- ఫార్మా కంపెనీల ప్రాణాంతక వ్యాపారం
- ఆకలిని చంపి ఆయువును తీస్తున్న మెడిసిన్
- ఫార్మా కంపెనీల అడ్డగోలు ప్రచారం
- జీఎల్పీ-1 మందుల విషంలో అసలు రంగు
- కేంద్ర ఆరోగ్య శాఖ కొరడా ఝుళిపింపు
- లాభాల కోసం సామాన్యుడి బలి
సహనం వందే, హైదరాబాద్:
బరువు తగ్గాలనే ఆశను ఫార్మా కంపెనీలు వ్యాపార అవకాశంగా మార్చుకున్నాయి. ప్రిస్క్రిప్షన్ మందులను సాధారణ సరుకుల్లా మార్చి సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నాయి. శాస్త్రీయతను పక్కనబెట్టి లాభాలే పరమావధిగా సాగిస్తున్న ఈ కమర్షియల్ ట్రాప్ సామాన్యుల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ అశాస్త్రీయ ప్రచారాలను అడ్డుకునేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది.

మందుల ముసుగులో విషం
బరువు తగ్గించే మందుల్లో ప్రధానంగా కనిపిస్తున్నవి జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్ మందులు. ఇవి ప్రాథమికంగా డయాబెటిస్ నియంత్రణ కోసం కనిపెట్టిన మందులు. ఇవి శరీరంలో ఉండే జీఎల్పీ-1 అనే హార్మోన్ లాగానే పనిచేసి మెదడుకు ఆకలి వేయడం లేదనే సంకేతాలను పంపుతాయి. ఫలితంగా వ్యక్తి తక్కువ ఆహారం తీసుకుంటాడు. అయితే ఊబకాయం తగ్గడం కోసం వీటిని విచ్చలవిడిగా వాడటం వల్ల లివర్, కిడ్నీ సమస్యలతో పాటు తీవ్రమైన దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని డాక్టర్ల సలహా లేకుండా వాడటం అంటే మృత్యువును కొని తెచ్చుకోవడమే.
ఫార్మా తీరుతో ప్రమాద ఘంటికలు…
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అడ్వైజరీ కేవలం ఒక కాగితపు ముక్క కాదు. ఫార్మా దిగ్గజాలకు పంపిన ఘాటైన హెచ్చరిక. జీఎల్పీ-1 మందుల విషయంలో కంపెనీలు అనుసరిస్తున్న దుర్మార్గపు ప్రచారాలు రోగులను ప్రమాదాల అంచులకు తీసుకెళ్తున్నాయి. డాక్టర్ల పర్యవేక్షణ, సరైన రోగనిర్ధారణ లేకుండా వీటిని సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రచారం చేయడం అంటే ప్రజలను అంధకారంలోకి నెట్టడమేనని ఆరోగ్య రంగ నిపుణులు మండిపడుతున్నారు.
నిఘా నీడలో ఫార్మా సామ్రాజ్యాలు
కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓ దృష్టి ఇప్పుడు ఈ మందుల తయారీదారులు, వాటిని ప్రమోట్ చేస్తున్న డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై పడింది. అశాస్త్రీయమైన వ్యాధి అవగాహన కార్యక్రమాల పేరుతో కంపెనీలు చేస్తున్న మార్కెటింగ్ ట్రిక్స్ పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. కేవలం లాభం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న ఈ కంపెనీల దోపిడీని అడ్డుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.
జీవనశైలిని మరిపించి.. మందుల బానిసలుగా
బరువు తగ్గడానికి అసలైన మార్గం జీవనశైలి మార్పులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అందరూ చెబుతున్నారు. కానీ ఈ కంపెనీలు మాత్రం మందులే ఏకైక పరిష్కారమని ప్రజలను నమ్మిస్తున్నాయి. ఈ మందుల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి, దీర్ఘకాలిక అనర్థాల గురించి కనీస సమాచారం ఇవ్వకుండా అమాయకపు ప్రజలను మందులకు బానిసలుగా మారుస్తున్నాయి. ఇది వైద్యం కాదు… స్వచ్ఛమైన వ్యాపార కుతంత్రం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
ప్రపంచ ఆరోగ్య సంస్థ జీఎల్పీ-1 మందులను అత్యవసర మందుల జాబితాలో చేర్చడం వెనుక ఉన్న ఉద్దేశం వేరు. ఇది కేవలం పేదలకు మందులు అందుబాటులోకి రావాలని మాత్రమే. కానీ మన దగ్గర వీటిని విలాసవంతమైన వస్తువులుగా చిత్రీకరిస్తూ విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు. ఇది కేవలం మధ్యతరగతి, పేద ప్రజల జేబులకు చిల్లులు పెట్టడమే కాకుండా వారిని అప్పులపాలు చేస్తోంది.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్