ప్రపంచాన్ని ముంచిన ట్రంప్ అంచనా – ఇరాన్ యుద్ధంలో అమెరికా వ్యూహం విఫలం

Trump strategy on Iran War
  • ముదిరిన ఘర్షణ… చమురు సరఫరాకు బ్రేక్
  • అస్తవ్యస్తమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ
  • తీవ్ర సంక్షోభంలో మార్కెట్లు… జనంలో భయం
  • గ్యాస్ కొరతతో ట్రంపుని తిట్టుకుంటున్న జనం

సహనం వందే, హైదరాబాద్:

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహంకారపూరిత నిర్ణయాలు మధ్య ప్రాచ్యంలో రక్తాన్ని పారిస్తున్నాయి. ఇరాన్ ఎదురుదాడిని తక్కువ చేసి చూసిన అగ్రరాజ్యం… ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక భద్రతను పణంగా పెట్టింది. ఒక దేశాన్ని నాశనం చేయాలనే పగతో ట్రంప్ బృందం వేసిన తప్పుడు అంచనాలు నేడు గ్లోబల్ మార్కెట్లను పాతాళానికి తొక్కుతున్నాయి. ఇరాన్ ప్రతిఘటన ముందు అమెరికా మౌనం వహించడం దాని అసమర్థతను కళ్లకు కడుతోంది.

Trump  strategy on Iran War

లెక్కలేనంత అజ్ఞానం
ఫిబ్రవరి 18న ఇరాన్‌పై దాడికి ట్రంప్ నిర్ణయించినప్పుడు అడ్మినిస్ట్రేషన్ బాధ్యతారాహిత్యం బయటపడింది. ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. యుద్ధం వల్ల చమురు సరఫరాకు ఎలాంటి ముప్పు లేదని ఆయన పచ్చి అబద్ధాలు చెప్పారు. ఈ అసమర్థత వల్లే ట్రంప్ బృందం ఇరాన్ ఆగ్రహాన్ని అంచనా వేయలేకపోయింది. ఒక ప్రాంతాన్ని అశాంతికి గురిచేసే ముందు దాని పర్యవసానాలను ఆలోచించని ట్రంప్ వైఖరి ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది.

చారిత్రక తప్పు…
గత జూన్ నెలలో జరిగిన దాడుల అనుభవాలను ట్రంప్ సలహాదారులు తప్పుగా అర్థం చేసుకున్నారు. గతంలో ధరలు స్వల్పంగా పెరిగి తగ్గినంత మాత్రాన ఈసారి కూడా అదే జరుగుతుందని భ్రమపడ్డారు. కానీ ఇరాన్ ఈసారి ఒక వ్యవస్థీకృత ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం నిలిచిపోయేలా చేసి ట్రంప్ ప్రభుత్వ పునాదులను కదిలించింది. వీరి అంచనా రాహిత్యం వల్లే ప్రపంచం ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.

హోర్ముజ్ జలసంధిలో నెత్తుటి గాయం
హోర్ముజ్ జలసంధి ప్రపంచానికి ప్రాణవాయువు వంటిది. ఇక్కడ ఇరాన్ విధించిన దిగ్బంధనం అమెరికా పీకల మీద కూర్చుంది. ఇరాన్ జరిపిన హెచ్చరికలతో వాణిజ్య నౌకలు నిలిచిపోయాయి. చమురు ధరలు మంట పుట్టిస్తున్నాయి. అమెరికా పౌరుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన దాడి ఆ దేశానికే శాపంగా మారింది. తమ సొంత ప్రజల కష్టాలను కూడా అరికట్టలేని స్థితికి అగ్రరాజ్యం దిగజారింది.

అయోమయంలో అగ్రరాజ్యం…
దాడుల అనంతర పరిణామాలను ఎదుర్కోవడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గ్యాస్ ధరలను ఎలా తగ్గించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎంబసీలను తరలించే క్రమంలో వారి భయం బయటపడుతోంది. దౌత్యపరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఏకాకిగా మారిన అగ్రరాజ్యం ఇప్పుడు తన సొంత విధానాలతోనే అంధకారంలోకి వెళ్తోంది.

నిప్పుతో చెలగాటం
ఇరాన్‌ను తన మనుగడకు ముప్పుగా భావిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఆవేశంతో దాడులకు దిగుతోంది. గత జూన్ లో జరిగిన 12 రోజుల యుద్ధం కంటే ఇప్పుడు పరిస్థితి తీవ్రంగా ఉంది. అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ నగరం, అరబ్ దేశాల మీదకు క్షిపణులు, డ్రోన్ల వర్షం కురుస్తోంది. ఇరాన్ ప్రతి అడుగు అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తోంది. ఈ రక్తం కళ్ల చూసే యుద్ధంలో ట్రంప్ నిర్ణయాలే ఇప్పుడు ఆ దేశానికి గోతిని తవ్వుతున్నాయి.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *