- హైదరాబాద్ మెట్రో పరిధిలో 137 ప్లాట్లు
- రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో అమ్మకాలు
- ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం
- వివాదాలు లేని టైటిల్స్… పూర్తి వసతులు
- ఆదిభట్ల, ఎయిర్ పోర్ట్ సమీపంలో ప్రాధాన్యం
- శంకర్ పల్లి వద్ద 1.35 కోట్లకే విల్లాలు
సహనం వందే, హైదరాబాద్:
సొంతింటి కల కంటున్న సామాన్యులకు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తీపి కబురు అందించింది. భాగ్యనగరంలోని కీలక ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎటువంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలాలు కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ప్రకటన ఒక్కసారిగా వేడి పెంచింది. మధ్యతరగతి ప్రజలకు ఇదో సువర్ణావకాశం అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వేలం పాట ఖరారు…
హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో మొత్తం 137 ప్లాట్లను విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఇవన్నీ ప్రభుత్వం స్వయంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లు కావడం విశేషం. ఇప్పటికే అక్కడ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలన్నీ కల్పించారు. ప్లాట్ కొనుగోలు చేసిన వెంటనే ఇల్లు కట్టుకునేందుకు అన్ని రకాల అనుమతులు సిద్ధంగా ఉన్నాయి.
ఆదిభట్ల చెంత ఆఫర్…
ఐటీ రంగానికి నిలయంగా మారుతున్న ఆదిభట్ల సమీపంలోని తొర్రూరు లేఅవుట్ లో ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ గజం కనీస ధరను 25 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండటంతో పెట్టుబడిదారుల చూపు దీనిపై పడింది. భవిష్యత్తులో ఇక్కడ భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
విమానాశ్రయం సమీపంలో…
విమానాశ్రయానికి అత్యంత చేరువలో ఉన్న కుర్మల్ గూడలో కూడా ప్లాట్లు వేలానికి వస్తున్నాయి. ఇక్కడ గజం కనీస ధరను 20 వేల రూపాయలుగా నిర్ణయించారు. రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటం ఈ లేఅవుట్ కు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. ఎయిర్ పోర్ట్ సిటీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ధరలో మంచి స్థలం కావాలనుకునే వారికి ఇది మంచి వేదిక.
రింగ్ రోడ్డు దాపున
బహుదూర్ పల్లి లేఅవుట్ ఇప్పుడు హాట్ కేక్ లా మారింది. ఇక్కడ గజం ధర 27 వేల నుంచి 30 వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత దగ్గరగా ఉండటం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా చేరుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. అందుకే ఇక్కడ వేలం పాటలు హోరాహోరీగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
విల్లాల విందు
ఇళ్ల స్థలాలతోపాటు శంకర్ పల్లి ప్రాంతంలో విల్లాల ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వచ్చింది. సింగాపూర్ వద్ద మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 బీహెచ్ కే డ్యూప్లెక్స్ విల్లాను ఒక కోటి 35 లక్షల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. చదరపు అడుగుకు కేవలం 4500 రూపాయల చొప్పున ధర నిర్ణయించారు. భూమి రిజిస్ట్రేషన్ తో పాటు డీజీపీఏ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. లగ్జరీ జీవితాన్ని కోరుకునే వారికి ఇది సరైన వేదిక.