జెన్ జెడ్ జీరో పీస్ – విలాసవంతమైన జీవితం… విపరీత ఒత్తిడి

GenZ Zero peace
  • సౌకర్యాల స్వర్గం.. ఆందోళనల నరకం!
  • డిజిటల్ వ్యసనం… భవిష్యత్తుపై భయం
  • పాత తరంతో పోలిస్తే 80 శాతం అధిక టెన్షన్

సహనం వందే, హైదరాబాద్:

నేటి తరం (జెన్ జెడ్) యువతకు ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్.. కళ్ల ముందు అనంతమైన ప్రపంచం ఉంది. పాత తరంతో పోలిస్తే తిండి, బట్ట, వసతులకు లోటు లేదు. కానీ గుండెల్లో మాత్రం ఏదో తెలియని గుబులు. సౌకర్యాల మధ్య పెరుగుతున్నా శాంతి కరువవుతోంది. ఆందోళన, కుంగుబాటు ఇప్పుడు వీరిని నీడలా వెంటాడుతున్నాయి.

ఆందోళనల అడ్డాగా యువత
జెన్ జెడ్ అని పిలిచే 12 నుండి 27 ఏళ్ల యువతలో మానసిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. పాత తరంతో పోలిస్తే వీరిలో ఆందోళనలు, నిరాశ 80 శాతం ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 65 శాతం మంది గత రెండేళ్లలో ఏదో ఒక మానసిక సమస్యను ఎదుర్కొన్నారు. వీరిలో 19 శాతం మంది తీవ్రమైన ఒత్తిడితో సతమతమవుతున్నారు. గతంలో పరీక్షలు, ఉద్యోగాల కోసం మాత్రమే టెన్షన్ పడేవారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ప్రాణం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

అరచేతిలో అభద్రతా భావం
స్మార్ట్ ఫోన్ వాడకం యువత ఆలోచనా విధానాన్ని మార్చేసింది. నిరంతరం సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల తమ జీవితం తక్కువనే భావన పెరుగుతోంది. ప్రత్యక్షంగా మనుషులతో మాట్లాడటం తగ్గిపోయింది. గంటల కొద్దీ ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో గడపడం వల్ల ఒంటరితనం పెరుగుతోంది. ఇది మెల్లగా మానసిక వ్యాధిగా మారుతోంది. టెక్నాలజీ ప్రపంచాన్ని దగ్గర చేసినా.. మనుసుల మధ్య దూరాన్ని పెంచుతోంది.

Gen Z in ?

పర్యావరణ భయం.. ఆర్థిక భారం
వరుసగా వస్తున్న విపత్తులు కూడా యువతను భయపెడుతున్నాయి. వాతావరణ మార్పులు, పెరిగే కాలుష్యం, ఆర్థిక అస్థిరత వంటివి వీరిని నిద్ర నుంచి దూరం చేస్తున్నాయి. గత తరాలకు ఇలాంటి అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు తెలిసేవి కావు. కానీ నేడు ప్రతి చిన్న విపత్తు క్షణాల్లో ఫోన్ లో కనిపిస్తోంది. యుద్ధాలు, రాజకీయం, ఆర్థిక సంక్షోభాల వార్తలు చూస్తూ యువత తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతోంది. ఆ నిరంతర వార్తల ప్రవాహం వారి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

పట్టణ జీవనపు పంజా
మనుషులు ఎక్కడ నివసిస్తున్నారు అనే దానిపై కూడా వారి మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంది. పల్లెటూళ్లు, ప్రకృతి ఒడిలో ఉండే వారి కంటే నగరాల్లో ఉండేవారు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. ట్రాఫిక్ గొడవలు, శబ్ద కాలుష్యం, కాంక్రీట్ వనాల మధ్య బతుకుతూ ప్రశాంతత కోల్పోతున్నారు. ప్రకృతికి దూరమవ్వడం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగాల కోసం నగరాలకు వచ్చే యువత ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ప్రకృతితో గడిపే వారికి మానసిక సమస్యలు తక్కువగా ఉంటున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

అవగాహన పెరిగింది.. కానీ
ఈ తరంలో మంచి మార్పు ఏమిటంటే మానసిక ఆరోగ్యంపై బహిరంగంగా మాట్లాడుతున్నారు. పాత రోజుల్లో మానసిక సమస్యలను దాచిపెట్టేవారు. అందుకే అప్పట్లో గణాంకాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు యువత డాక్టర్లను సంప్రదించడానికి వెనకాడటం లేదు. దీనివల్ల సమస్యలు బయటకు వస్తున్నాయి. ఇది ఒక రకంగా సానుకూల పరిణామమే. సమాజం కూడా వీరిని బలహీనులుగా చూడకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం సౌకర్యాలు కల్పిస్తే సరిపోదు.. మానసిక ధైర్యాన్ని కూడా ఇవ్వాలి.

పరిష్కారం దిశగా అడుగులు
యువతను ఈ ఆందోళనల నుండి కాపాడటం తక్షణ కర్తవ్యం. డిజిటల్ అలవాట్లను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో నేరుగా గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పాఠశాలలు, ఆఫీసుల్లో మానసిక వైద్య సదుపాయాలు ఉండాలి. చిన్నతనం నుండే సమస్యలను గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే మేలు జరుగుతుంది. సమాజం అంతా కలిసి ఒక అండగా నిలిస్తేనే ఈ తరం మానసిక సంక్షోభం నుండి బయటపడుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *