కొలువులు చూపని చదువులు – పట్టాలకే పరిమితమవుతున్న ఉన్నత విద్య

కొలువులు చూపని చదువులు
  • ఉద్యోగాలు కల్పించలేని విద్యా సంస్థల దుస్థితి
  • దేశంలో 75 శాతం కళాశాలల్లో ఇదే పరిస్థితి
  • కాలేజీల్లో కరువైన ఉద్యోగ నైపుణ్యాలు
  • పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు లేని పాఠాలు
  • టీమ్ లీజ్ ఎడ్ టెక్ నివేదికలో చేదు నిజాలు

సహనం వందే, హైదరాబాద్:

దేశంలో డిగ్రీ పట్టాలు గంపలకొద్దీ వస్తున్నాయి. కానీ ఆ పట్టాలకు తగ్గ కొలువులు మాత్రం దొరకడం లేదు. లక్షల రూపాయలు పోసి చదువుతున్నా ఉద్యోగం రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు కేవలం డిగ్రీలను ఇచ్చే ఫ్యాక్టరీలుగా మారుతున్నాయే తప్ప నిపుణులను తయారుచేసే కేంద్రాలుగా రాణించడం లేదు. విద్యా వ్యవస్థలో లోపాలను ఈ నివేదిక ఎండగట్టింది.

Team Lease Edtech Report

అగాధంలో విద్యా వ్యవస్థ
భారతదేశంలోని 75 శాతం ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో విఫలమవుతున్నాయి. టీమ్ లీజ్ ఎడ్టెక్ రూపొందించిన నివేదిక ప్రకారం అత్యధిక కాలేజీలు పరిశ్రమల అవసరాలను పట్టించుకోవడం లేదు. విద్యార్థులు నేర్చుకుంటున్న చదువుకు… బయట మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు అస్సలు పొంతన ఉండటం లేదు. దీనివల్ల చదువు పూర్తయ్యాక యువత రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తోంది.

కరువైన ప్లేస్‌మెంట్స్…
కేవలం 16.67 శాతం విద్యా సంస్థలు మాత్రమే తమ విద్యార్థులకు మెరుగైన ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిల్లో కోర్సు పూర్తయిన 6 నెలల్లోపు 76 నుంచి 100 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించగలుగుతున్నాయి. మిగిలిన విద్యా సంస్థల్లో ప్లేస్‌మెంట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా ఉద్యోగాల విషయంలో యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి.

అప్‌డేట్ లేని సిలబస్
చదువుతున్న పాఠ్యాంశాలు కాలం చెల్లినవి కావడమే పెద్ద శాపంగా మారింది. కేవలం 8.6 శాతం కాలేజీలు మాత్రమే పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్‌ను రూపొందించుకున్నాయి. 51.01 శాతం సంస్థల్లో అసలు పరిశ్రమలతో సంబంధమే లేని పాఠాలు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థులు థియరీలో పాస్ అవుతున్నా ప్రాక్టికల్ నాలెడ్జ్‌లో వెనుకబడిపోతున్నారు.

అనుభవం లేని బోధన
పరిశ్రమల్లో అనుభవం ఉన్న నిపుణులను ప్రొఫెసర్లుగా నియమించుకోవడంలో కాలేజీలు వెనుకబడ్డాయి. కేవలం 7.56 శాతం సంస్థల్లో మాత్రమే ప్రాక్టీస్ ప్రొఫెసర్లు ఉన్నారు. అలాగే 60 శాతానికి పైగా కాలేజీలు అదనపు సర్టిఫికేషన్ కోర్సులను అందించడం లేదు. ఫలితంగా విద్యార్థులకు ఆధునిక పని వాతావరణంపై కనీస అవగాహన ఉండటం లేదు.

ఇంటర్న్‌షిప్ కష్టాలు
ప్రాక్టికల్ అనుభవం కోసం తప్పనిసరిగా ఉండాల్సిన ఇంటర్న్‌షిప్పులు చాలా కాలేజీల్లో లేవు. కేవలం 9.4 శాతం సంస్థలు మాత్రమే తమ అన్ని కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాయి. సుమారు 37.8 శాతం కాలేజీలకు అసలు ఇంటర్న్‌షిప్ నిర్మాణం అనేదే లేదు. లైవ్ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులకు నైపుణ్యం పెంచే ప్రయత్నాలు కేవలం 9.68 శాతం చోట్ల మాత్రమే జరుగుతున్నాయి.

పెరగాల్సిన సమన్వయం
ఉద్యోగాల కల్పనలో కీలకమైన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ కూడా బలహీనంగా ఉంది. కేవలం 5.44 శాతం కాలేజీల్లో మాత్రమే పాత విద్యార్థులు యాక్టివ్‌గా ఉన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. పరిశ్రమలతో ఒప్పందాలు, ప్రాక్టికల్ విద్యే లక్ష్యంగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *