మంచు కొండల్లో పులి పంజా – పర్వతాల పైకి పరుగులు తీసే కిలియన్

Killian
  • ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టు గెలిచిన ధీరుడు
  • నెలలో 72 శిఖరాలు ఎక్కి ప్రపంచ రికార్డు
  • సైకిల్‌పై 4 వేల కిలోమీటర్ల సాహస యాత్ర
  • మనిషి స్టామినాకు కొత్త హద్దులు గీశాడు

సహనం వందే, నార్వే:

నిటారుగా ఉండే పర్వతాన్ని చూస్తేనే ఎవరికైనా కాళ్లు వణుకుతాయి. కానీ కిలియన్ జోర్నెట్ కు ఆ కొండలే ఆటస్థలాలు. పర్వతాలను ఎక్కడం కాదు.. వాటిపై పరుగెత్తడం ఇతని ప్రత్యేక శైలి. గాలి తక్కువగా ఉండే మంచు శిఖరాలపై కూడా అతను దూసుకుపోతుంటే ప్రపంచం విస్మయంతో చూస్తోంది. మనిషి శరీరం ఎంతటి తీవ్రమైన శ్రమనైనా తట్టుకోగలదని నిరూపిస్తూ కిలియన్ చేస్తున్న సాహసాలు ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్నాయి.

Killian

ఆక్సిజన్ లేని అద్భుతం
కిలియన్ జోర్నెట్ చేసిన సాహసాల్లో ఎవరెస్టు విజయం అగ్రస్థానంలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ శిఖరాన్ని కేవలం ఒక్క వారంలోనే రెండుసార్లు అధిరోహించాడు. విచిత్రం ఏమిటంటే ఎటువంటి అదనపు ఆక్సిజన్ సిలిండర్లు లేకుండానే ఈ ఘనత సాధించాడు. ఎవరి సాయం తీసుకోకుండా ఒంటరిగా మంచు తుపాన్లను ఎదిరించి శిఖరాగ్రాన నిలిచిన అసలైన మొనగాడు ఇతను.

నెల రోజుల్లో 72 కొండలెక్కి…
గతేడాది అమెరికాలో కిలియన్ మరో అరుదైన ఫీట్ పూర్తి చేశాడు. కేవలం 30 రోజుల్లోనే పశ్చిమ అమెరికాలోని 72 ఎత్తైన కొండలను ఎక్కేశాడు. ఒక శిఖరం దిగి మరో శిఖరానికి వెళ్లడానికి సైకిల్ పైనే 4,023 కిలోమీటర్లు ప్రయాణించాడు. అంటే పగలు కొండలు ఎక్కడం.. రాత్రి సైకిల్ తొక్కడం.. ఇలా నెల రోజుల పాటు తన శరీరాన్ని తీవ్రంగా శ్రమకు గురిచేసి గెలిచాడు.

సూపర్ హ్యూమన్ స్టామినా…
కిలియన్ శారీరక సామర్థ్యం చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. సాధారణ మనుషుల కంటే ఇతని రక్తంలో ఆక్సిజన్ తీసుకునే వేగం చాలా ఎక్కువ. ఎంత కష్టపడినా త్వరగా అలసిపోని వింతైన శక్తి ఇతని సొంతం. మనిషి ప్రాణం నిలవడమే కష్టమైన ఎత్తులో కూడా కిలియన్ సునాయాసంగా పరుగెత్తగలడు. నిరంతర సాధన ఉంటే సాధ్యం కానిది లేదని ఇతని విజయాలు చాటి చెబుతున్నాయి.

ప్రకృతి ఒడిలో స్వేచ్ఛ
నేటి డిజిటల్ ప్రపంచంలో మనుషులు ఫోన్లు, సమాచారంతో బందీలుగా మారారని కిలియన్ అంటాడు. కొండల్లో ఒంటరిగా పరుగెత్తినప్పుడు మాత్రమే మనల్ని మనం తెలుసుకోవచ్చని అతను నమ్ముతాడు. అక్కడ ప్రకృతితో కలిగే అనుబంధం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శిఖరాగ్రాన నిలబడి ప్రపంచాన్ని చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేమని అతను తన అనుభవాలను పంచుకున్నాడు.

నార్వే మంచులో నివాసం
స్పెయిన్ లో పుట్టిన కిలియన్ ప్రస్తుతం నార్వేలో స్థిరపడ్డాడు. తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ప్రకృతి మధ్యే జీవిస్తున్నాడు. పర్వతాల మధ్య నివాసం ఉంటూ ప్రతిరోజూ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటాడు. పర్వతారోహణ ఇతనికి కేవలం క్రీడ కాదు… ఒక జీవన విధానం. ఎన్ని రికార్డులు సాధించినా ఇంకా తనలో నేర్చుకోవాల్సింది చాలా ఉందని కిలియన్ వినమ్రంగా చెబుతాడు.

కష్టమైన పనుల్లో కిక్కు…
కష్టమైన పనులను ఇష్టంగా చేయడంలోనే కిలియన్ అసలైన మజాని వెతుక్కుంటాడు. సాహసాలకు చిరునామాలా మారిన ఈ పర్వత వీరుడి ప్రయాణం యువతకు అదిరిపోయే స్ఫూర్తిని ఇస్తోంది. కొండలను దాటడం కాదు… మనలోని భయాన్ని గెలవడమే అసలైన గెలుపు అని ఇతని జీవితం చెబుతోంది. అసాధ్యమనే పదాన్ని చెరిపేసి కిలియన్ జోర్నెట్ సరికొత్త చరిత్ర రాస్తున్నాడు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *