- శుభాన్షుకు అశోక చక్ర… ప్రశాంత్ కు కీర్తి చక్ర
- అంతరిక్ష యోధులకు సమున్నత గౌరవం
- సరికొత్త చరిత్రకు భారత ప్రభుత్వం శ్రీకారం
సహనం వందే, న్యూఢిల్లీ:
భారత గడ్డపై పుట్టిన బిడ్డలు గగన వీధులు దాటి అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. భూమిపై శత్రువుల గుండెల్లో నిదురపోయే వీరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలు ఈసారి నింగిని జయించిన వ్యోమగాములకు దక్కాయి. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకల ఉత్సాహం ఉరకలెత్తుతున్న వేళ… సరిహద్దులు దాటి అనంత విశ్వంలో భారత్ సత్తా చాటిన యోధులను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది.

శుభాన్షు శుక్లాకు అశోక చక్ర
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక చక్ర వరించింది. 2025 జూన్ నెలలో జరిగిన యాక్సియమ్-4 మిషన్ ద్వారా ఆయన అంతరిక్షంలో 18 రోజులు గడిపారు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 2,000 గంటల కంటే ఎక్కువ ఫైటర్ జెట్లను నడిపిన అనుభవం ఉన్న ఈ లక్నో వాసి… ఇప్పుడు కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.
ప్రశాంత్ నాయర్ కు కీర్తి చక్ర
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్ లో కీలక పాత్ర పోషిస్తున్న గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కు రెండో అత్యున్నత పురస్కారం కీర్తి చక్ర లభించింది. శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రలో బ్యాకప్ పైలట్ గా ఉంటూనే గగన్‌యాన్ కోసం కఠినమైన శిక్షణ పొందుతున్నారు. కేరళకు చెందిన ప్రశాంత్ నాయర్ తన అకుంఠిత దీక్షతో గగనగామిగా ఎంపికయ్యారు. దేశ రక్షణలో, అంతరిక్ష పరిశోధనల్లో ఆయన కనబరుస్తున్న అంకితభావానికి ప్రభుత్వం ఈ గుర్తింపునిచ్చింది.
అంతరిక్షంలో 60 ప్రయోగాలు…
శుభాన్షు శుక్లా అంతరిక్ష కేంద్రంలో ఉన్న సమయంలో కేవలం పర్యటనకే పరిమితం కాలేదు. సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో మానవ శరీరంలో వచ్చే మార్పులు, అంతరిక్ష వ్యవసాయం వంటి అంశాలపై 60 కంటే ఎక్కువ సంక్లిష్టమైన ప్రయోగాలు చేశారు. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయ పౌరుడు అంతరిక్షంలోకి వెళ్లి త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం దేశానికే గర్వకారణం. ఇస్రో, నాసా సంయుక్తంగా నిర్వహించిన ఈ మిషన్ లో శుభాన్షు తన ప్రతిభను ప్రపంచానికి చాటారు.
మహిళా అధికారుల మెరుపులు
కేవలం అంతరిక్ష వీరులే కాకుండా భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులకు కూడా శౌర్య చక్ర పురస్కారాలు దక్కాయి. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా కె, రూప ఎ లు నావికా సాగర్ పరిక్రమ-2 లో భాగంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. 21,600 నాటికల్ మైళ్ల దూరాన్ని 8 నెలల పాటు సముద్రంలో ప్రయాణించి పూర్తి చేశారు. వీరి సాహస కృత్యాలను గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారికి ఈ గౌరవాన్ని ప్రకటించారు.
గణతంత్ర వేడుకల్లో నివాళి
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలు అందజేస్తారు. ఇందులో ఒక అశోక చక్ర, మూడు కీర్తి చక్రాలు, 13 శౌర్య చక్రాలు ఉన్నాయి. మరణానంతరం కూడా ఆరుగురు వీరులకు పురస్కారాలు దక్కాయి. శాంతి సమయాల్లో చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఇచ్చే ఈ పురస్కారాలు ఇప్పుడు గగన తలంలో భారత కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తున్నాయి.