- రాజకీయాల్లోకి రానంటూ క్లారిటీ
- పిచ్చి రాతలపై ప్రముఖ నటి ఆగ్రహం
- పవన్ పేరు తీస్తే ఊరుకోనని వార్నింగ్
- మూగజీవాల రక్షణ కోసం పోరాటం
- న్యాయవ్యవస్థ తీరుపై సంచలన వ్యాఖ్యలు
సహనం వందే, హైదరాబాద్:
నటి రేణు దేశాయ్ పేరు వినబడితే చాలు సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఆమె ఏ చిన్న పని చేసినా దానికి రాజకీయ రంగు పూయడం కొందరికి అలవాటుగా మారింది. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య కావడంతో ఆమె రాజకీయ ఎంట్రీపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఈ ప్రచారాలన్నింటికీ ఆమె తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు.
పాలిటిక్స్‌కు నేను దూరం
తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని రేణు దేశాయ్ తేల్చి చెప్పారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కావాలనే తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తనను వాడుకోవడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి అసత్య వార్తలు రాస్తే ఊరుకోనని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె సోమవారం విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించారు. డైనమిక్ లేడీ గా ధైర్యంగా మాట్లాడారు.
పర్సనల్ లైఫ్ మాట్లాడొద్దు…
తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని రేణు దేశాయ్ అన్నారు. పవన్ కల్యాణ్ పేరును ప్రతీ విషయంలోనూ మధ్యలోకి లాగడం అసహ్యకరంగా ఉందని మండిపడ్డారు. తన ప్రైవసీని గౌరవించాలని కోరారు. థంబ్‌నెయిల్స్ కోసం ఇష్టం వచ్చినట్లు రాతలు రాసే వారికి ఈసారి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తప్పుడు కూతలు కూసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోనని తేల్చి చెప్పారు.

మూగజీవాల కోసం ఆవేదన
జంతువుల ప్రాణాల రక్షణ కోసం తాను ఎప్పుడూ ముందుంటానని రేణు దేశాయ్ తెలిపారు. వీధి కుక్కల సమస్యపై కొందరు చేస్తున్న ప్రచారం దారుణంగా ఉందని ఆవేదన చెందారు. తన పిల్లలకు కుక్క కాటు కావాలని కొందరు శాపనార్థాలు పెట్టడంపై ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను మనుషుల ప్రాణాలకు విలువిస్తానని.. అదే సమయంలో జంతువులను చంపడం సమస్యకు పరిష్కారం కాదని ఆమె గట్టిగా వాదించారు.
వ్యవస్థల తీరుపై విమర్శలు
ప్రస్తుతం సమాజంలో ప్రతి వ్యవస్థ అవినీతిమయమైందని రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఉన్నవాళ్లకే న్యాయం జరుగుతోందని ఆరోపించారు. పేదలకు న్యాయం దక్కడం గగనమైపోతోందని అన్నారు. మరి మనుషుల పరిస్థితే ఇలా ఉంటే… మూగజీవాలు ఎక్కడికి వెళ్లి న్యాయం అడగాలని ప్రశ్నించారు. న్యాయం కోసం జంతువులు ఎవరికి మొర పెట్టుకోవాలో చెప్పాలని ఆమె నిలదీశారు.
తీర్పులపై అసహనం
వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రేణు దేశాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తీర్పు ఇచ్చిన జడ్జి తన వ్యక్తిగత అభిప్రాయాలను తీర్పులో కలిపినట్లు అనిపిస్తోందని విమర్శించారు. గతంలో ఆ జడ్జికి కుక్కల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. జంతువులను హింసించడం వల్ల సమస్య పరిష్కారం కాదని… మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు.
సమస్య వస్తే నాకు చెప్పండి
నగరంలో ఎక్కడైనా కుక్కల వల్ల ఇబ్బంది కలిగితే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని రేణు దేశాయ్ సూచించారు. లేదంటే నేరుగా తనకు చెప్పాలని.. తానే దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చంపడం కంటే వాటికి పునరావాసం కల్పించడం ఉత్తమమని చెప్పారు. జంతు ప్రేమికురాలిగా తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని రేణు దేశాయ్ మీడియా సాక్షిగా ప్రకటించారు.