- ఆమె డేటింగ్ యాప్ ద్వారా ట్రాప్ చేసి హత్య
- శరీరాన్ని ముక్కలు చేసి సూట్ కేసులో విసిరేసి
- అతడు ఐదుగురిని చంపిన క్రూర హంతకుడు
- అక్రమ సంబంధానికి అడ్డున్నారని ఘాతకం
- ఆ ఇద్దరు కిల్లర్స్ జైలులో ప్రేమికులయ్యారు
- వారి పెళ్లికి హైకోర్టు 15 రోజుల పెరోల్
- రాజస్థాన్ లో హంతకుల వింత వివాహ వేడుక
- ఈ పెళ్లిపై దేశవ్యాప్తంగా పలువురి నిరసన
సహనం వందే, రాజస్థాన్:
ఒకరు డేటింగ్ యాప్ ద్వారా అమాయకులను వలలో వేసుకుని చంపే కిరాతకురాలు. మరొకరు పరాయి మహిళ కోసం ఐదుగురిని హతమార్చిన క్రూర హంతకుడు. వీరిద్దరూ జైలు గోడల మధ్య కలుసుకున్నారు. కటకటాల వెనుక చిగురించిన వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఈ ఇద్దరు ఖైదీలు వివాహం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
జైలులో మొదలైన బంధం
జైపూర్ లోని సాంగనేర్ ఓపెన్ జైలులో ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ శిక్ష అనుభవిస్తున్నారు. ఇక్కడి నిబంధనల ప్రకారం ఖైదీలు పగటిపూట బయట పనులు చేసుకుని రాత్రికి తిరిగి రావాలి. ఈ క్రమంలోనే ఏడాది కిందట వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో తమ మిగిలిన జీవితాన్ని కలిసి పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కోసం అనుమతి కోరుతూ వీరు కోర్టును ఆశ్రయించారు.

సూట్ కేసు హత్య కేసు
ప్రియా సేథ్ నేర చరిత్ర అత్యంత భయంకరమైనది. 2018లో దుష్యంత్ శర్మ అనే యువకుడిని డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకుంది. ఆ తర్వాత అతడిని బంధించి డబ్బు డిమాండ్ చేసింది. చివరికి గొంతు నులిమి చంపేసి… శవాన్ని ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టి పారేసింది. 2023లో ఈమెకు కోర్టు జీవిత ఖైదు విధించింది. సమాజంలో ఈ కేసు అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.
మత్తు ఇచ్చి గొంతులు కోసి
హనుమాన్ ప్రసాద్ కేసు అంతకంటే దారుణమైనది. 2017లో సంతోష్ శర్మ అనే మహిళతో ఇతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు అడ్డుగా ఉన్నారని భావించి ఆమె భర్త, ముగ్గురు కొడుకులు, ఒక మేనల్లుడిని అత్యంత పాశవికంగా చంపేశాడు. బాధితులకు మత్తు మందు ఇచ్చి అందరి గొంతులు కోశాడు. ఈ సామూహిక హత్యల కేసులో ఇతడికి కూడా 2023లో జీవిత ఖైదు పడింది.
కోర్టు ఆదేశంతో పెరోల్
వివాహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఈ జంట రాజస్థాన్ హైకోర్టును కోరగా.. జనవరి 7న సానుకూల ఆదేశాలు వచ్చాయి. పెరోల్ కమిటీ వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. దీంతో వీరికి 15 రోజుల పెరోల్ మంజూరైంది. బుధవారం వీరు జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రసాద్ స్వగ్రామమైన బరోడామెవులో వీరి పెళ్లి జరిగింది.
బాధిత కుటుంబాల ఆగ్రహం
ఈ పెళ్లిపై బాధిత కుటుంబాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దుష్యంత్ శర్మ తరపు న్యాయవాది సందీప్ లోహారియా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా పెరోల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హంతకులకు ఇలాంటి సదుపాయాలు కల్పించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరోల్ ఆర్డర్ ను సవాల్ చేస్తూ తిరిగి హైకోర్టును ఆశ్రయిస్తామని వారు స్పష్టం చేశారు.
చట్టపరమైన నిబంధనలు
జైలు అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే అంతా జరిగిందని చెబుతున్నారు. రాజస్థాన్ ఖైదీల ఓపెన్ ఎయిర్ క్యాంప్ రూల్స్ 1972 ప్రకారం ఆరుగురు సభ్యుల కమిటీ ఖైదీల ప్రవర్తనను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కూడా వివాహం చేసుకునే హక్కు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వింత వివాహం రాజస్థాన్ లో హాట్ టాపిక్ గా మారింది.