- వందేళ్ల ‘బాంబ్ క్యాలరీ మీటర్’తో లెక్కింపు
- అత్యంత అశాస్త్రీయంగా క్యాలరీల గుర్తింపు
- తప్పుడు లెక్కలతో కొలుస్తూ తింటున్నాం
- లేబుల్స్ మీది క్యాలరీల్లో 20 శాతం తప్పులే
- బరువు తగ్గాలంటే ఈ విధమైన లెక్కింపు వేస్ట్
- ఒక అంతర్జాతీయ పరిశోధనా సంస్థ వెల్లడి
- వండిన ఆహారం.. పచ్చి ఆహారానికి భారీ తేడా
- అంకెల మాయలో పడొద్దు..పోషకాలే లెక్కించు
సహనం వందే, అమెరికా:
బరువు తగ్గాలని క్యాలరీలను లెక్కపెట్టడం ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాషన్. కానీ ఆ క్యాలరీ లెక్కలన్నీ పక్కా తప్పులని శాస్త్రవేత్తల పరిశోధనలు బాంబు పేల్చాయి. మనం తినే ప్రతి ముద్దలో ఉండే శక్తి మొత్తం మన శరీరానికి అందదు. ఈ అంకెల గారడీని నమ్ముకుంటే బరువు తగ్గడం పక్కన పెడితే ఆరోగ్యం పాడవ్వడం ఖాయం. అసలు క్యాలరీల వెనుక ఉన్న పచ్చి నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
వందేళ్ల నాటి పాత పద్ధతి…
ప్రస్తుత క్యాలరీల లెక్కింపు పద్ధతి 19వ శతాబ్దం నాటిది. విల్బర్ అట్వాటర్ అనే శాస్త్రవేత్త 1800 కాలంలో కనిపెట్టిన పాత పద్ధతినే ఇప్పటికీ గుడ్డిగా నమ్ముతున్నాం. ఒక ఆహార పదార్థాన్ని ల్యాబ్‌లో కాల్చినప్పుడు ఎంత వేడి వస్తుందో దాని ఆధారంగా ఈ క్యాలరీలను నిర్ణయిస్తారు. కానీ మన శరీరం నిప్పుల కొలిమి కాదు. అలాగే అది ఒక యంత్రం కూడా కాదు. అదొక సంక్లిష్టమైన జీవక్రియ. మనం తిన్నది మొత్తం శరీరం గ్రహించదు. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అరిగించడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది.


అట్వాటర్ లెక్కల గుట్టు…
ఫుడ్ ప్యాకెట్లపై చూసే క్యాలరీలను ‘బాంబ్ క్యాలరీ మీటర్’ అనే యంత్రంలో ఆహారాన్ని మండించి కొలుస్తారు. అందులో ప్రోటీన్లకు 4, కార్బోహైడ్రేట్లకు 4, కొవ్వులకు 9 క్యాలరీల చొప్పున లెక్క వేస్తారు. కానీ మన పొట్టలో ఆహారం మండిపోదు సరికదా… అది అరుగుతుంది అంతే. ఈ అరుగుదల ప్రక్రియలో చాలా క్యాలరీలు ఖర్చవుతాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటే శరీరం ఆ క్యాలరీలను పూర్తిగా తీసుకోలేదని తేలింది.
వండితే క్యాలరీలు పెరుగును…
ఆహారాన్ని వండటం వల్ల అందులోని క్యాలరీల లభ్యత పెరుగుతుంది. పచ్చి క్యారెట్ తింటే వచ్చే శక్తి కంటే ఉడికించిన దాని ద్వారా ఎక్కువ శక్తి అందుతుంది. వండటం వల్ల ఆహారంలోని కణాలు మెత్తబడి శరీరం సులభంగా గ్రహించేలా మారుతాయి. పచ్చి ఆహారంలో కణకవచాలు బలంగా ఉండటం వల్ల శరీరం వాటి నుంచి శక్తిని పూర్తిగా లాక్కోలేదు. అందుకే వండిన ఆహారం ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది.
బాదం పప్పు రహస్యం
పరిశోధకులు బాదం పప్పుపై చేసిన ప్రయోగంలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఒక బాదం పప్పులో 170 క్యాలరీలు ఉంటాయని మనం అనుకుంటాం. కానీ మన శరీరం అందులో కేవలం 129 క్యాలరీలను మాత్రమే గ్రహిస్తుంది. మిగిలినది మన జీర్ణ వ్యవస్థ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. బాదం పప్పులోని కణాలు చాలా గట్టిగా ఉండటమే దీనికి కారణం. ఇలాంటి పప్పులు, గింజల విషయంలో క్యాలరీల లెక్కలు ఎప్పుడూ తప్పే అవుతాయి.
బ్యాక్టీరియా చేసే మాయ
మన శరీరంలోని క్యాలరీల వినియోగాన్ని పేగుల్లో ఉండే కోట్ల సంఖ్యలోని బ్యాక్టీరియా నియంత్రిస్తుంది. దీనినే మైక్రోబయోమ్ అంటారు. ఒక్కొక్కరి శరీరంలో ఈ బ్యాక్టీరియా తీరు ఒక్కోలా ఉంటుంది. దీనివల్ల ఒకే రకమైన ఆహారం తిన్నా ఒకరు బరువు పెరుగుతారు మరికొందరు పెరగరు. ఈ బ్యాక్టీరియా మనకు అందాల్సిన క్యాలరీలను తన ఆహారంగా తీసుకుంటుంది. ఈ విషయాన్ని క్యాలరీల యాప్ లు లేదా లేబుల్స్ ఎప్పుడూ లెక్కలోకి తీసుకోవు.
లేబుల్స్ అన్నీ మోసమే
ఫుడ్ ప్యాకెట్ల మీద ఉండే క్యాలరీల సమాచారం 20 శాతం అటు ఇటుగా ఉండవచ్చని ప్రభుత్వాలే చెబుతున్నాయి. అంటే 500 క్యాలరీలు అని ఉంటే అది 600 ఉండవచ్చు లేదా 400 కూడా ఉండవచ్చు. అలాగే ప్రాసెస్ చేసిన బ్రెడ్, చిప్స్ వంటివి మన శరీరం 100 శాతం గ్రహిస్తుంది. క్యాలరీల అంకెలను చూసి మోసపోకుండా ఆహారపు నాణ్యతపై దృష్టి పెట్టాలి. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు తీసుకోవడమే ఆరోగ్యకరమైన మార్గం.