.. టెక్కీల్లో వణుకు!
  • జాబ్ ముప్పు… ఆందోళనలో ఫ్యామిలీస్
  • అత్యవసరంగా రావాల్సిన వారికీ అడ్డంకులే

సహనం వందే, హైదరాబాద్:

అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులపై పిడుగు పడింది. హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురుచూపులు ఇప్పుడు ఏకంగా ఏళ్లలోకి మారుతున్నాయి. కొత్తగా వీసా అపాయింట్‌మెంట్ కోరుకునే వారికి 2027 వరకు స్లాట్లు దొరకడం లేదు. అగ్రరాజ్యంలో నిబంధనలు కఠినతరం కావడంతో వేలాది మంది టెక్కీల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.

స్లాట్లు నిల్.. అన్నీ ఫుల్
దేశంలోని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లోని కాన్సులేట్లలో ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా నిండుకున్నాయి. వీసా స్టాంపింగ్ కోసం వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఎక్కడా ఖాళీలు కనిపించడం లేదు. ‘అందుబాటులో లేదు’ అనే బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన వారు, అక్కడ ఉండి స్టాంపింగ్ కోసం భారత్ రావాలనుకునే వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఏడాదిన్నర ఆగాల్సిందేనా?
ప్రస్తుతం ఇంటర్వ్యూల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి 2027 నాటి తేదీలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే 2026 ప్రారంభంలో అపాయింట్‌మెంట్‌లు ఉన్న వారికి కూడా షాక్ ఇస్తూ వాటిని 2027 ఏప్రిల్, మే నెలలకు వాయిదా వేస్తున్నారు. అంటే దాదాపు ఏడాదిన్నర పాటు వెయిటింగ్ లిస్టులో ఉండాల్సిందే. ఈ జాప్యం వల్ల అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు స్వదేశానికి రావాలంటేనే భయపడిపోతున్నారు.

ట్రంప్ సర్కార్ కొరడా
అమెరికాలో అధికారం మారిన తర్వాత వీసా నిబంధనలు ఊహించని విధంగా మారిపోయాయి. ఏడాదికి ఇచ్చే 85000 వీసాల కోటాలో మార్పు లేకపోయినా వడపోత ప్రక్రియను అత్యంత కఠినం చేశారు. ఇందులో 20000 వీసాలను అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారికే కేటాయించారు. ఒక్కో దరఖాస్తు పరిశీలనకు గతంలో కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఫలితంగా రోజుకు జరిగే ఇంటర్వ్యూల సంఖ్య సగానికి పడిపోయింది.

నిఘా నీడలో సోషల్ మీడియా
వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై అమెరికా గట్టి నిఘా పెట్టింది. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరి ఫేస్‌బుక్, ఎక్స్ వంటి ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్కడ చేసే పోస్టులు, అభిప్రాయాల ఆధారంగానే వీసా ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తున్నారు. దీనివల్ల ప్రాసెసింగ్ సమయం విపరీతంగా పెరిగింది. అలాగే ఇతర దేశాల్లో స్టాంపింగ్ చేసుకునే వెసులుబాటును రద్దు చేయడంతో భారతీయ కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది.

కుటుంబాలకు వీసా కష్టాలు
కేవలం ఉద్యోగులే కాకుండా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులపై కూడా వేటు పడుతోంది. హెచ్-1బీ వీసా ఉన్న వారి భార్యాపిల్లలకు ఇచ్చే హెచ్-4 వీసాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తోంది. చిన్న కారణాలతో వీసాలను రిజెక్ట్ చేస్తూ భారతీయ కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత 50 రోజులుగా భారత్‌లో ఒక్కటంటే ఒక్క కొత్త స్లాట్ కూడా విడుదల కాకపోవడం గమనార్హం.

నిపుణుల హెచ్చరిక ఇదే
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు వీసా స్టాంపింగ్ కోసం రావడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా యంత్రాంగం వీసాలను తిరస్కరించడమే పనిగా పెట్టుకుందని విమర్శిస్తున్నారు. బైడెన్ హయాంలో ఉన్న సరళమైన పద్ధతులు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ వీసా సంక్షోభం భారతీయ ఐటీ రంగాన్ని ఎంతగా దెబ్బతీస్తుందోనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *