- 2029లో నేరుగా బరిలోకి దిగుతానని వెల్లడి
- పార్టీ పేరుపై ప్రజలదే నిర్ణయమని స్పష్టీకరణ
- ఎక్స్ వేదికగా ఆస్క్ కవిత సమాధానం
- సమస్యలపై ఉవ్వెత్తున ఉద్యమానికి ఏర్పాట్లు
- యువతకు ఉద్యోగాల కల్పనపైనే దృష్టి
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజా వ్యాఖ్యలు ఆమె సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. 2029 సార్వత్రిక ఎన్నికలలో తాము పోటీ చేస్తామని కవిత స్పష్టం చేయడంతో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు అనివార్యమని తేలిపోయింది.
పార్టీ పేరుపై ప్రజలదే నిర్ణయం!
తనకు జరిగిన అన్యాయంపై కవిత అనేక సందర్భాల్లో రగిలిపోయారు. అన్నా బావలపై విరుచుకుపడ్డారు. తాజాగా కవిత ఎక్స్ వేదికగా నిర్వహించిన ఆస్క్ కవిత సెషన్‌లో నెటిజన్ల ప్రశ్నలకు నిర్మొహమాటంగా సమాధానాలు ఇచ్చారు. కొత్త పార్టీ ఏర్పాటు గురించి అడిగిన ప్రశ్నకు ఆమె చాలా ఆసక్తికరంగా స్పందించారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని తేల్చిచెప్పడమే కాకుండా… పెట్టబోయే పార్టీ పేరును ప్రజలు సూచించిన దానినే ఖరారు చేస్తామని ఆమె ప్రకటించడం విశేషం. సామాజిక తెలంగాణను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేశారు. మహిళలకు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడం, వారికి నచ్చిన రంగాలలో రాణించేలా ప్రోత్సహించడం జాగృతి ప్రధాన కర్తవ్యం అని కవిత వెల్లడించారు.
రేవంత్ పాలన ఫెయిల్యూర్!
కొత్త పార్టీ లక్ష్యాలలో తమ తొలి ప్రాధాన్యత యువతకు ఉద్యోగాల కల్పనే అని కవిత తేల్చిచెప్పారు. ఉద్యోగాలు, నైపుణ్యం, భద్రతలలో యువత దేనికి ప్రాధాన్యం ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేసి త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాదు ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై విమర్శల దాడిని తీవ్రం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని కవిత ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యల పైనా స్పందించి… ఇది అత్యంత బాధాకరమన్నారు.
సమస్యలపై ఉవ్వెత్తున ఉద్యమం!
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి కవిత సిద్ధమవుతున్నారు. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ డ్రామాను ఆమె తీవ్రంగా ఖండించారు. త్వరలోనే అక్కడి రైతులకు అండగా పోరాటం చేస్తానని ప్రకటించారు. సింగరేణి సంస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. హెచ్ఎంఎస్ తో కలిసి ప్రభుత్వ విధానాలపై ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. అంతేకాక హైదరాబాద్ నగరంలో వెస్ట్ సిటీ అభివృద్ధి పైన చూపిన శ్రద్ధ ఈస్ట్ సిటీ పైన లేదని, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. ఈ సమస్యలన్నింటినీ కవిత తన కొత్త రాజకీయ పోరాటానికి అస్త్రాలుగా మలుచుకోనున్నారు. ఇదిలా ఉండగా తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి అని, రామ్ చరణ్ వినయంగా ఉండే మంచి డాన్సర్ అయినప్పటికీ చిరంజీవి తర్వాతే అని సరదాగా చెప్పిన కవిత… తన బాల్యంలో ఎర్రమంజిల్ లో గడిపిన క్షణాలు తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చాయని గుర్తుచేసుకున్నారు.