- తృటి అంటే… సెకనులో వెయ్యో వంతు
- సృష్టి రహస్యాలను విప్పే అద్భుత గణితం
- రెప్పపాటు నుంచి బ్రహ్మాయుష్షు దాకా లెక్కలు
- కలియుగం 4.32 లక్షల సంవత్సరాలు
- ద్వాపర యుగం 8.64 లక్షల సంవత్సరాలు
- కృతయుగం 17.28 లక్షల సంవత్సరాలు
- కాలసముద్రంలో నీటి బిందువు మన జీవితం
కాలం ఎవరి కోసమూ ఆగదు. కానీ ఆ కాలాన్ని కొలవడంలో మన పూర్వీకులు చూపిన చాకచక్యం అమోఘం. కేవలం సెకన్లు, నిమిషాలకే పరిమితం కాకుండా పరమాణువు స్థాయి నుంచి మహా కల్పాల వరకు కాలాన్ని లెక్కించారు. తృటిలో తప్పిన ప్రమాదం అన్న మాట వెనుక ఎంతటి లోతైన అర్థం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మన ప్రాచీన కాలమానంలోని ఆ ఆసక్తికర రహస్యాలివే.
తృటి అంటే ఎంత సమయం?
మనం అప్పుడప్పుడు తృటిలో తప్పిందని అంటుంటాం. తృటి అంటే సెకనులో వెయ్యో వంతు. ఇది మనం ఊహించలేనంత వేగవంతమైనది. ఇలాంటి 100 తృటులు కలిస్తే ఒక వేద అవుతుంది. 3 వేదలు ఒక లవం అని పిలుస్తారు. అంటే మనం కన్ను మూసి తెరిచే లోపే కొన్ని వేల తృటులు గడిచిపోతాయి. అంతటి సూక్ష్మమైన లెక్కను మన వాళ్లు ఏనాడో చెప్పారు.
నిమిషం… నిమేషం వేర్వేరు
సాధారణంగా మనం నిమిషాన్ని నిమేషం అనుకుంటాం. కానీ అది తప్పు. 3 లవాలు కలిస్తే ఒక నిమేషం అవుతుంది. అంటే కంటి రెప్ప వేసేంత కాలం అన్నమాట. ఇలాంటి 3 నిమేషాలు ఒక క్షణం అవుతుంది. 5 క్షణాలు ఒక కాష్టగా మారుతుంది. 15 కాష్టాలు ఒక లఘువు అయితే 15 లఘువులు ఒక దండం అవుతుంది. ఈ గమనాన్ని చూస్తుంటే కాలం మీద మన పెద్దలకు ఎంత పట్టు ఉందో అర్థమవుతుంది.
గడియారాల వెనుక గణితం
2 దండాలు కలిస్తే ఒక ముహూర్తం అవుతుంది. నేటి లెక్కల ప్రకారం ఇది సుమారు 48 నిమిషాలు. 7 నాలికలు ఒక యామము లేదా ప్రహారం అవుతుంది. పగలు 4 ప్రహారాలు మరియు రాత్రి 4 ప్రహారాలు ఉంటాయి. అంటే 2 పూటలు కలిస్తే ఒక రోజు అవుతుంది. 15 రోజులను ఒక పక్షంగా పిలుస్తారు. శుక్ల పక్షం, కృష్ణ పక్షం కలిస్తే ఒక నెల అవుతుంది.
రుతువుల నుంచి దశాబ్దాల దాకా
2 నెలలు ఒక రుతువుగా మారుతుంది. మొత్తం 6 రుతువులు కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది. 10 సంవత్సరాలు ఒక దశాబ్దం అని 10 దశాబ్దాలు ఒక శతాబ్దం అని అంటాం. 10 శతాబ్దాలు కలిస్తే ఒక సహస్రాబ్ది అవుతుంది. ఇలాంటి 100 సహస్రాబ్దులు ఒక ఖర్వ అవుతుంది. అంటే ఒక లక్ష సంవత్సరాల కాలం అన్నమాట. ఇవన్నీ కాలాన్ని విభజించడంలో మన సంస్కృతి గొప్పదనాన్ని చాటుతాయి.
యుగాల చక్రభ్రమణం
కాలం భారీ చక్రంలా తిరుగుతుంది. కలియుగం 4.32 లక్షల సంవత్సరాలు ఉంటుంది. ద్వాపర యుగం 8.64 లక్షల సంవత్సరాలు ఉంటుంది. త్రేతాయుగం 12.96 లక్షల ఏళ్లు ఉంటుంది. కృతయుగం 17.28 లక్షల సంవత్సరాలు నడుస్తుంది. ఈ 4 యుగాలను కలిపి ఒక చక్రభ్రమణం లేదా చతుర్యుగం అంటారు. ఇలా 71 చతుర్యుగాలు గడిస్తే ఒక మన్వంతరం పూర్తి అవుతుంది.
బ్రహ్మదేవుడి ఆయుష్షు లెక్క
14 మన్వంతరాలు ఒక కల్పం అవుతుంది. ఇలాంటి 200 కల్పాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు. 365 బ్రహ్మరోజులు కలిస్తే బ్రహ్మ సంవత్సరం అవుతుంది. 100 బ్రహ్మ సంవత్సరాల తర్వాత బ్రహ్మ సమాప్తి జరుగుతుంది. ఇదంతా విష్ణువుకు ఒక పూటతో సమానం. ఇదంతా వింటుంటే మనిషి జీవితం కాలం అనే మహా సముద్రంలో ఒక నీటి బిందువు లాంటిదని స్పష్టమవుతుంది.
