పెట్టు’బ్యాడ్’లు – పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోర వైఫల్యం

No Investments
  • ఎర్ర తివాచీ పరిచినా రాని విదేశీ పెట్టుబడులు
  • 2023లో కేవలం 5.90 లక్షల కోట్లే రాక
  • చట్టాల చిక్కుముడులు… రాజకీయాల సెగ
  • చైనాకు ప్రత్యామ్నాయమైనా తప్పని తిప్పలు
  • అమెరికా నుంచి రాని ఇండియన్ల సంపద
  • రాజకీయ అనిశ్చితి… సంకీర్ణాల భయం

సహనం వందే, న్యూఢిల్లీ:

భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది. ప్రపంచ దేశాలు అసూయ పడేలా వృద్ధి రేటు నమోదవుతోంది. కానీ ఈ వేగానికి తగ్గట్టుగా పెట్టుబడులు రావడం లేదు. బ్లూంబెర్గ్ విశ్లేషకుడు మిహిర్ శర్మ మాటల్లో చెప్పాలంటే పెట్టుబడులను ఆకర్షించడంలో మన దేశం వెనకబడుతుంది. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగడం లేదు. అంతర్జాతీయ రాజకీయాలు, దేశీయ విధానాల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఒక సందిగ్ధంలో పడింది.

Strong Growth.. Weak investments

మన వైపు మళ్ళని పెట్టుబడులు…
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. గత ఆరేళ్లుగా 7 శాతం పైగా వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రపంచ జీడీపీలో మన వాటా 3.5 శాతానికి చేరింది. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే 2023లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం 5.90 లక్షల కోట్లు మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్లో భారత బ్రాండ్ విలువ పెరుగుతున్నా వాస్తవ పెట్టుబడులు మన వైపు మళ్ళడం లేదు.

విదేశీ ప్రవాహం ఎందుకు తగ్గింది?
విదేశీ పెట్టుబడులు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. సర్వీసులు, తయారీ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నా అవి స్థిరంగా లేవు. 2024 మొదటి త్రైమాసికంలో పెట్టుబడుల తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. మార్కెట్లో అస్థిరత, రాజకీయ అనిశ్చితి ప్రధాన అడ్డంకులుగా మారాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు మొదటి మూడు నెలల్లో రూ. 22,500 కోట్లుగా ఉన్నాయి. ఈ ప్రవాహం గాలివాటంలా ఉండటం ఆందోళనకరం.

విధానాల వైఫల్యం… రెగ్యులేటరీ గండం
భారతదేశంలో వ్యాపారం చేయడం అంటే ఇంకా కత్తి మీద సాములాగే ఉంది. చట్టాలు, భూసేకరణ నిబంధనలు పెట్టుబడిదారులను బెంబేలెత్తిస్తున్నాయి. పన్ను విధానాల్లో స్పష్టత లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. జీఎస్‌టీ అమలులో ఉన్న చిక్కుముడులు ఇంకా వీడలేదు. చైనా నుంచి బయటకు వస్తున్న కంపెనీలు వియత్నాం లేదా ఇండోనేషియా వైపు చూస్తున్నాయి. రాజకీయ అనిశ్చితి, సంకీర్ణ రాజకీయాల భయం పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నాయి. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం వల్ల మనకు లాభం జరుగుతుందని ఆశించాం. కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు అక్కడే పెట్టుబడులు పెడుతున్నారు… కానీ సొంత దేశానికి పంపడం లేదు.

పొరుగు దేశాల పోటీ… సవాళ్లు
పెట్టుబడుల వేటలో మనకు వియత్నాం, ఇండోనేషియా గట్టి పోటీ ఇస్తున్నాయి. అక్కడ వ్యాపార వాతావరణం సరళంగా ఉంది. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు కొంత మేర ఆకట్టుకున్నా క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయి. నిబంధనల పేరుతో రెగ్యులేటరీ సంస్థలు ఇబ్బంది పెడుతున్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు జరిగితేనే పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది.

చేయాల్సిన మార్పులు… భవిష్యత్తు
భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మాటలు సరిపోవు. చేతల్లో మార్పు రావాలి. రెగ్యులేటరీ సంస్కరణలను వేగంగా అమలు చేయాలి. పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయాలి. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా, యూరప్ దేశాలతో సంబంధాలు మరింత దృఢం చేసుకోవాలి. చైనాకు అసలైన ప్రత్యామ్నాయంగా నిలబడాలంటే మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *