- సొంతూరులో పార్టీని గెలిపించుకోలేని దుస్థితి
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర నాయకత్వం
- ముందస్తు పరిస్థితి గుర్తించి పొంగులేటి జాగ్రత్త
- సొంతూరులో ఏకగ్రీవం చేయించుకున్న మంత్రి
- భట్టి ఇలాకాలో ముదిగొండ సీపీఎం కైవసం
- ప్రతిష్టాత్మక పంచాయతీలో గెలవని పరిస్థితి
సహనం వందే, హైదరాబాద్:
గ్రామపంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లోనే పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత గూటిలోనే ఓటర్లు పక్క చూపులు చూడటంతో దీనిపై రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అధికారం చేతిలో ఉన్నా సొంత గ్రామాలను గెలిపించుకోలేని ఈ దుస్థితి ఏమిటని అధిష్టానం మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలు గ్రామాల్లో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, స్థానిక స్థాయిలో ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతను బట్టబయలు చేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పాలమూరులో పాలక పక్షానికి చుక్కెదురు!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ఆయన సొంతూరైన రంగారెడ్డిగూడలోనే దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. అక్కడ కాంగ్రెస్ ఓడిపోగా సర్పంచ్‌గా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పరిస్థితీ ఇందుకు భిన్నం కాదు. ఆమె స్వగ్రామం ధన్వాడలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ధన్వాడ… మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం… పర్ణికారెడ్డికి, విజయం సాధించిన అభ్యర్థికి అత్తాకోడళ్ల వరుస ఉండటం ఈ ఎపిసోడ్‌కు అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. ఇక షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య స్వగ్రామం వీర్లపల్లిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి సర్పంచ్‌గా గెలిచారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరు దమన్నాపూర్ లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థే విజయం సాధించడం గమనార్హం.
మానకొండూరు ఎమ్మెల్యేకూ తప్పని సెగ…
కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా తన స్వగ్రామం పచ్చునూరులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. అక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి సర్పంచ్‌గా విజయం సాధించారు. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామం చెర్లపాలెంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఆమె అనుచరుడిపై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ 82 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలను బయటపెట్టింది.

మంత్రుల ఇలాకాల్లో ఇబ్బందికరం…
ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాలో మంత్రులకు కూడా ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని రాజకీయంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ముదిగొండ మండల కేంద్రం పంచాయతీని కాంగ్రెస్ గెలవలేకపోయింది. అక్కడ సీపీఎం పాగా వేసింది. ముందస్తు పరిస్థితిని పసిగట్టిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… తన సొంతూరు కల్లూరు మండలం నారాయణపురంలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయించుకోవడం గమనార్హం.
గత పార్లమెంటు ఎన్నికల్లో ఆ గ్రామంలో కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు రావడంతో ఆయన ఈ జాగ్రత్త తీసుకున్నారు. మొత్తంగా చూస్తే అధికార ఎమ్మెల్యేలకు సొంత గ్రామాల్లో ఎదురైన ఈ పరాజయాలు రాష్ట్ర నాయకత్వానికి చెమటలు పట్టిస్తున్నాయి.