బట్టలు మడత పెట్టడం ఎలా? – రోబోలకు పాఠాలు నేర్పుతున్న ఇంజనీర్లు

Robots trains home chores
  • వందలాది మందితో రేయింబవళ్లు ట్రైనింగ్
  • అమెరికాలో రహస్య లేబరేటరీలో శిక్షణ
  • ఇల్లు ఊడ్చడం… రొట్టెలు చేయడం వరకు
  • మనుషుల కదలికలపై ఫిజికల్ అవగాహన
  • మనలా ఆలోచించే రోబోలపై ఆల్ట్ మాన్ గురి

సహనం వందే, హైదరాబాద్:

చాట్ జీపీటీతో ప్రపంచాన్ని ఊపేసిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు రోబోటిక్స్ రంగంలో సంచలనానికి సిద్ధమవుతోంది. మనం సినిమాల్లో చూసే రోబోలు ఇకపై నిజం కాబోతున్నాయి. సామ్ ఆల్ట్ మాన్ నేతృత్వంలోని బృందం శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక రహస్య ల్యాబ్ నడుపుతోంది. అక్కడ రోబోలకు ఇంటి పనులు నేర్పడమే ప్రధాన లక్ష్యంగా రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి.

Robots trained home chores

రోబోలకు ఇంటి పాఠాలు

ఓపెన్ ఏఐ సంస్థ తన రోబోటిక్స్ విభాగాన్ని భారీగా విస్తరించింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ల్యాబ్ పరిమాణం నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం 100 మంది డేటా కలెక్టర్లు ఇక్కడ పని చేస్తున్నారు. వీరు రోబోటిక్ చేతులకు శిక్షణ ఇస్తున్నారు. బట్టలు మడతపెట్టడం, బ్రెడ్ టోస్ట్, రొట్టెలు తయారు చేయడం వంటి పనులను రోబోలు నేర్చుకుంటున్నాయి. కేవలం ఒక అడుగు దూరంలో ఉన్న కప్పులో షుగర్ వేయడం నుంచి ఈ ప్రయోగం మొదలైంది. ఇప్పుడు అవి సంక్లిష్టమైన పనులను కూడా చేస్తున్నాయి.

రహస్య ల్యాబ్ లో ఏం జరుగుతోంది?
శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ఫైనాన్స్ టీమ్ ఉన్న బిల్డింగ్ లోనే ఈ రోబో ల్యాబ్ ఉంది. ఇక్కడ మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి. డేటా కలెక్టర్లు 3డీ ప్రింటెడ్ కంట్రోలర్ల ద్వారా ఫ్రాంకా అనే రోబోటిక్ చేతులను ఆపరేట్ చేస్తారు. మనుషులు ఆ కంట్రోలర్ ను ఎలా కదిలిస్తే రోబో చెయ్యి కూడా అలాగే కదులుతుంది. ఈ కదలికలన్నింటినీ కెమెరాలు రికార్డు చేస్తాయి. ఆ డేటా ద్వారా రోబోలు స్వయంగా పనులు చేయడం నేర్చుకుంటాయి.

సామాన్య పనులపై శిక్షణ…
నిజానికి ఓపెన్ ఏఐ 2020లోనే రోబోటిక్స్ ప్రాజెక్టును మూసివేసింది. అప్పట్లో ఒక రోబోటిక్ హ్యాండ్ ద్వారా రూబిక్స్ క్యూబ్ ను పరిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి చాట్ జీపీటీపై దృష్టి పెట్టింది. టెస్లా వంటి కంపెనీలు భారీ రోబోలను తయారు చేస్తుంటే ఓపెన్ ఏఐ మాత్రం సామాన్యమైన పనుల నుంచి శిక్షణ ఇస్తోంది.

బిగ్ డేటాతో రోబో బ్రెయిన్
సాధారణంగా ఏఐ మోడళ్లకు ఇంటర్నెట్ లోని సమాచారం ఇస్తే సరిపోతుంది. కానీ రోబోలకు ఫిజికల్ డేటా అవసరం. అంటే ఒక వస్తువును ఎలా పట్టుకోవాలి? ఎంత బలం ప్రయోగించాలి అనేది కీలకం. అందుకే ఓపెన్ ఏఐ వేల గంటల డేటాను సేకరిస్తోంది. రోబోలు మనుషులను అనుకరిస్తూ నేర్చుకునేలా చేస్తున్నారు. దీనివల్ల రోబోలు మరింత సహజంగా పనిచేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇవి మనుషులకు తోడుగా ఇళ్లలో కనిపిస్తాయి. త్వరలోనే మనుషుల్లా ఆలోచించే, పనిచేసే రోబోలను ప్రపంచానికి పరిచయం చేయాలని సామ్ ఆల్ట్ మాన్ గట్టి పట్టుదలతో ఉన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *