- చనిపోయిన రోగి బంధువులకు బెదిరింపులు
- డబ్బులు చెల్లిస్తేనే మృతదేహం అప్పగింత
- డాక్టర్లకు టార్గెట్లు పెట్టి కోట్లు వసూలు
- రోగులకు అనవసరంగా వైద్య పరీక్షలు
- అవసరం లేకపోయినా ఐసీయూలో చికిత్స
- రోగుల ప్రాణాలతో ఆటలు… పేదలపై భారం
- ‘గేమ్స్ హాస్పిటల్స్ ప్లే’- ఓ జర్నలిస్టు పుస్తకం
సహనం వందే, హైదరాబాద్:
ప్రైవేటు వైద్య రంగంలో జరుగుతున్న దారుణాలను వివరిస్తూ జర్నలిస్ట్ అబంతిక ఘోష్ రాసిన ‘గేమ్స్ హాస్పిటల్స్ ప్లే’ పుస్తకం సంచలన విషయాలను బయటపెట్టింది. కార్పొరేట్ ఆసుపత్రులు సామాన్యులను ఎలా దోచుకుంటున్నాయో ఈ పుస్తకం కళ్లకు కడుతోంది. చికిత్స పేరుతో సాగుతున్న అక్రమ దందాలు, అనవసరమైన శస్త్రచికిత్సల వెనుక ఉన్న చేదు నిజాలను గణాంకాలతో సహా రచయిత విశ్లేషించారు.
టార్గెట్ల వేటలో వైద్యులు
భారతదేశంలో ప్రైవేట్ వైద్యం ఒక మాఫియాలా విస్తరించింది. ఆస్పత్రులు రోగులను కేవలం వినియోగదారులుగా మాత్రమే చూస్తున్నాయి. వైద్యులకు యాజమాన్యాలు భారీగా టార్గెట్లు విధిస్తున్నాయి. నెలకు ఇన్ని కోట్లు వసూలు చేయాలనే నిబంధనలు పెడుతున్నాయి. దీనివల్ల రోగి అవసరాన్ని బట్టి కాకుండా ఆసుపత్రి ఆదాయం కోసం డాక్టర్లు మందులు రాస్తున్నారు.
పరీక్షల పేరుతో దోపిడీ
చిన్నపాటి జ్వరానికి కూడా వేల రూపాయల పరీక్షలు రాస్తున్నారు. అవసరం లేకున్నా రక్త పరీక్షలు మొదలుకొని స్కాన్ల వరకు టెస్టులు చేయిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా వచ్చే ఆదాయంలో ఆసుపత్రులకు 40 నుంచి 50 శాతం కమీషన్లు అందుతున్నాయి. ల్యాబ్ లతో కుమ్మక్కై రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న పరీక్షల్లో 30 శాతం అనవసరమైనవే.
ఆపరేషన్ల మాయాజాలం
సాధారణ ప్రసవాలు అయ్యే అవకాశం ఉన్నా సిజేరియన్లకే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఆసుపత్రికి వచ్చే ఆదాయం 50 వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు పెరుగుతోంది. గుండె ఆపరేషన్లు, మోకాళ్ల మార్పిడి వంటి వాటిలోనూ ఇదే తంతు సాగుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో అనవసరంగా స్టెంట్లు కూడా వేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల నివేదికల ప్రకారం శస్త్రచికిత్సల ద్వారానే వారికి 70 శాతం లాభాలు వస్తున్నాయి.
మందుల ధరల మంట
ప్రైవేటు ఫార్మసీల్లో మందుల ధరలు చుక్కలు అంటుతున్నాయి. బయట తక్కువకు దొరికే మందులను ఆసుపత్రిలోనే కొనాలని నిబంధన పెడుతున్నారు. ఒకే రకమైన మందుపై 200 నుండి 300 శాతం వరకు లాభం ఆర్జిస్తున్నారు. భారతీయ కుటుంబాలు మందుల కోసమే ఏడాదికి సగటున 40 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాయి.
ఐసీయూ గదుల దందా
రోగి పరిస్థితి నిలకడగా ఉన్నా ఐసీయూలో ఉంచి డబ్బులు గుంజుతున్నారు. రోజుకు ఐసీయూ అద్దె 20 వేల రూపాయల నుండి 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వెంటిలేటర్ అవసరం లేకున్నా పెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మరణించిన తర్వాత కూడా శవాలను అప్పగించకుండా బిల్లుల కోసం వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ నియంత్రణ కరువు
ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వ పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం సరిగ్గా అమలు కావడం లేదు. బీమా కంపెనీలు కూడా ఆసుపత్రులతో చేతులు కలిపి ప్రీమియంలు పెంచుతున్నాయి. దేశంలో 60 కోట్ల మంది ప్రజలు వైద్య ఖర్చుల వల్ల పేదరికంలోకి మగ్గిపోతున్నారు.
పరిష్కారం ఎక్కడ?
అబంతిక ఘోష్ తన పుస్తకంలో కేవలం సమస్యలను మాత్రమే కాకుండా పరిష్కారాలను కూడా సూచించారు. రోగులు తమ హక్కుల పట్ల అవగాహన పెంచుకోవాలి. అనవసర పరీక్షలను ప్రశ్నించాలి. ప్రభుత్వం ప్రజారోగ్య రంగంపై ఖర్చును పెంచాలి. అప్పుడే కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. వైద్యం కోసమని వెళ్లి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదంటే వ్యవస్థలో సమూల మార్పులు రావాలని అబంతిక పిలుపునిచ్చారు.