ఏఐ ప్రయోగశాలగా ఇరాన్ యుద్ధక్షేత్రం – కోడ్, ఆల్గారిథమ్స్ రాస్తున్న మరణ శాసనం

AI War - Maven Project
  • ఇరాన్ రణక్షేత్రంలో అమెరికా ఏఐ అకృత్యం
  • యంత్రాల కబంధహస్తాల్లో మానవత్వం
  • ఏఐ యుద్ధం… చిన్నారుల మరణాలపై మౌనం
  • యుద్ధం తెచ్చిన ఏఐ… శాంతిని తేలేదేంటీ?

సహనం వందే, హైదరాబాద్:

ఇరాన్ యుద్ధభూమి ఇప్పుడు అమెరికా ప్రయోగిస్తున్న ఏఐకి ప్రయోగశాలగా మారింది. ఇక్కడ మనుషులు ఆయుధాలను పట్టుకోవడం లేదు. మనుషుల ప్రాణాలను నిర్ణయించే అధికారాన్ని యంత్రాలకు కట్టబెట్టారు. ప్రాజెక్ట్ మావెన్ అనే కృత్రిమ మేధ వ్యవస్థ అమెరికా యుద్ధ తంత్రంలో భాగంగా ఇప్పుడు మారణహోమాన్ని సృష్టిస్తోంది. యుద్ధం మొదలైన తొలి రోజే ఈ యంత్రాల అంచనాల వల్ల 168 మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇది యుద్ధం కాదు… ఆల్గారిథమ్స్ రాస్తున్న మరణ శాసనం. ఒక సాఫ్ట్‌వేర్ కోడ్ అమాయకుల ప్రాణాలను ఎలా బలితీసుకుంటుందో ఈ ఘటన ప్రపంచానికి కళ్లకు కడుతోంది.

AI War Machines

యంత్రం చేతిలో మరణం
ప్రాజెక్ట్ మావెన్ అంటే కేవలం ఒక సాఫ్ట్‌వేర్ కాదు. ఇది డ్రోన్ కెమెరాల ద్వారా వచ్చే గంటల కొద్దీ దృశ్యాలను, శాటిలైట్ సమాచారాన్ని సెకన్లలో జల్లెడ పట్టి ఎవరిని చంపాలో నిర్ణయించే ఒక ప్రాణాంతక వ్యవస్థ. మనిషి ప్రమేయం లేకుండానే లక్ష్యాలను ఖరారు చేసే ఈ వ్యవస్థ ఇప్పుడు యుద్ధ నిబంధనలను తుంగలో తొక్కింది. ఇరాన్ లోని ఒక ప్రాంతాన్ని శత్రువుల స్థావరంగా పొరపాటుగా గుర్తించిన ఈ ఏఐ వ్యవస్థ క్షణాల్లో చేసిన దాడిలో 168 మంది చిన్నారులు తుదిశ్వాస విడిచారు. ఆల్గారిథమ్స్ చేసిన తప్పుకు ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారుల కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారు?

వేగమే వినాశనానికి దారి
అమెరికా సైన్యం ప్రాజెక్ట్ మావెన్ ను ఒక సాంకేతిక అద్భుతంగా డప్పు కొట్టుకుంటోంది. 10 లక్షల కంటే ఎక్కువ డేటా పాయింట్లను ఏఐ క్షణాల్లో ప్రాసెస్ చేస్తుందని గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఈ వేగమే ఇప్పుడు అమాయకుల పాలిట శాపంగా మారింది. శత్రువులెవరో, సామాన్యులెవరో గుర్తించడంలో ఈ వ్యవస్థ తీవ్ర వైఫల్యం చెందింది. యుద్ధం అంటే కేవలం డేటా విశ్లేషణ కాదు… అక్కడ మనుషులు ఉంటారు. కానీ ఈ ఏఐ వ్యవస్థకు మానవత్వం తెలియదు. దానికి తెలిసింది కేవలం టార్గెట్ ను కూల్చడం మాత్రమే.

AI War

యుద్ధ క్షేత్రంలో అరాచకం…
ఈ ప్రాజెక్ట్ కోసం వెచ్చించిన వందల కోట్ల రూపాయల నిధులు ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో అరాచకానికి మద్దతు పలుకుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన పరికరాలు నష్టపోయినా రక్షణ రంగం ఈ ఆపరేషన్లను ఆపడం లేదు. సాంకేతికత వల్ల భద్రత పెరుగుతుందని చెప్తున్న వారే ఆ సాంకేతికత చేసిన మారణహోమాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు… ఇది వ్యవస్థీకృత అహంకారం. ఇరాన్ లాంటి దేశాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఏఐని ఒక క్రూరమైన ఆయుధంగా వాడుతోంది.

ఎవరు బాధ్యులు?
సాంకేతికత ఎప్పుడూ లోపరహితం కాదు. అల్గారిథమ్స్ తప్పులు చేసినప్పుడు వాటిని నిలదీసే దిక్కులేదు. 168 మంది చిన్నారుల మరణానికి బాధ్యత ఎవరిది? వ్యవస్థదా లేదా ఆ కోడ్ రాసిన యంత్రాలదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు లేడు. ఇరాన్ తో యుద్ధంలో సాంకేతికత ఇచ్చే డేటాపై పూర్తిగా ఆధారపడటం వల్ల యుద్ధం మరింత ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. జవాబుదారీతనం లేని ఈ యుద్ధ యంత్రం మున్ముందు మరెన్ని ప్రాణాలను బలి తీసుకోనుందో ఎవరికీ తెలియదు.

ముగింపు లేని మారణహోమం
ఈ సాంకేతిక యుద్ధం అగ్రదేశాల అహంకారానికి, అమాయకుల రక్తానికి మధ్య జరుగుతున్న పోరాటంగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో యుద్ధభూమిలో ఏఐ పాత్ర మరింత పెరగనుంది. కానీ ఇది శాంతిని తీసుకురాదు. కేవలం మరణాలను పెంచుతుంది. 168 మంది చిన్నారుల మరణం ఒక హెచ్చరిక… కానీ అమెరికా మాత్రం తన ఏఐ యంత్రాలను ఉసిగొల్పుతూనే ఉంది. ఈ క్రూరమైన మారణహోమం ఎప్పుడు ఆగుతుందో కాలమే నిర్ణయించాలి. యుద్ధభూమిలో ఏఐ పాత్ర మరింత పెరగనుంది. కానీ ఇది శాంతిని తీసుకురాదు. కేవలం మరణాలను పెంచుతుంది.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *