- రైతులపై పెరగనున్న అదనపు భారం
- అధిక ధరలకు దిగుమతితో రేటు రెట్టింపు?
సహనం వందే, హైదరాబాద్:
ఇరాన్ యుద్ధం ఎరువుల ఫ్యాక్టరీల గొంతును నొక్కేస్తోంది. సహజ వాయువు సరఫరా ఆగిపోవడంతో భారత రైతుల పొలాల్లో పంటలు పండించే శక్తి తగ్గిపోతోంది. దేశీయ తయారీ కేంద్రాలు నిలిచిపోయాయి. ఆహార భద్రత ప్రమాదంలో పడింది. కోట్లాది రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందోనని దేశం మొత్తం భయంతో చూస్తోంది. అసలు ఏం జరుగుతోంది.
యుద్ధం పెంచిన కష్టం
ఇరాన్ యుద్ధం దేశ ఇంధన సరఫరాను అతలాకుతలం చేసింది. ఖతార్ నుంచి వచ్చే ద్రవ వాయువు సరఫరా నిలిచిపోయింది. దీనితో ఎరువుల తయారీకి కావాల్సిన కీలక ముడిపదార్థం దొరకడం లేదు. భారత ప్లాంట్లు ఉత్పత్తిని నిలిపివేశాయి. ఇది దేశ ఎరువుల ఉత్పత్తికి పెద్ద ఆటంకంగా మారింది.
ఉత్పత్తి నిలిపిన దిగ్గజాలు
ఎరువుల తయారీకి ద్రవ వాయువు ప్రాణాధారం. ప్రస్తుతం ఇండియాలోని పరిశ్రమలకు కావాల్సిన గ్యాస్‌లో 70 శాతం మాత్రమే అందుతోంది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ వంటి అగ్రగామి సంస్థలు ప్లాంట్లను నిలిపివేశాయి. ఒకసారి నిలిపివేసిన ప్లాంట్‌ను మళ్లీ ప్రారంభించడానికి గ్యాస్ సరఫరా ఉన్నా 30 రోజుల సమయం పడుతుంది. దీంతో పరిస్థితి అంత గందరగోళంగా ఉంది.
పెరగనున్న ప్రభుత్వ భారం
ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా దిగుమతిదారు. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే విదేశాల నుంచి ఎక్కువ ధరకు ఎరువులు కొనాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వ సబ్సిడీ భారాన్ని రెట్టింపు చేస్తుంది. జూన్ నెలలో వచ్చే రుతుపవనాల సమయంలో ఎరువులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అప్పటికి పరిస్థితి చక్కబడకపోతే దేశ వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతుంది. అంతేకాదు ప్రస్తుత రబీ సీజన్లోనూ యూరియాకు కటకట ఏర్పడనుంది.
పంటలపై పడనున్న ప్రభావం
వ్యవసాయ ఖర్చులు పెరిగితే పంటల ధరలు మండిపోతాయి. ఇది సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారాన్ని పెంచుతుంది. ఇండియా వరి ఎగుమతిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గోధుమలు, పత్తి, చక్కెర ఉత్పత్తిలో ఇండియా 2వ స్థానంలో ఉంది. ఈ ముఖ్యమైన పంటల సాగుపై ఎరువుల సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.
నిల్వలపైనే ఆశ
ఎరువుల మంత్రిత్వ శాఖ గ్యాస్ సరఫరాపై దృష్టి పెట్టింది. తయారీదారులకు 70 శాతం గ్యాస్ అందేలా చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి దేశంలో 180 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. ప్రభుత్వం ఈ నిల్వలపైనే ఇప్పుడు గంపెడు ఆశలు పెట్టుకుంది.
దిగుమతులపై తీవ్ర ఒత్తిడి
ఎరువుల తయారీదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్యాస్ కొరతతో ఇండియా స్పాట్ మార్కెట్ వైపు పరుగులు తీస్తోంది. ఇండియాకు చెందిన గెయిల్, జీఎస్పీసీ సంస్థలు స్పాట్ మార్కెట్‌లో టెండర్లు పిలిచినా అవి ఖరారు కాలేదు. దీనితో ఇంధనం కొరత స్పష్టంగా కనిపిస్తోంది. సరఫరాలో ఏర్పడిన ఈ గ్యాప్ దేశీయ ఎరువుల లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది.