- నాలుగేళ్లలో సగటు ఆదాయం 3.32 లక్షలు
- 2028 నాటికే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
- 2047 నాటికి ధనిక దేశంగా ఎదిగేందుకు ప్లాన్
- ఎస్బీఐ తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు
సహనం వందే, హైదరాబాద్:
పేదరికం నీడల నుంచి బయటపడి ప్రపంచ యవనికపై భారత్ సగర్వంగా నిలబడబోతోంది. ఒకప్పుడు తిండికి తిప్పలు పడ్డ దేశం.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రథాన్ని నడిపే స్థాయికి చేరుతోంది. ఇది కేవలం అంకెలు చెప్పే లెక్క కాదు… ప్రతి భారతీయుడి తలరాత మారబోతోందన్న నమ్మకం. మన కష్టానికి ఫలితం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మధ్యతరగతికి మంచి రోజులు రానున్నాయి.

పెరగనున్న ఆదాయం
ప్రతి భారతీయుడి సగటు వార్షిక ఆదాయం భారీగా పెరగనుంది. రాబోయే 4 ఏళ్లలో 3.32 లక్షల రూపాయలకు చేరుకుంటుందని ఎస్బీఐ నివేదిక చెబుతోంది. 2030 నాటికి మనం ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఎగువ మధ్యతరగతి దేశాల గ్రూపులో చేరుతాము. ప్రస్తుతం చైనా, ఇండోనేషియా వంటి దేశాలు ఉన్న క్లబ్ లోకి భారత్ అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
మూడో పెద్ద దేశంగా
భారత ఆర్థిక వ్యవస్థ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికే మన దేశ జీడీపీ 415 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. ఆ వెంటనే 2028 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుంది. దీనివల్ల దేశంలో మౌలిక వసతులు పెరిగి సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
అరవై ఏళ్ల పోరాటం
నిరుపేద దేశం అనే ముద్ర నుంచి బయటపడటానికి మనకు 60 ఏళ్లు పట్టింది. 2007లో ఇండియా తొలిసారి దిగువ మధ్యతరగతి దేశాల జాబితాలో చేరింది. అక్కడ నుంచి ఇప్పుడు ఎగువ మధ్యతరగతి స్థాయికి చేరుకోవడానికి కేవలం 23 ఏళ్లు మాత్రమే పడుతోంది. అంటే మన ప్రయాణం ఇప్పుడు వేగవంతమైంది. టెక్నాలజీ, పారిశ్రామికాభివృద్ధి మన వృద్ధికి తోడవుతున్నాయి.
అభివృద్ధి లక్ష్యం
2047 నాటికి భారత్ ను సంపూర్ణ ధనిక దేశంగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది సాధ్యం కావాలంటే మన ఆదాయం ఏడాదికి కనీసం 7.5 శాతం చొప్పున పెరుగుతూ పోవాలి. గత 23 ఏళ్లలో మన వృద్ధి రేటు 8.3 శాతంగా ఉంది. ఇదే జోరు కొనసాగితే ధనిక దేశాల సరసన కూర్చోవడం కష్టమేమీ కాదు. అయితే ప్రపంచ నిబంధనలు మారితే మాత్రం మనం మరింత వేగంగా అంటే 8.9 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుంది.
సంస్కరణల బాట
ఈ ఘనత ఊరికే రాదు. దేశంలో ఆర్థిక సంస్కరణలు నిరంతరం కొనసాగాలని నివేదిక స్పష్టం చేస్తోంది. పెట్టుబడులు పెరగడం, ఉపాధి అవకాశాలు మెరుగుపడటం వల్ల ప్రజల చేతుల్లోకి డబ్బు చేరుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరిగితేనే దేశం మొత్తం ధనిక దేశంగా మారుతుంది. రాబోయే రెండు దశాబ్దాలు భారత ఆర్థిక చరిత్రలో అత్యంత కీలకం కానున్నాయి.
సామాన్యుడి ఆశలు
దేశం ఎదుగుతుంటే ఆ ఫలాలు కిందిస్థాయి వరకు అందాలి. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే ఈ అంకెలకు సార్థకత లభిస్తుంది. 2030 నాటికి సగటు మనిషి ఆర్థిక పరిస్థితి మెరుగైతే అది దేశం సాధించిన అసలైన విజయం అవుతుంది. అగ్రరాజ్యాల సరసన భారత్ నిలిచే రోజు కోసం కోట్లాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు.
లెక్కల గారడీ కాకూడదు...
ప్రతి భారతీయుడి సగటు వార్షిక ఆదాయం 3.32 లక్షల రూపాయలకు చేరుతుందని ఎస్బీఐ వేసిన అంచనా నివేదికపై చర్చ మొదలైంది. ఈ ఆదాయం కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుందన్న విమర్శలు ఉన్నాయి. పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతోంది. జీడీపీ పెరుగుదల కేవలం అంకెల్లోనే ఉంటే సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు. ఈ ఆదాయం వాస్తవంగా మనిషి జీవన ప్రమాణాలను మార్చాలి. భవిష్యత్తు భారతం అలా రూపుదిద్దుకుంటుందా?