వాట్సాప్ ‘చీ’టింగ్… సీక్రెట్ రీడింగ్ – ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంతా మోసం

WhatsAPP Cheating Secret Reading
  • దాని సంస్థ మెటాపై అమెరికాలో దావా
  • రహస్యంగా మెసేజ్ లు చదువుతున్నట్లు ఫైర్
  • విజిల్ బ్లోయర్ల సంచలన నిజాలతో రచ్చ రచ్చ
  • యూజర్ల నమ్మకంపై జుకర్ బర్గ్ దెబ్బ
  • భారత సహా అనేక దేశాల యూజర్ల గొడవ

సహనం వందే, అమెరికా:

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు పెద్ద బాంబు పేలింది. మీ మెసేజ్ లను ఎవరూ చదవలేరన్న మాట అబద్ధమని… మెటా సంస్థ వాటిని రహస్యంగా చూస్తోందని అమెరికా కోర్టులో దావా పడింది. టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ లీకేజీ వ్యవహారం ఇప్పుడు ప్రతి యూజర్ లోనూ వణుకు పుట్టిస్తోంది. దీనికి సంబంధించిన షాకింగ్ వివరాలు ఇవే.

ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంతా ఉత్తదే
వాట్సాప్ లో మెసేజ్ పంపేటప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అని కనిపిస్తుంది. అంటే పంపిన వారు, అందుకున్న వారు తప్ప మధ్యలో ఎవరూ చదవలేరని అర్థం. కానీ ఇదంతా ఒట్టి భ్రమ అని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలైన పిటిషన్ చెబుతోంది. వాట్సాప్ యజమాని మెటా సంస్థ తన ఉద్యోగుల ద్వారా ఈ మెసేజ్లను రహస్యంగా విశ్లేషిస్తోందని ఆరోపణలు వచ్చాయి. భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి బాధితులు ఈ దావా వేశారు. కోట్ల మంది యూజర్లను మెటా మోసం చేస్తోందని విమర్శించారు.

విజిల్ బ్లోయర్ల సంచలన ఆరోపణలు
మెటా సంస్థలో పనిచేసిన కొందరు ఉద్యోగులు ఈ గుట్టు రట్టు చేశారు. కంపెనీలో ఒక అంతర్గత వ్యవస్థ ఉందని వారు వెల్లడించారు. దీని ద్వారా ఇంజనీర్లు ఏ యూజర్ మెసేజ్లకైనా యాక్సెస్ పొందవచ్చని పేర్కొన్నారు. ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే వ్యక్తిగత చాట్లను చూడవచ్చని వివరించారు. ఈ వివరాలు బయటకు రాకుండా మెటా సంస్థ తన ఉద్యోగులతో కఠినమైన ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు. ఒక చిన్న విడ్జెట్ ద్వారా యూజర్ ఐడీ ఎంటర్ చేస్తే చాలు.. వారి లైవ్ మెసేజ్లు కనిపిస్తాయని వాదిస్తున్నారు.

పాత మెసేజ్లపై కూడా నిఘా
కేవలం ప్రస్తుత మెసేజ్లే కాకుండా అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఉన్న పాత చాట్లను కూడా చూడవచ్చని దావాలో పేర్కొన్నారు. దీనికోసం ఎటువంటి డీక్రిప్షన్ అవసరం లేదని చెప్పడం టెక్ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మెటా సంస్థ తన వ్యాపార ప్రయోజనాల కోసం యూజర్ల డేటాను విశ్లేషిస్తోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఇది గ్లోబల్ క్లాస్ యాక్షన్ కింద దాఖలైన కేసు కావడం విశేషం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది వాట్సాప్ యూజర్ల తరపున ఈ పోరాటం జరుగుతోంది. వాట్సాప్ ను నమ్మి అనేకమంది చాటింగ్ లు చేస్తుంటారు. మరి ముఖ్యంగా వ్యాపారస్తులు, అంతర్జాతీయ ప్రముఖులు, గ్లోబల్ లీడర్లు వీటిని వాడుతుంటారు. ఆ వివరాలను ప్రత్యర్థులకు చేరే ప్రమాదం ఉందని అంటున్నారు.

టెక్నాలజీ మాయాజాలంపై అనుమానాలు
సాధారణంగా ఎన్‌క్రిప్షన్ కీలు కేవలం యూజర్ ఫోన్ లోనే ఉంటాయి. టెక్నికల్ గా కంపెనీ కూడా వీటిని చూడటం అసాధ్యం. కానీ అంతర్గత మార్గాల ద్వారా డేటాను సేకరిస్తున్నారా అనే అనుమానం ఇప్పుడు బలపడుతోంది. మెటా డేటా అంటే ఎవరు ఎవరికి మెసేజ్ పంపారు అనే వివరాలు సేకరించడం కంపెనీలకు సులభమే. అయితే మెసేజ్ లోపల ఏముందో చూడటం అంటే అది యూజర్ ప్రైవసీని పూర్తిగా సమాధి చేయడమే. ఈ కేసు విచారణలో ఏ నిజాలు బయటకు వస్తాయోనని టెక్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

భారతీయ యూజర్లపై ప్రభావం
ప్రపంచంలోనే అత్యధికంగా 50 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు భారత్ లోనే ఉన్నారు. ఈ కేసులో భారతీయ బాధితులు కూడా భాగస్వాములు కావడంతో ఇక్కడ ప్రాధాన్యత పెరిగింది. మన దేశంలో ప్రైవసీ చట్టాలు ఇంకా పటిష్టంగా లేకపోవడం వల్ల ఇలాంటి టెక్ కంపెనీలు చెలరేగిపోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. సుప్రీంకోర్టు గతంలో ప్రైవసీని ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే కంపెనీకి వేల కోట్ల రూపాయల జరిమానా పడే అవకాశం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *