- రక్తం అందక తల్లడిల్లినట్టు గుండె కన్నీరు
- మనిషి నిర్లక్ష్యంపై కేసు పెట్టిన అవయవాలు
- జడ్జి తీర్పు… అందరికీ కనువిప్పు
(“కోర్టు గది కాదు ఇది…” –
“నీ శరీరం లోపల నడుస్తున్న కేసు!”
“గుండె అరుస్తోంది…”
“రక్తం రావట్లేదని!”
“లివర్ చెప్తోంది…”
“పదేళ్లుగా హెచ్చరిస్తున్నానని!”
“ఊపిరితిత్తులు గగ్గోలు…”
“పొగతో నింపేశావని!”
“మెదడు మండిపోతుంది…”
“విశ్రాంతి ఇవ్వలేదని!”
“నువ్వు మాత్రం…”
‘అన్నీ లైట్ తీసుకున్నావు!’
“శరీరం మాట వినకపోతే…”
“అది సమ్మె చేస్తుంది!”
“ఇది కథ కాదు…”
“మనందరి జీవితం!”
“బాడీ సిగ్నల్స్ ఇగ్నోర్ చేయకు…”
“లేట్ అయితే… ‘తుది తీర్పే’!”
“దేహమే న్యాయమూర్తి!”)
కోర్టులో న్యాయమూర్తి నల్ల కోటు తీసి తెల్ల కోటు వేశారు. బోనులో 60 ఏళ్ళ రామయ్య నిలబడ్డాడు. తన సొంత అవయవాలే తనపై కేసు వేశాయని తెలిసి విస్తుపోయాడు. ప్రతి అవయవం తన బాధను జడ్జి ముందు ఏకరువు పెట్టాయి. మన శరీరం ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయో కళ్ళకు కట్టినట్లు అద్భుతమైన కథతో చెబుతున్నారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గురజాల కిరణ్ కుమార్. ఈ కథనం చదవండి.
గుండె చప్పుడు వినలేదు…
కోర్టులో… నా పేరు గుండె అంటూ ఒక అవయవం తన వాదన మొదలుపెట్టింది. రక్తాన్ని సరఫరా చేసే నా నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంటే రామయ్య పట్టించుకోలేదని వాపోయింది. అప్పుడప్పుడు ఆయాసం వచ్చినా… ఎడమ చేయి లాగుతున్నా అది గ్యాస్ సమస్య అని కొట్టిపారేశాడని వాపోయింది. ఛాతిలో చిన్న నొప్పి, అకస్మాత్తుగా వచ్చే చెమటలు గుండె ఇచ్చే ముందస్తు హెచ్చరికలని తెలుసుకోలేదని కోర్టుకు విన్నవించింది. రక్త సరఫరా అందక నేను ఎంత తల్లడిల్లానో ఈ రామయ్యకు అర్థం కాలేదని కన్నీరు పెట్టింది.
లివర్ లొల్లి…
కాలేయం తన గొంతు విప్పింది. శరీరంలో 120 పనులు చేసే నన్ను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. హెపటైటిస్ వైరస్ సోకినప్పుడు వందల సార్లు హెచ్చరించానని చెప్పింది. కడుపు ఉబ్బరం రావడం, గ్యాస్ రావడం, కళ్ళు పచ్చగా మారడం ఇవన్నీ నేను చేసిన సంకేతాలేనని గుర్తు చేసింది. మూత్రం పసుపు రంగులోకి మారినా, బరువు తగ్గుతున్నా రామయ్య మేలుకోలేదని జడ్జికి వివరించింది. పదేళ్లు పోరాటం చేసి అలసిపోయి ఇక పనులు ఆపేశానని తన దీనగాథను వినిపించింది.
శ్వాస తీసుకోని ఊపిరితిత్తులు
తర్వాతి వంతు ఊపిరితిత్తులది. ప్రాణాధారమైన నన్ను ధూమపానం, కాలుష్యంతో నింపేశాడని ఆరోపించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 32 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నా రామయ్యకు భయం లేదని ఎద్దేవా చేశాయి. దగ్గు తగ్గకపోయినా, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా పట్టించుకోలేదని నిలదీశాయి. పెదాలు, నాలుక నీలి రంగులోకి మారడం అనేది తీవ్రమైన ముప్పునకు సంకేతమని గ్రహించలేదని ఆవేదన చెందాయి. గాలి అందక నేను పడుతున్న పాట్లు రామయ్యకు అర్థం కాలేదని మండిపడ్డాయి.
మండిపడ్డ మెదడు
మెదడు సైతం తన గోడు చెప్పుకుంది. తలనొప్పి వస్తున్నా, నిద్ర పట్టకపోయినా మందులతో కాలం గడిపేశాడని వాపోయింది. అన్ని అవయవాలను సమన్వయం చేసే నాకే విశ్రాంతి ఇవ్వలేదని తప్పుబట్టింది. తల తిరగడం వంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోవడం వల్ల పక్షవాతం వంటి ముప్పులు పొంచి ఉంటాయని హెచ్చరించింది. ఆలోచనలు భారంగా మారినప్పుడు, జ్ఞాపకశక్తి తగ్గుతున్నప్పుడు కూడా రామయ్య నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని స్పష్టం చేసింది.
జడ్జి తీర్పు…
అవయవాల ఆవేదన విన్న తర్వాత జడ్జి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. శరీరంలో ప్రతి చిన్న మార్పు వెనుక ఒక అర్థం ఉంటుంది. గాయాలు త్వరగా మానకపోతే జింక్ లోపమని, కండరాలు బలహీనపడితే పొటాషియం తగ్గిందని గుర్తించాలి. విపరీతమైన అలసట వస్తుంటే మెగ్నీషియం అవసరమని తెలుసుకోవాలి. హృదయ స్పందనలో మార్పులు వస్తే మాంగనీస్ లోపం ఉన్నట్టే. ఎముకల నొప్పులు, గోర్లు మెత్తబడటం క్యాల్షియం కొరతకు నిదర్శనం. చర్మం పాలిపోయి, తలనొప్పి వస్తుంటే ఐరన్ లోపం వల్ల రక్తహీనత కలిగిందని అర్థం చేసుకోవాలని జడ్జి హితవు పలికారు.
దేహ భాష నేర్చుకోండి
జడ్జి ఇంకా కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాష, దేశ భాషలాగే శరీరానికి ఒక భాష ఉంటుందని గుర్తు చేశారు. 40 ఏళ్ల వరకు దేహం నీ మాట వింటుందని… ఆ తర్వాత నువ్వే దేహం మాట వినాలని సూచించారు. అవయవాలు చేసే హెచ్చరికలను వినకపోతే అవి సమ్మె చేయడం ఖాయమని హెచ్చరించారు. రామయ్యను శిక్షించడం కంటే, ప్రజలంతా తమ శరీర భాషను అర్థం చేసుకుని ఆరోగ్యంగా ఉండటమే ఈ తీర్పు ఉద్దేశమని ప్రకటించారు.
