- సామాజిక న్యాయం వైపు సుప్రీం అడుగు
- ఆదాయం ఒక్కటే కొలమానం కాదని వెల్లడి
- ఉద్యోగ హోదానే పరిగణలోకి తీసుకోవాలి
- ఆదాయ పరిమితి కాదు… సామాజిక స్థితి
- కేంద్ర ప్రభుత్వ అప్పీలు తిరస్కరణ
సహనం వందే, న్యూఢిల్లీ:
ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ గుర్తింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయంలో కొత్త చర్చకు దారితీసింది. కేవలం తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగానే రిజర్వేషన్ ఫలాలను ఆపడం అన్యాయమని కోర్టు తేల్చి చెప్పింది. అసలు సామాజిక హోదా అంటే ఏమిటి? ఎందుకు ఆదాయం మాత్రమే ప్రామాణికం కాకూడదు? అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.
సామాజిక హోదా అంటే ఏమిటి?
ఓబీసీలలో సామాజికంగా వెనుకబడిన వారిని గుర్తించేందుకు 1993లో ప్రభుత్వం ఒక పద్ధతిని తెచ్చింది. దీని ప్రకారం తల్లిదండ్రులు చేసే ఉద్యోగ ‘హోదా’ (స్టేటస్) ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రభుత్వంలో ఐఏఎస్ లేదా గ్రూప్-1 స్థాయి అధికారి అయితే ఆ వ్యక్తి తన సామాజిక స్థితిని మెరుగుపరుచుకున్నాడని అర్థం. కాబట్టి వారి పిల్లలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు. ఇదే ‘సామాజిక హోదా’. ఆదాయం అనేది కేవలం ఇది లేని చోట మాత్రమే చూడాల్సిన చిన్న అంశం.
ఎందుకు గందరగోళం జరిగింది?
ప్రభుత్వం తర్వాత కాలంలో రూ. 8 లక్షల ఆదాయ పరిమితిని తీసుకొచ్చింది. అధికారులు ఇప్పుడు ఒక పొరపాటు చేస్తున్నారు. తల్లిదండ్రుల సామాజిక హోదా (ఉదాహరణకు వారు చిన్న ఉద్యోగంలో ఉన్నారా లేదా పెద్ద పదవిలో ఉన్నారా) అనే విషయంతో సంబంధం లేకుండా కేవలం వారి జీతం రూ. 8 లక్షలు దాటిందనే ఒకే ఒక్క కారణంతో ఆ అభ్యర్థిని క్రిమీలేయర్ గా చేర్చేస్తున్నారు. ఆదాయం ఎక్కువైతే రిజర్వేషన్ కట్ చేయడం వెనుక ఉన్న తర్కం ఇదే.
ఉదాహరణతో స్పష్టత…
ఒక అభ్యర్థి తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ ఏడాదికి రూ. 9 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం. మరో అభ్యర్థి తండ్రి ప్రభుత్వంలో గ్రూప్-సి ఉద్యోగిగా ఉండి పదోన్నతులు పొంది రూ. 8 లక్షల లోపే సంపాదిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి సామాజికంగా, అధికార పరంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ప్రైవేట్ ఉద్యోగి కుమారుడిని కేవలం ఆదాయం ఎక్కువని కారణం చూపి రిజర్వేషన్‌కు దూరం చేస్తున్నారు. ఇది వివక్ష అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కోర్టు చెప్పిన అసలు విషయం ఏమిటి?
కేవలం జీతం పెరిగినంత మాత్రాన ఒక కుటుంబం సామాజికంగా అగ్రస్థానానికి చేరినట్లు కాదు. 1993 నాటి విధానం ప్రకారం ఉద్యోగ హోదాను చూడాలి. ఆదాయాన్ని కేవలం అదనపు సాక్ష్యంగా మాత్రమే వాడాలి. అంతే కానీ ఆదాయాన్నే ప్రధాన ప్రమాణంగా మార్చడం వల్ల సమానత్వ సూత్రం దెబ్బతింటుంది. ఈ విషయాన్నే జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం ఈ తీర్పులో స్పష్టం చేసింది.
ఇప్పుడు ఏం చేయాలి?
కోర్టు కేంద్ర ప్రభుత్వ అప్పీలును కొట్టివేసింది. యూపీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించినా క్రిమీలేయర్ పేరుతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన అభ్యర్థుల కేసులను మళ్ళీ పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియ 6 నెలల్లోపు జరగాలి. అభ్యర్థులు నిజంగానే నాన్-క్రిమీలేయర్ పరిధిలో ఉంటే వారికి ఉద్యోగాలివ్వాలి. అవసరమైతే అదనపు పోస్టులను సృష్టించాలి. మొత్తానికి ఒక వ్యక్తి సామాజిక స్థాయిని అంచనా వేసేటప్పుడు కేవలం వారి బ్యాంకు బ్యాలెన్స్‌ను మాత్రమే చూడటం కాకుండా వారు సమాజంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో కూడా చూడాలని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది.