- 2023లో ఏకంగా 13,892 మంది బలి
- ఐఐటీ కాన్పూర్‌లో తాజాగా స్కాలర్ సూసైడ్
- మహారాష్ట్రలో అత్యధికంగా 1,834 మంది
- నిరుద్యోగం, మానసిక ఒత్తిడి ప్రధాన కారణం
- కులం, భాషా పరమైన వివక్షతో సతమతం
సహనం వందే, న్యూఢిల్లీ:
కన్నవారి కలలను నిజం చేయాల్సిన చేతులు కాటికి చేరుతున్నాయి. బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ చదువులు కోసం క్యాంపస్‌లలో అడుగుపెట్టిన విద్యార్థులు.. విగతజీవులుగా మారుతున్నారు. చదువుల ఒత్తిడి ఒకవైపు.. ఉద్యోగం దొరకదన్న బెంగ మరోవైపు యువతను చిదిమేస్తోంది. ఇది కేవలం మరణాల సంఖ్య కాదు.. కొన్ని వేల కుటుంబాల విషాదం.
కాన్పూర్ ఐఐటీలో విషాదం
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థగా పేరొందిన కాన్పూర్ ఐఐటీలో తాజాగా జరిగిన ఘటన అందరినీ కలచివేసింది. 25 ఏళ్ల స్వరూప్ ఈశ్వరం అనే పీహెచ్‌డీ స్కాలర్ ఆరో అంతస్తు నుంచి దూకి తనువు చాలించాడు. గత 23 రోజుల్లో ఈ క్యాంపస్‌లో ఇది రెండో ఆత్మహత్య కావడం గమనార్హం. గత ఐదేళ్ల కాలంలో ఐఐటీల్లో ఏకంగా 65 మంది విద్యార్థులు తనువు చాలించారు. సగటున ఏడాదికి 13 మంది ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఏటా పెరుగుతున్న మరణాలు…
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాలు భయపెడుతున్నాయి. 2019లో దేశంలో 10,335 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. అది ఏటేటా పెరుగుతూ వస్తోంది. 2021 నాటికి ఈ సంఖ్య 13,000 దాటిపోయింది. 2023లో ఆత్మహత్యల సంఖ్య రికార్డు స్థాయిలో 13,892కు చేరింది. అంటే దేశంలో రోజుకు సగటున 38 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
చిన్నారుల నుంచి యువత వరకు
ఆత్మహత్యల మహమ్మారి వయసుతో సంబంధం లేకుండా కాటేస్తోంది. 18 ఏళ్ల లోపు వయసున్న మైనర్లు 2023లో 1,303 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఇక 18 నుంచి 30 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. వారి జీవితాల కంటే చదువులే ఎక్కువన్న భ్రమలో యువత కూరుకుపోతోంది.
రాష్ట్రాల వారీగా గణాంకాలు
విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ 2023లో 1,834 మంది విద్యార్థులు బలవన్మరణం చెందారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ 1,308 మరణాలతో రెండో స్థానంలో ఉంది. కర్ణాటకలో 855 మంది.. జార్ఖండ్‌లో 716 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 523 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కేరళలో 497 మంది ఈ దారుణానికి ఒడిగట్టారు.
పరీక్షల ఫలితాల సమయంలోనే ఎక్కువ
మార్చి నుంచి జూలై నెలల మధ్యే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కాలంలోనే బోర్డు పరీక్షల ఫలితాలు రావడం… కొత్తగా కాలేజీలో అడ్మిషన్లు దొరక్కపోవడం వంటివి జరుగుతాయి. విఫలమైతే సమాజం ఏమనుకుంటుందో అనే భయం విద్యార్థులను ఉరికొయ్యల వైపు నెడుతోంది.

విద్యార్థుల ఆత్మహత్యకు ప్రధాన కారణాలు:
- గొడవలు, శారీరక లేదా మానసిక వేధింపులు
- మానసిక ఆరోగ్య సమస్యలు 54.28 శాతం మరణాలకు కారణం అవుతున్నాయి
- పరీక్షలు, గ్రేడ్ల విషయంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన అకడమిక్ ఒత్తిడి
- విద్యార్థుల మరణాలకు కేవలం అకడమిక్ ఒత్తిడి మాత్రమే కారణం కాదు. కులం పేరుతో చూసే వివక్ష ప్రధాన కారణం. భాషా పరమైన ఇబ్బందులు కూడా వేధిస్తున్నాయి.
- ఆర్థిక ఇబ్బందులు, చదువుల కోసం చేసిన అప్పుల భారం
- ప్రేమ వ్యవహారాలు, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు