- ప్రపంచంలోనే అతి పురాతన భాష తమిళం
- ఉర్దూకు వెయ్యేళ్ల చరిత్ర కూడా లేదని వ్యాఖ్య
- అజ్ఞానంతో అడిగే ప్రశ్నలపై అక్తర్ చమత్కారం
- జైపూర్ సాహిత్య వేదికపై ఆసక్తికర చర్చ
- లౌకికవాదం ఒక జీవన విధానమని కామెంట్
సహనం వందే, జైపూర్:
భాషల పుట్టుకపై సాగుతున్న అర్థం లేని వాదనలకు ప్రముఖ సినీ రచయిత, కవి, బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ భర్త జావేద్ అక్తర్ తనదైన శైలిలో చరమగీతం పాడారు. జైపూర్ సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన… సంస్కృతం, ఉర్దూ భాషల మధ్య ఉన్న బంధాన్ని వివరించారు. చరిత్ర తెలియక అడిగే ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేస్తూనే… భాషా సంపదపై విద్యార్థులకు, సాహితీ ప్రియులకు విలువైన పాఠాలు నేర్పారు.
పురాతన భాష ఏది?
సదస్సులో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నపై అక్తర్ విస్మయం వ్యక్తం చేశారు. సంస్కృతం, ఉర్దూ భాషల్లో ఏది పురాతనమైనది అని అడగటం అజ్ఞానమేనని కొట్టిపారేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సజీవ భాష తమిళం అని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత రెండో స్థానంలో సంస్కృతం ఉంటుందని వివరించారు. ఈ వాస్తవాలను మరిచి అనవసర వాదనలు చేయవద్దని సూచించారు.
అక్కా చెల్లెళ్ల బంధం
సంస్కృతం ఒక పెద్దక్క అయితే… ఉర్దూ దాని చిన్న చెల్లెలు (ఛోటీ బెహన్) వంటిదని అక్తర్ అభివర్ణించారు. ఉర్దూ భాషకు కనీసం వెయ్యేళ్ళ చరిత్ర కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. సంస్కృతం పునాదుల నుంచే ఉర్దూ భాష రూపుదిద్దుకుందని చెప్పారు. ఈ రెండు భాషల మధ్య పోటీ పెట్టడం కంటే… వాటి చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని హితవు పలికారు.
అమ్మ నేర్పిన అక్షరం
తన బాల్యం, తల్లి గురించి అక్తర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన 8 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయిందని… కానీ ఆమె నేర్పిన పదాలే తనను రచయితను చేశాయని చెప్పారు. ఆమె నవలలను విపరీతంగా చదివేవారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆమె చదివిన నవలల్లోని శైలి ఇప్పటికీ తన స్క్రిప్టుల్లో కనిపిస్తుందని భావోద్వేగానికి లోనయ్యారు.
పోటీ నీతోనే…
ఇతర గొప్ప వ్యక్తులతో పోల్చుకుని భయపడటం సరికాదని అక్తర్ యువతకు సూచించారు. ఎవరో గొప్పగా ఉన్నారని అభద్రతా భావానికి లోనుకావద్దని చెప్పారు. ఎప్పుడూ నీ పోటీ నీతోనే ఉండాలని.. నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉండాలని కోరారు. ఇతరుల ప్రతిభను చూసి అసూయ పడకుండా వారి నుంచి నేర్చుకోవాలని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సహజ సిద్ధమైన లౌకికవాదం
లౌకికవాదం అనేది పుస్తకాలు చదివితే వచ్చేది కాదని… అది ఒక జీవన విధానమని అక్తర్ పేర్కొన్నారు. తన చిన్నతనంలో మతపరమైన శ్లోకాలు నేర్చుకోవడానికి తాతయ్య డబ్బులు ఇస్తానన్నా.. అమ్మమ్మ అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆమెకు చదువు రాకపోయినా ఉన్నతమైన సంస్కారం ఉండేదని కొనియాడారు. పెద్దలు ఎలా జీవిస్తారో చూసి పిల్లలు నేర్చుకుంటారని చెప్పారు.
మారిన సినిమా పోకడలు
నేటి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వస్తున్న మార్పులను ఆయన స్వాగతించారు. గతంలో హీరోలను పేరు పెట్టి పిలిచే ధైర్యం సహాయ దర్శకులకు ఉండేది కాదని.. ఇప్పుడు ఆ వాతావరణం మారిందని చెప్పారు.1980ల నుంచి సినిమాల్లో మధ్యతరగతి సౌందర్యం పెరిగిందని విశ్లేషించారు. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా స్టార్ హీరోలతో స్నేహపూర్వకంగా ఉండటం మంచి పరిణామమని అక్తర్ అభిప్రాయపడ్డారు.