- ఆస్ట్రేలియా బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- 16 ఏళ్లలోపు వయస్సు వారందరికీ బంద్
- చిన్నారుల డిజిటల్ రక్షణకు పకడ్బందీ చట్టం
- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లపై ఉక్కుపాదం
- యూట్యూబ్, ఎక్స్, స్నాప్‌చాట్ లపై కూడా
సహనం వందే, దావోస్:
పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక మత్తుమందులా మారింది. ఆటపాటలు మరిచిపోయి రీల్స్ లోకంలో విహరిస్తున్న బాల్యాన్ని కాపాడేందుకు ఏపీ సర్కార్ నడుం బిగించింది. సాంకేతికత పేరిట జరుగుతున్న అనర్థాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. సోషల్ మీడియా నిషేధంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఆస్ట్రేలియా బాటలో ఆంధ్రప్రదేశ్
దావోస్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాపై నిషేధం విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం తెచ్చింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్న తరహాలో చట్టాలు చేయాలని భావిస్తున్నాయి. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా నిబంధనలు తేవాలని మంత్రి నారా లోకేశ్ యోచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులతో ప్రాథమిక చర్చలు జరిపారు. పిల్లల భవిష్యత్తు, వారి భద్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. స్మార్ట్ ఫోన్ వ్యసనం నుంచి విముక్తి కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ బంద్
చిన్న పిల్లలు సోషల్ మీడియాలో ఏమి చూస్తున్నారో వారికి అర్థం కావడం లేదని మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఒక నిర్దిష్ట వయసు వచ్చే వరకు వారిని ఈ వేదికలకు దూరంగా ఉంచాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నియంత్రణ పద్ధతులు ఉన్నా అవి పూర్తిస్థాయిలో పనిచేయడంలేదు. అందుకే ఆస్ట్రేలియా చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్, ఎక్స్, స్నాప్‌చాట్, రెడిట్, థ్రెడ్స్, కిక్, ట్విచ్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధిస్తారు.
టెక్ సవాళ్లు… పరిష్కారాలు
ఈ నిషేధాన్ని అమలు చేయడం అంత సులభం కాదు. సాంకేతిక పరిజ్ఞానంతో ఐపీ అడ్రస్ మార్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతను వాడాలని సర్కార్ చూస్తోంది. వయసును ధ్రువీకరించే ఏజ్ వెరిఫికేషన్ సాఫ్ట్‌వేర్లను వినియోగించనున్నారు. ఫేస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ పద్ధతుల ద్వారా యూజర్ వయసును గుర్తిస్తారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు సోషల్ మీడియా కంపెనీలపై భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది.
పెరిగిపోతున్న సైబర్ ముప్పు
చిన్న పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఆన్ లైన్ వేధింపులు, సైబర్ కేసులు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల విద్యార్థులు మానసిక ఆందోళనకు లోనవుతున్నారు. చదువుపై ఏకాగ్రత దెబ్బతింటోంది. ఈ ముప్పు నుంచి బాల్యాన్ని రక్షించాలంటే చట్టపరమైన రక్షణ కవచం అవసరమని మంత్రి స్పష్టం చేశారు.
తల్లిదండ్రుల నుంచి మద్దతు
ప్రభుత్వ ఆలోచనపై తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. పిల్లలు గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. కంటి సమస్యలు, నిద్రలేమి వంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. సోషల్ మీడియా వాడకం తగ్గితే పిల్లలు మళ్లీ మైదానాల్లోకి వస్తారని పెద్దలు భావిస్తున్నారు. డిజిటల్ డిటాక్స్ ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్త ఉద్యమం
చిన్న పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచాలన్న ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. ఇండోనేషియా, డెన్మార్క్, బ్రెజిల్, బ్రిటన్ వంటి దేశాలు కూడా టెక్ దిగ్గజాలను నియంత్రించే పనిలో ఉన్నాయి. భారతదేశంలో కూడా సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ముందుగా స్పందించి రాష్ట్ర స్థాయిలో చట్టం చేయడానికి సిద్ధమవుతోంది. అభివృద్ధికి సాంకేతికతను వాడుకుంటూనే దాని వల్ల కలిగే అనర్థాల నుంచి పిల్లలను కాపాడాలని ఆయన నిర్ణయించుకున్నారు.
వినూత్న విప్లవం…
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆంధ్రప్రదేశ్ ఇలాంటి నిషేధంలో కూడా లీడర్ గా నిలవబోతోంది. ఇది కేవలం నిషేధం మాత్రమే కాదు… భావి తరాల అభివృద్ధికి ఇదొక పెట్టుబడి. ఐటీ అంటే కేవలం కంప్యూటర్లు మాత్రమే కాదు.. సామాజిక బాధ్యత కూడా అని లోకేశ్ చాటిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రయోగం సక్సెస్ అయితే మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ బాటలో నడిచే అవకాశం ఉంది. తాము కేవలం ప్రకటనలు చేయడమే కాకుండా వాటిని అమలు చేయడంలో ముందుంటామని లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించి మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.