- అమెరికా మత స్వేచ్ఛ కమిషన్ నివేదిక వెల్లడి
- గత పదేళ్లలో ముస్లింలపై ఐదు రెట్ల దాడులు
- ఒక్క ఏడాదిలో 720 మంది క్రైస్తవులపై దాడి
- మత మార్పిడిపై 12 రాష్ట్రాల్లో వేల అరెస్టులు
- అమెరికా నివేదికపై అంతర్జాతీయంగా చర్చ
సహనం వందే, న్యూఢిల్లీ:
భారతదేశంలో లౌకికవాదం పునాదులు కదులుతున్నాయని ప్రపంచ దేశాలు గొంతెత్తుతున్నాయి. మైనారిటీల రక్షణ విషయంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. అగ్రరాజ్యాల నివేదికలు భారత్‌ను దోషిగా నిలబెడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో మతం పేరుతో రక్తపాతం పారుతోందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.

అమెరికా నివేదికలో ‘ప్రత్యేక ఆందోళన’
అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ తన వార్షిక నివేదికలో భారత్‌ను ‘ప్రత్యేక ఆందోళన కలిగించే దేశం’గా గుర్తించింది. పదేళ్లుగా ముస్లింల పట్ల వివక్ష చూపడం, పౌరసత్వ సవరణ చట్టం వంటివి మత విద్వేషాలను పెంచుతున్నాయని పేర్కొంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎంతగా ఖండించినా అమెరికా నివేదిక వివిధ దేశాలు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నివేదికను భారతదేశం తీవ్రంగా ఖండించింది.
ముస్లింలపై పెరుగుతున్న హింస
2014 నుంచి ముస్లింలపై దాడులు విపరీతంగా పెరిగాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం… గోరక్షణ పేరుతో జరిగిన 100కి పైగా హత్యల్లో మెజారిటీ బాధితులు ముస్లింలే. దాదాపు 40 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంలో కేవలం మతం పేరుతో ఒక వర్గాన్ని ఆర్థికంగా సామాజికంగా వెలివేయడం గమనార్హం. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సదస్సులో కూడా భారత్‌లో పెరుగుతున్న ఇస్లామోఫోబియాపై తీవ్ర చర్చ జరిగింది.
క్రైస్తవులే తదుపరి లక్ష్యం
యూనైటెడ్ క్రిస్టియన్ ఫోరం విడుదల చేసిన గణాంకాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. 2023లో క్రైస్తవులపై జరిగిన దాడులు 720కి చేరాయి. 2022లో ఈ సంఖ్య 599గా ఉండేది. కేవలం ఏడాది కాలంలోనే 20 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో చర్చిలపై దాడులు, ప్రార్థనలను అడ్డుకోవడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. బలవంతపు మత మార్పిడిల నెపంతో విదేశీ మిషనరీలను వేధిస్తున్నారని అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆర్థికంగా దెబ్బకొడుతున్న లైసెన్సుల రద్దు
ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని ఆయుధంగా వాడుకుని మైనారిటీ సంస్థల గొంతు నొక్కుతోందని నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో దాదాపు 20,600 స్వచ్ఛంద సంస్థల లైసెన్సులను రద్దు చేశారు. ఇందులో ఎక్కువ శాతం క్రైస్తవ, ముస్లిం స్వచ్ఛంద సంస్థలే ఉన్నాయని పేర్కొంది. మైనారిటీ విద్యార్థులకు అందే ఉపకార వేతనాలను నిలిపివేయడం, వారి విద్యా సంస్థలపై దాడులు చేయడం ద్వారా ఒక తరాన్ని విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మత మార్పిడి చట్టాల వేధింపులు
ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో కఠినమైన మత మార్పిడి నిరోధక చట్టాలు అమలులో ఉన్నాయి. ఈ చట్టాల కింద గడిచిన ఏడాదిలో సుమారు 5,000 మందిపై కేసులు నమోదయ్యాయి. సాక్ష్యాధారాలు లేకపోయినా కేవలం ఫిర్యాదుల ఆధారంగా అరెస్టులు చేస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని 25వ అధికరణను ఉల్లంఘించడమేనని అంతర్జాతీయ న్యాయ నిపుణులు చెబుతున్నారు.
విశ్వగురువు ఇమేజ్ కు గండి
ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేస్తున్నా స్వదేశంలో జరుగుతున్న మత హింస దానికి అడ్డంకిగా మారింది. యూరోపియన్ యూనియన్ పార్లమెంటులో కూడా మణిపూర్ హింస, మైనారిటీల భద్రతపై తీర్మానాలు చేయడం గమనార్హం. దేశీయంగా మత సామరస్యం దెబ్బతింటే అది విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. మైనారిటీల భద్రతను విస్మరిస్తే భారత్ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.