- యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పనుల్లో వేగం
- త్వరలో కొలువుదీరనున్న ఫ్యూచర్ సిటీ
- ఆయా పరిసరాల్లో రియల్ ఎస్టేట్ సందడి
- భారీగా పెరుగుతున్న పెట్టుబడుల వెల్లువ
- సామాన్యులకు అందుబాటులో ప్లాట్లు
- గజం ధర సుమారు 20 వేల రూపాయలు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి పోస్తోంది. ముచ్చర్ల వేదికగా అడుగులు పడుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేయబోతోంది. పారిశ్రామిక దిగ్గజాలు, ప్రభుత్వ పెద్దల కలయికతో ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. దీంతో పెట్టుబడిదారులకు హైదరాబాద్ దక్షిణ ప్రాంతం ఇప్పుడు హాట్ కేకులా మారింది.

ముచ్చర్లలో నవశకం
తెలంగాణ నిరుద్యోగులకు నైపుణ్యం అందించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అవుతోంది. ఈ విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నారు. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. పారిశ్రామిక వేత్తల భాగస్వామ్యం ఉండటంతో ఈ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఫ్యూచర్ సిటీగా పిలుస్తున్న ముచ్చర్లలో దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రియల్ ఎస్టేట్ లో జోరు
యూనివర్సిటీ ఏర్పాటుతో ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. తుక్కుగూడ, శంషాబాద్ విమానాశ్రయం వైపు పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. హెచ్ఎండీఏ, రెరా నిబంధనల ప్రకారం వెలుస్తున్న లేఅవుట్లకు గిరాకీ పెరిగింది. ప్రభుత్వం ఇక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
సిరిగిరిపురంలో ప్లాట్ల సందడి…
మహేశ్వరం సమీపంలోని సిరిగిరిపురంలో కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. ఇక్కడ 167 గజాల ప్లాట్ సుమారు 33.4 లక్షల రూపాయలకు అందుబాటులో ఉంది. అంటే గజం ధర 20 వేల రూపాయలు పలుకుతోంది. ఇవి హెచ్ఎండీఏ, రెరా ఆమోదం పొందిన ప్లాట్లు కావడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఐటీ, ఇండస్ట్రియల్ హబ్ గా మారనుండటమే ఇందుకు ప్రధాన కారణం.
తుమ్మలూరులో ఫ్యూచర్ సిటీ కళ
ఫ్యూచర్ సిటీకి అతి సమీపంలో ఉన్న తుమ్మలూరులో ఎఫ్ సీడీఏ ఆమోదిత ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ క్లబ్ హౌస్ వంటి ఆధునిక వసతులతో వెంచర్లు రూపుదిద్దుకుంటున్నాయి. 267 గజాల ప్లాట్ ధర సుమారు 60 లక్షల రూపాయలుగా ఉంది. ఇక్కడ గజం ధర 22,500 రూపాయలుగా నిర్ణయించారు. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తుండటంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
రాజకీయ వ్యూహంతో అభివృద్ధి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నగరానికి ఒకవైపు మాత్రమే అభివృద్ధి పరిమితం కాకుండా అన్ని వైపులా విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే దక్షిణ హైదరాబాదులో ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టారు. ఆనంద్ మహీంద్రా వంటి పెద్దలు తోడవడంతో ఇక్కడ పెట్టుబడులకు భరోసా లభిస్తోంది. ఇది కేవలం విద్యా కేంద్రంగానే కాకుండా ఒక ఆర్థిక మండలిగా ఎదగనుంది.