ఒళ్ళు హూనం చేసుకున్నా వృథానే – గంటల తరబడి వ్యాయామంతో లాభం లేదు

Excercise
  • ఎక్కువ కేలరీల ఖర్చుకు సహకరించని శరీరం
  • మనిషికి హద్దులు గీసిన సరికొత్త పరిశోధన
  • రెస్ట్ లేకుండా వ్యాయామం బూడిదలో పన్నీరే
  • మన మెటబాలిజానికి గరిష్ట పరిమితి ఉంది
  • బాడీని హింసిస్తే ‘పొదుపు’ మోడ్‌ యాక్టివేట్

సహనం వందే, న్యూఢిల్లీ:

బరువు తగ్గాలని కొందరు… కండలు పెంచాలని మరికొందరు జిమ్ముల్లో గంటల తరబడి ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ కేలరీలు కరుగుతాయని… త్వరగా సన్నబడతామని చాలామంది భ్రమపడుతున్నారు. కానీ మన శరీరం ఒక మిషన్ కాదు. దానికి ప్రకృతి సిద్ధంగా కొన్ని పరిమితులున్నాయి. ఒక స్థాయి దాటిన తర్వాత మీరు ఎంత కొట్టుకున్నా శరీరం అదనంగా ఒక్క కేలరీని కూడా ఖర్చు చేయదని తాజా అంతర్జాతీయ పరిశోధనలు కుండబద్దలు కొడుతున్నాయి.

ఆ హద్దు దాటలేరు
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం… మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు మన శరీరం ఖర్చు చేసే శక్తిని (బేసల్ మెటబాలిక్ రేటు) ప్రామాణికంగా తీసుకుంటే… దానికి గరిష్టంగా రెండున్నర రెట్లు మించి కేలరీలను మన శరీరం ఖర్చు చేయలేదు. అంటే మీరు రోజంతా పరుగులు తీసినా… కొండలు ఎక్కినా మీ శరీరం ఒకానొక దశలో క్యాలరీల బర్నింగుకు బ్రేక్ వేస్తుంది. అంతకు మించి శక్తిని ఖర్చు చేస్తే ప్రాణాలకే ప్రమాదమని గుర్తించి మన మెటబాలిజం రేటును బాడీ ఆటోమేటిక్‌గా తగ్గించేస్తుంది.

మెటబాలిజం మ్యాజిక్
మనం ఎంత తిన్నా.. ఎంత కష్టపడినా మన శరీరంలో ఒక అంతర్గత యంత్రం ఉంటుంది. దానినే మెటబాలిజం అంటారు. మనం పీల్చే గాలి నుంచి తినే ఆహారం వరకు ప్రతిదీ శక్తిగా మారుతుంది. అయితే ఈ శక్తి ఖర్చు కావడానికి ఒక లెక్క ఉంటుంది. మనం చేసే వ్యాయామం ఈ మెటబాలిజం వేగాన్ని పెంచుతుంది. కానీ ఈ వేగం పెరగడానికి ఒక హద్దు ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ హద్దు దాటిన తర్వాత మనం ఎంత శ్రమించినా శరీరం అదనంగా ఒక్క కేలరీని కూడా ఖర్చు చేయదు.

బాడీ సేవింగ్ మోడ్
మనం కష్టపడే కొద్దీ కేలరీలు కరుగుతాయనేది ఒక స్థాయి వరకే నిజం. కానీ వారాల తరబడి విశ్రాంతి లేకుండా తీవ్రమైన వ్యాయామాలు చేస్తే శరీరం తన రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. దీనినే ‘సేవ్ మోడ్’ అనవచ్చు. తిండి దొరకని పరిస్థితుల్లో లేదా విపరీతమైన శ్రమలో ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి గుండె, మెదడు వంటి కీలక అవయవాల కోసం శరీరం కేలరీలను దాచిపెడుతుంది. ఫలితంగా మనం చేసే మితిమీరి చేసే వ్యాయామం వల్ల అదనపు ప్రయోజనం ఉండదు సరికదా విపరీతమైన నీరసం వచ్చేస్తుంది.

గర్భిణీలు.. అథ్లెట్లు ఒక్కటే
ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఒక అథ్లెట్ మారథాన్‌లో పడే శ్రమ, ఒక గర్భిణీ స్త్రీ శరీరం చేసే శ్రమ దాదాపు సమానం. గర్భిణీలలో శిశువు ఎదుగుదల కోసం శరీరం తన మెటబాలిజం రేటును గరిష్ట స్థాయికి అంటే 2.2 రెట్లు పెంచుకుంటుంది. ఇది మనిషి తట్టుకోగల అంతిమ పరిమితికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే గర్భిణీలు విపరీతమైన అలసటకు గురవుతుంటారు. వారి శరీరం లోపల నిరంతరం ఒక మారథాన్ జరుగుతూనే ఉంటుందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

తిండికి… వ్యాయామానికి లింకు
చాలామంది తక్కువ తిని ఎక్కువ వ్యాయామం చేస్తే త్వరగా ఫలితం వస్తుందని అనుకుంటారు. కానీ ఇది పొరపాటని ఈ అధ్యయనం చెబుతోంది. మనం ఆహారం బాగా తగ్గించి కసరత్తులు పెంచినప్పుడు శరీరం ఖర్చు చేసే కేలరీలను భారీగా తగ్గించుకుంటుంది. అంటే మీరు 1000 కేలరీలు ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తే శరీరం కేవలం 500 మాత్రమే ఖర్చు చేసి మిగిలినది దాచుకుంటుంది. దీనివల్లే చాలామంది బరువు తగ్గడంలో ఒక స్టేజ్ వచ్చాక ఆగిపోతారు (ప్లాటూ ఎఫెక్ట్).

విశ్రాంతి లేకపోతే వృథా
ఈ పరిశోధన ఇచ్చే అతిపెద్ద సందేశం ఏమిటంటే… వ్యాయామం ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. నిరంతరం కష్టపడటం వల్ల మెటబాలిజం మొండికేస్తుంది. కండరాలు రిపేర్ కావాలన్నా, జీవక్రియలు గాడిలో పడాలన్నా శరీరానికి తగినంత విరామం ఇవ్వాలి. వారానికి కనీసం ఒకటి లేదా రెండు రోజులు వ్యాయామానికి సెలవు ఇవ్వడం వల్ల శరీరం మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. అప్పుడే మనం చేసే కసరత్తులకు తగిన ఫలితం లభిస్తుంది. అతిగా కష్టపడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని గుర్తించాలి.

మితమైన వ్యాయామం ముఖ్యం…
ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్ లో గంటలు గడపడం కంటే క్రమశిక్షణతో కూడిన మితమైన వ్యాయామం ముఖ్యం. మన శరీరం ఒక పరిమితి లోపు మాత్రమే కేలరీలను సమర్థవంతంగా ఖర్చు చేయగలదు. ఆ హద్దులు దాటి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. సరైన పోషకాహారం, తగినంత నిద్ర, మితమైన వ్యాయామం.. ఈ మూడింటి కలయికే అసలైన ఫిట్‌నెస్ రహస్యం. ఎంత ఫిట్‌గా ఉన్నా సరే.. ప్రకృతి సిద్ధంగా వచ్చే ఆ బాడీ బ్రేక్‌ను ఎవరూ దాటలేరని ఈ తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *