- మహిళలు స్వతంత్రంగా ఉండొద్దంటున్న తరం
- భర్తకు భార్యలు లోబడి ఉండాలనేదే ఉద్దేశం
- స్త్రీకి హక్కులు ఎక్కువయ్యాయని విమర్శలు
- పాత తరం ఆలోచనల కంటే అధ్వాన్నం
- 29 దేశాల్లో 23 వేల మంది సర్వే సంచలనం
సహనం వందే, హైదరాబాద్:
ప్రపంచం ఆధునికత వైపు పరుగులు తీస్తుంటే నేటి యువత మాత్రం తిరోగమన బాట పడుతోంది. గత తరం కంటే నేటి తరమే పాతకాలపు పద్ధతులకు జై కొడుతోంది. పెళ్లైన తర్వాత భార్యలు భర్తలకు లోబడి ఉండాలని… కీలక నిర్ణయాల్లో మగవారిదే పైచేయి కావాలని జెన్ జెడ్ యువకులు బల్లగుద్ది చెబుతున్నారు. 29 దేశాల్లో 23 వేల మందిపై చేసిన సర్వే విస్తుపోయే నిజాలను వెల్లడించింది.

తిరగబడ్డ తరం…
ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో జెన్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవారు) యువకులు ఆశ్చర్యకరమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దాదాపు 33 శాతం మంది కుర్రాళ్లు భార్య భర్త మాట వినాలని నమ్ముతున్నారు. 33 శాతం మంది భర్తకే నిర్ణయాధికారం ఉండాలని కోరుకుంటున్నారు. బేబీ బూమర్ల (1946-1964) తరంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. పాత తరంలో కేవలం 13 శాతం మంది మాత్రమే భార్య లొంగి ఉండాలని భావించారు.
దేశాల వారీగా తేడాలు
లింగ సమానత్వంపై ఒక్కో దేశంలో ఒక్కో రకమైన స్పందన వచ్చింది. ఇండోనేషియాలో 66 శాతం మంది, మలేషియాలో 60 శాతం మంది సంప్రదాయ ధోరణినే సమర్థించారు. అమెరికాలో 23 శాతం, బ్రిటన్లో 13 శాతం మంది ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. మహిళల్లో కూడా మార్పు కనిపిస్తోంది. 18 శాతం జెన్ జెడ్ యువతులు, 6 శాతం బేబీ బూమర్ మహిళలు కూడా భార్యలు భర్తలకు లోబడి ఉండాలని చెప్పడం విశేషం.
స్వేచ్ఛపై ఆంక్షలు…
మహిళలు మరీ స్వతంత్రంగా ఉండకూడదని 24 శాతం జెన్ జెడ్ యువకులు భావిస్తున్నారు. బేబీ బూమర్లలో ఈ ఆలోచన 12 శాతం మందికి మాత్రమే ఉంది. శృంగారం విషయంలోనూ కుర్రాళ్లది పాత పద్ధతే. 21 శాతం మంది యువకులు మహిళలు చొరవ తీసుకోకూడదని నమ్ముతున్నారు. 59 శాతం మంది పురుషులు సమానత్వం కోసం మరీ ఎక్కువగా కష్టపడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
వింత వైరుధ్యం
ఒకవైపు మహిళలు స్వతంత్రంగా ఉండకూడదంటూనే… మరోవైపు కెరీర్‌లో సక్సెస్ అయిన మహిళలే ఆకర్షణీయమని 41 శాతం మంది జెన్ జెడ్ యువకులు చెప్పారు. 2019లో మహిళలకు హక్కులు ఎక్కువయ్యాయని 42 శాతం మంది భావించగా… ఇప్పుడు ఆ సంఖ్య 52 శాతానికి పెరిగింది. సామాజిక హోదాను కోల్పోతామనే భయం యువకుల్లో ఈ రకమైన అసహనాన్ని పెంచుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పురుషత్వపు సంకెళ్లు…
యువకులు తమపై తామే ఆంక్షలు విధించుకుంటున్నారు. 30 శాతం మంది జెన్ జెడ్ యువకులు స్నేహితులకు ఐ లవ్ యూ చెప్పకూడదని నమ్ముతున్నారు. పిల్లల పెంపకంలో పాలుపంచుకుంటే పురుషత్వం తగ్గుతుందని 21 శాతం మంది భావించారు. బేబీ బూమర్లలో ఈ భావన కేవలం 8 శాతమే ఉంది. డేటింగ్, బట్టలు, ఇంటి పనుల్లో మహిళలకు ఎక్కువ ఎంపికలు ఉన్నాయని సర్వేలో తేలింది.
ఆర్థిక కారణాలు
పురుషాధిక్య నిరూపణకు గతంలో ఆస్తులు, సంపాదన కొలమానంగా ఉండేవి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇల్లు కొనడం లేదా కుటుంబ పోషణ కుర్రాళ్లకు భారంగా మారింది. ఈ వైఫల్యం వారిని పాతకాలపు ఆలోచనల వైపు నెడుతోంది. సమాజం ఆశించే బాధ్యతలకు, వ్యక్తిగత ఆలోచనలకు మధ్య పెద్ద అగాధం ఉంది. బ్రిటన్లో 14 శాతం మంది మాత్రమే మహిళలే పిల్లల్ని సాకాలని అన్నా సమాజం మాత్రం వారినే బాధ్యుల్ని చేస్తోందని 43 శాతం మంది నమ్ముతున్నారు.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్