- అంతరిక్షంలో 50,000 మిర్రర్ శాటిలైట్స్
- సోలార్ విద్యుత్తుకు విప్లవాత్మక ప్రయోగాలు
- రాత్రి సూర్యుడి కాంతితో రాత్రి నిద్రకు భంగం
- జీవవైవిధ్యం అతలాకుతలం అవుతుందా?
- వివాదాస్పదంగా మారిన టెక్నాలజీ
సహనం వందే, హైదరాబాద్:
భూమి మీద పగలు మాత్రమే దొరికే సూర్యరశ్మిని రాత్రి కూడా వాడుకుంటే ఎలా ఉంటుంది. వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా కల్పనలా ఉన్నా ఇది నిజం కాబోతోంది. అంతరిక్షంలో అద్దాలను ఉంచి భూమి మీదకు కాంతిని పరావర్తనం చెందించే టెక్నాలజీని ఒక స్టార్టప్ సంస్థ ఇప్పుడు తెరపైకి తెస్తోంది. ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా అత్యవసర సమయాల్లోనూ వెలుగును నింపుతుందన్నది సదరు సంస్థ వాదన.

అద్దాల అద్భుతం
కాలిఫోర్నియాలోని హాథోర్న్‌కు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే సంస్థ ఈ సాహసోపేతమైన ప్రయోగానికి సిద్ధమైంది. రాత్రి పూట కూడా సూర్యరశ్మిని భూమిపైకి మళ్ళించడం ద్వారా సోలార్ ఫామ్‌ల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించవచ్చని ఈ సంస్థ నమ్ముతోంది. ఇందుకోసం ఏకంగా 50 వేల పెద్ద అద్దాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనివల్ల విద్యుత్ కొరతను అధిగమించవచ్చని ఆ సంస్థ భావిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టే సిబ్బందికి, వీధులకు ఇది వెలుగునిస్తుంది. సౌరశక్తి రంగంలో తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి ఈ పద్ధతి దోహదపడుతుందని సంస్థ భావిస్తోంది.
నిధుల సేకరణ
ఈ ప్రాజెక్టు కోసం రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ఇప్పటికే 280 లక్షల డాలర్ల రూపాయల నిధులను పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. దీనికి నాయకత్వం వహిస్తున్న సీఈఓ బెన్ నౌవాక్ ఈ విషయాన్ని వెల్లడించారు. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఈ స్పేస్ మిర్రర్స్ పనిచేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది.
ప్రోటోటైప్ శాటిలైట్ ప్రయోగం…
ఈ ప్రయోగానికి అవసరమైన అనుమతుల కోసం ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఎఫ్ సీసీని ఈ సంస్థ సంప్రదించింది. 60 అడుగుల వ్యాసం కలిగిన అద్దంతో కూడిన ఒక ప్రోటోటైప్ శాటిలైట్‌ను ప్రయోగించేందుకు ఎఫ్ సీసీ అనుమతి కోరింది. ఒకవేళ అనుమతులు దక్కితే ఈ వేసవిలోనే ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు రిఫ్లెక్ట్ ఆర్బిటల్ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ సోమవారంతో ముగియనుంది.
గత చరిత్ర ఇలా
అంతరిక్షంలో అద్దాలను ఉంచాలనే ఆలోచన ఇప్పటిది కాదు. 1977లోనే రాకెట్ ఇంజనీర్ క్రాఫ్ట్ ఏ ఎరిక్ దీనిపై ప్రతిపాదనలు చేశారు. పంటలను గడ్డకట్టకుండా కాపాడటం, విపత్తు ప్రాంతాల్లో వెలుగును నింపడం ఆయన ప్రధాన ఉద్దేశ్యం. 1993లో రష్యా ఏకంగా 80 అడుగుల అద్దంతో కూడిన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆర్కిటిక్ సైబీరియాలో కాంతిని పెంచేందుకు చేసిన ఆ ప్రయోగం కొంతకాలం పాటు వెలుగును ప్రసరింపజేసింది.
వివాదాల సుడిగుండం
ఈ కొత్త ప్రయోగం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. అంతరిక్షంలో ఇలాంటి వినూత్న కార్యక్రమాలను నియంత్రించే సరైన చట్టాలు లేవని అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ డైరెక్టర్ రూహి దలాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అద్దాల వల్ల పర్యావరణానికి, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. మానవ జీవితంపై కూడా దీని ప్రభావం ఉంటుందని నిపుణులు వాదిస్తున్నారు.
జీవవైవిధ్యం అతలాకుతలం
ఈ ప్రాజెక్టు అసాధ్యమని కొందరు, ప్రమాదకరమని మరికొందరు వాదిస్తున్నారు. కక్ష్యలో అద్దాలు తిరుగుతుంటే రాత్రి వేళల్లో కూడా వెలుతురు ఉండటం వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయని భావించే వారు కూడా ఉన్నారు. ఎఫ్ సీసీ తీసుకునే నిర్ణయంపైనే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉంది.