దళపతికి ‘ఉస్తాద్’ స్నేహ హస్తం – కమలం, విజయ్ పొత్తుకు పవన్ రాయబారం

Pawan Vijay Talks
  • తమిళ పాలిటిక్స్‌లో పవర్ స్టార్ ప్రకంపనలు
  • పీకే రాయబారం వెనుక భారీ వ్యూహం
  • ఇప్పటికే విజయ్‌తో పవన్ కళ్యాణ్ చర్చలు
  • దళపతిని చేరదీసేందుకు బీజేపీ కసరత్తు
  • ద్రవిడ రాజకీయాల్లో రాజకీయ కలకలం

సహనం వందే, అమరావతి:

తమిళనాడు రాజకీయ రణరంగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల గుప్పిట్లో ఉన్న తమిళ నాట తమ జెండా ఎగురవేయాలని బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో సినీ గ్లామర్‌ను రాజకీయ శక్తిగా మలుచుకున్న విజయ్ ను తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ కీలక బాధ్యతను రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అప్పగించడం ఇప్పుడు దక్షిణ భారత రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది.

Pawan Vijay Talks

పవన్ కళ్యాణ్… వ్యూహాత్మక మధ్యవర్తిత్వం
రాజకీయాల్లో మిత్రపక్షాల పాత్ర ఎంత కీలకమో ఆ మిత్రపక్షాలను సమన్వయం చేసే నాయకుడి పాత్ర అంతకంటే కీలకం. విజయ్‌తో పవన్ కళ్యాణ్‌కు ఉన్న సుదీర్ఘ వ్యక్తిగత పరిచయం ఇప్పుడు బీజేపీకి అతిపెద్ద ఆశాకిరణంగా మారింది. ఇద్దరూ సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన వారు కావడంతో ఒకరి ఆలోచనలు మరొకరికి సులభంగా అర్థమవుతాయి. విజయ్‌కి ఉన్న భారీ ప్రజాదరణను బీజేపీ జాతీయ విధానాలతో అనుసంధానం చేసే ఒకే ఒక్క ‘కనెక్టింగ్ లింక్’గా పవన్ కళ్యాణ్ ఈ మధ్యవర్తిత్వానికి ఎంపికయ్యారు. ఇది కేవలం ఒక పార్టీని కలపడం మాత్రమే కాదు… తమిళ రాజకీయాల్లో ఒక కొత్త కూటమిని సృష్టించే భారీ పొలిటికల్ ఇంజనీరింగ్.

వ్యూహాత్మక లాభం… బీజేపీ అంచనా
తమిళనాడులో బీజేపీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఓట్ల శాతం. విజయ్ పార్టీ టీవీకేలో చేరుతున్న యువత, మార్పు ఆశిస్తున్న ఓటర్ల మద్దతు బీజేపీకి దక్కితే అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని క్షణాల్లో మార్చేయగలదు. బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువుగా ప్రకటించిన విజయ్‌ని రాజకీయ వాస్తవాల వైపు మళ్లించే క్రమంలో పవన్ కళ్యాణ్ ద్వారా జరుపుతున్న ఈ చర్చలు చాలా లోతైనవి. ఇది ఎన్నికల పొత్తుకు మించిన భవిష్యత్ రాజకీయ భాగస్వామ్యం కోసం వేస్తున్న పునాది.

క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రతిష్టంభన…
ఒకవైపు సీబీఐ నోటీసుల వ్యవహారం… మరోవైపు తన పార్టీని ఒంటరిగా నడపాలనే విజయ్ ఆశయం మధ్య ఇప్పుడు నలిగిపోతోంది. అయితే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని పవన్ కళ్యాణ్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు విజయ్‌కు వివరించడం… ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే జాతీయ కూటమి మద్దతు ఎంత అవసరమో నొక్కి చెప్పడం వెనుక బీజేపీ ఆడుతున్న పెద్ద ఆట ఉంది. విజయ్ వంటి పాపులర్ నాయకుడిని తమ కూటమిలోకి తీసుకురావడం ద్వారా డీఎంకేకు మాత్రమే కాకుండా అన్నాడీఎంకేకు కూడా పెద్ద షాక్ ఇవ్వాలని కమలం పార్టీ చూస్తోంది.

విజయ్ పంథాపై ఆసక్తి…
పవన్ కళ్యాణ్ చేసిన ఈ రాయబారం కేవలం ఒక ప్రయత్నమా లేక ముగింపు దశకు చేరుకున్న ఒప్పందమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. విజయ్ తన పంథాలో ఒంటరిగా ముందుకు సాగుతారా లేక పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీతో చేతులు కలిపి రాజకీయ ‘మేజిక్’ చేస్తారా అనేది అసెంబ్లీ ఎన్నికల నాటికి స్పష్టమవుతుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రవేశంతో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకున్నాయి.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *