- రాబోయే ఎన్నికల్లో గెలుస్తా
- అందుకోసం తెలంగాణ జాగృతి పార్టీ
- హరీష్ గుంట నక్కని… అన్న ‘గుడ్డి’ అని ఫైర్
- మేఘా సంస్థకు కొమ్ము కాస్తున్నారని ఎటాక్
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సెగలు పుట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లపై ఆమె యుద్ధం ప్రకటించారు. నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో కీలక ఆరోపణలు చేస్తూ గులాబీ గూటిలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్, అటు పార్టీ భవిష్యత్తుపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. తద్వారా నెక్స్ట్ సీఎం తానేనన్న సిగ్నల్ ఇచ్చారు.
హరీష్ రావు గుంటనక్క అంటూ సెటైర్లు…
నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారం ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే హరీష్ రావు గుంటనక్కలా రంగంలోకి దిగారని విమర్శించారు. ఆయన మాటలను నమ్మి కేటీఆర్ కూడా గుడ్డిగా ప్రెస్ మీట్ పెట్టారని ఎద్దేవా చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె ఆదివారం విలేకరు సమావేశంలో ఘాటుగా స్పందించారు.
పెద్ద తిమింగలం కోసమే తాపత్రయం
నైనీ టెండర్ల వెనుక పెద్ద కథే ఉందని కవిత ఆరోపించారు. కేవలం మేఘా కృష్ణారెడ్డి ప్రయోజనాలను కాపాడటమే హరీష్ రావు లక్ష్యమని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో సృజన్ రెడ్డి కేవలం ఒక చిన్న చేప మాత్రమేనని చెప్పారు. అసలైన పెద్ద తిమింగలం మేఘా సంస్థను కాపాడేందుకు హరీష్ రావు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

జాగృతి పార్టీ సిద్ధం
రాజకీయ భవిష్యత్తుపై కవిత క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. త్వరలో తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో తన పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
విభజన దిశగా గులాబీ గూడు
హరీష్ రావు జిత్తులమారి రాజకీయాల వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. నాయకత్వంలోని లోపాలను ఎండగడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో చీలికను సూచిస్తున్నాయి. తెలంగాణ జాగృతి వేదికగా మహిళా హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
సీరియల్ లాగా ఫోన్ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత విమర్శించారు. ఈ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతూ కార్తీకదీపం సీరియల్‌ను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికల రాజకీయాల కోసమే ఈ అంశాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదుల కోసం వాడాల్సిన సాంకేతికతను రాజకీయ నాయకులపై వాడటం సరికాదని హితవు పలికారు. విచారణను సాగదీయకుండా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మహిళా అధికారుల ఆత్మగౌరవం
పార్టీలో మహిళా అధికారుల పట్ల జరుగుతున్న వివక్షను కవిత ఎండగట్టారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా వార్తలు వస్తే దాడులు చేసే వారు మహిళా ఐఏఎస్ అధికారులను కించపరిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్న మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. మహిళల ఆత్మగౌరవం విషయంలో బీఆర్‌ఎస్ నాయకత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.