కూల్ డ్రింక్… ఫైబర్ చీటింగ్ – కోకాకోలా కంపెనీ కొత్త స్కెచ్

Diet Coke Plus Fiber
  • ప్రోటీన్ తర్వాత పీచుకే క్రేజ్ అంటున్న సీఈఓ
  • జపాన్ లో ప్రయోగాత్మకంగా ఫైబర్ డైట్ కోక్
  • ఆరోగ్యం పేరుతో వ్యాపారాభివృద్ధికి భారీ ప్లాన్
  • సోషల్ మీడియాలో ఫైబర్ మ్యాక్సింగ్ వైరల్
  • ఈ ఏడాది ఇండియాలోకి ఫైబర్ కూల్ డ్రింక్

సహనం వందే, అమెరికా:

కూల్ డ్రింక్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ దిగ్గజాలు రూటు మారుస్తున్నాయి. చక్కెర వల్ల వచ్చే ముప్పును కప్పిపుచ్చుకోవడానికి పీచు పదార్థం అనే కొత్త మంత్రాన్ని జపిస్తున్నాయి. తాజాగా కోకాకోలా సంస్థ తన పానీయాల్లో ఫైబర్ కలపాలని చూస్తోంది. ఆరోగ్య స్పృహ పెరిగిన వినియోగదారులను బుట్టలో వేసుకోవడమే దీని అసలు లక్ష్యం.

Diet Coke Plus Fiber

పీచుపై కోకాకోలా కన్ను…
కోకాకోలా సంస్థ ఇప్పుడు తన పానీయాల్లో ఫైబర్ చేర్చడంపై దృష్టి పెట్టింది. కంపెనీ సీఈఓ జేమ్స్ క్విన్సీ దావోస్ వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రపంచం ప్రోటీన్ వెంట పడిందని ఆయన విశ్లేషించారు. ఇకపై ఫైబర్ అంటే పీచు పదార్థం కాలం రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. నీటిలో సులభంగా కరిగిపోయే గుణం ఉండటం వల్ల సాఫ్ట్ డ్రింక్స్ లో దీనిని కలపడం చాలా తేలికని ఆయన భావిస్తున్నారు.

జపాన్ లో డైట్ కోక్ ప్రయోగం
ఈ ప్రయోగం కొత్తదేమీ కాదు. జపాన్ మార్కెట్లో 2017 నుంచే డైట్ కోక్ ఫైబర్ ప్లస్ పేరుతో ఒక పానీయం అమ్ముతున్నారు. ఇందులో చక్కెర ఉండదు. అలాగే కేలరీలు కూడా ఉండవు. కానీ ప్రతి సీసాలో 5 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రత్యేక ఆహార అవసరాల కోసం దీనిని తయారు చేశారు. ఇప్పుడు అదే ఫార్ములాను ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని కంపెనీ ఆలోచిస్తోంది.

దిగ్గజాల మాట ఇదే
కేవలం కోకాకోలా మాత్రమే కాదు మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. మెక్ డొనాల్డ్స్ సీఈఓ క్రిస్ కెంప్జిన్స్కీ కూడా 2026లో ఫైబర్ టాప్ ట్రెండ్ అవుతుందని అంచనా వేశారు. అటు పెప్సీకో సీఈఓ రామన్ లగుర్టా సైతం భవిష్యత్తులో ఫైబర్ అనేది ప్రోటీన్ లాగే పాపులర్ అవుతుందని చెప్పారు. అంటే అగ్రశ్రేణి కంపెనీలన్నీ ఇప్పుడు ఆరోగ్యం అనే లేబుల్ తో మార్కెట్ ను ముంచెత్తేందుకు సిద్ధమయ్యాయి.

వైరల్ అవుతున్న ఫైబర్ మ్యాక్సింగ్…
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫైబర్ మ్యాక్సింగ్ అనే పదం తెగ వినిపిస్తోంది. ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. అందుకే క్యాబేజీ వంటి కూరగాయలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. పింటరెస్ట్ నివేదిక ప్రకారం అమెరికాలో క్యాబేజీ వంటకాల కోసం సెర్చ్ చేసే వారి సంఖ్య 110 శాతం పెరిగింది.

ఆరోగ్యమా? వ్యాపారమా?
కంపెనీలు పీచు పదార్థం గురించి మాట్లాడుతుండటం వెనుక అసలు కారణం వ్యాపారమే. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని జనం భయపడుతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడానికి ఫైబర్ ను అస్త్రంగా వాడుతున్నారు. అయితే సాఫ్ట్ డ్రింక్స్ ద్వారా ఫైబర్ తీసుకోవడం ఎంతవరకు శ్రేయస్కరం అనే చర్చ మొదలైంది. సహజమైన పండ్లు, కూరగాయల ద్వారా వచ్చే పీచుకు ఇది ప్రత్యామ్నాయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిష్ మార్కెట్ నుంచి మెయిన్ స్ట్రీమ్ కి
ప్రస్తుతానికి ఇవి కొన్ని దేశాలకే పరిమితం అయ్యాయి. జపాన్ లో కూడా వీటిని ఒక ప్రత్యేక వర్గం మాత్రమే తాగుతోంది. సాధారణ వినియోగదారులు దాహం తీర్చుకోవడానికి మాత్రమే డ్రింక్స్ కొంటారు. పీచు పదార్థం కోసం కూల్ డ్రింక్ కొనేవారు చాలా తక్కువ. కానీ భారీగా ప్రచారం కల్పించి ఈ ఏడాది నుంచి వీటిని ప్రధాన మార్కెట్లోకి తేవాలని కోకాకోలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆరోగ్యకరమైన బ్రాండ్ గా ముద్ర వేయించుకోవడమే దీని అంతిమ ఉద్దేశం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *