అమెరికాపై ‘యూరప్పా’రప్పా – ట్రంప్ అస్త్రానికి మించి యూరప్ బ్రహ్మాస్త్రం!

America Vs Europe
  • యాంటీ కోయర్షన్ ఆయుధం’తో దెబ్బకు దెబ్బ
  • బెదిరిస్తే వాణిజ్య ఆంక్షలు తప్పవని కౌంటర్
  • గ్రీన్‌లాండ్ పై హెచ్చరికలతో ఈయూ అలర్ట్
  • యూరప్ మార్కెట్లో అమెరికాకు ప్రవేశం క్లోజ్
  • అగ్రరాజ్యం వర్సెస్ ఐరోపా కూటమి పాలిటిక్స్
  • ప్రపంచ వాణిజ్య యుద్ధంలో సరికొత్త మలుపు
  • అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా 27 దేశాలు ఏకం

సహనం వందే, యూరప్:

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ కొనుగోలుపై చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. తన మాట వినకపోతే ఐరోపా దేశాలపై సుంకాల బాదుడు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ట్రంప్ బెదిరింపులకు బెదరకుండా యూరప్ తన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధాన్ని బయటకు తీస్తోంది.

Anti Coercion weapon

ఆయుధం పేరు యాంటీ కోయర్షన్
యాంటీ కోయర్షన్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఒక దేశం తన రాజకీయ ప్రయోజనాల కోసం మరో దేశంపై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చినప్పుడు దానిని తిప్పికొట్టే ఒక చట్టపరమైన ఆయుధం. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడటం దీని ప్రధాన ఉద్దేశం. ఒకవేళ ట్రంప్ గ్రీన్‌లాండ్ కోసం యూరప్ దేశాలపై అన్యాయంగా సుంకాలు విధిస్తే ఈ నిబంధన ద్వారా అమెరికా కంపెనీలకు యూరప్ మార్కెట్లను మూసివేయడం, మేధో సంపత్తి హక్కులను నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఈ ఆర్థిక బ్రహ్మాస్త్రం అమెరికా వ్యాపార ప్రయోజనాలను నేరుగా దెబ్బతీసి ఆ దేశాన్ని దారిలోకి తెచ్చుకునే వెసులుబాటును ఐరోపా కూటమికి కల్పిస్తుంది.

బెదిరింపులకు చెక్
ట్రంప్ విధానం అంతా దూకుడుగా ఉంటుంది. ఆయన తన ఆర్థిక ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై వాణిజ్య యుద్ధానికి దిగుతారు. గ్రీన్‌లాండ్ విషయంలో డెన్మార్క్, ఇతర దేశాలను ఇబ్బంది పెట్టాలని చూస్తే యూరోపియన్ యూనియన్ చూస్తూ ఊరుకోదు. ఈ కొత్త నిబంధన ప్రకారం అమెరికా నుంచి వచ్చే వస్తువులపై యూరప్ దేశాలు భారీగా సుంకాలు వేయవచ్చు. అలాగే అమెరికా కంపెనీలపై కఠినమైన నిబంధనలు అమలు చేసే అధికారం వీరికి లభిస్తుంది.

దెబ్బకు దెబ్బ
ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం. ఒకవేళ అమెరికా మొండిగా వ్యవహరించి సుంకాలు విధిస్తే యూరోపియన్ యూనియన్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తుంది. వాణిజ్య సంబంధాలను నిలిపివేయడం లేదా పెట్టుబడులపై ఆంక్షలు విధించడం వంటివి ఇందులో ఉంటాయి. ఇది ఒక్క దేశం తీసుకునే నిర్ణయం కాదు.. యూరోపియన్ యూనియన్ లోని 27 దేశాలు కలిసికట్టుగా తీసుకునే నిర్ణయం కావడం విశేషం.

గ్రీన్‌లాండ్ చిచ్చు
గ్రీన్‌లాండ్ అనేది డెన్మార్క్ పరిధిలో ఉన్న ఒక స్వయంప్రతిపత్తి గల ద్వీపం. దీనిపై కన్నేసిన ట్రంప్ దానిని కొనుగోలు చేస్తామని లేదా తమ అధీనంలోకి తెచ్చుకుంటామని ప్రకటిస్తున్నారు. దీనికి డెన్మార్క్ అంగీకరించకపోవడంతో ఆయన ఐరోపా దేశాలపై కోపం పెంచుకున్నారు. ఈ వివాదం ఇప్పుడు రెండు పెద్ద ఆర్థిక శక్తుల మధ్య యుద్ధానికి దారితీస్తోంది. గ్రీన్‌లాండ్ లో ఉన్న అపారమైన ఖనిజ సంపదే ఈ గొడవకు అసలు కారణం.

వాణిజ్య యుద్ధం సెగలు
ఒకవేళ యూరోపియన్ యూనియన్ ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే ప్రపంచ వాణిజ్యం అతలాకుతలం అవుతుంది. అమెరికా, యూరప్ మధ్య జరిగే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతింటుంది. ఇది కేవలం గ్రీన్‌లాండ్ కు సంబంధించిన విషయం మాత్రమే కాదు.. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరు గొప్ప అనే అహంకార పోరాటంగా మారింది. ట్రంప్ తన రెండో విడత పాలనలో మరింత దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఈ ఉత్కంఠ పెరిగిపోతోంది.

తదుపరి మలుపు ఏంటి?
ప్రస్తుతానికి యూరోపియన్ యూనియన్ కేవలం హెచ్చరికలు మాత్రమే చేస్తోంది. ట్రంప్ తన నిర్ణయాలను మార్చుకోకపోతే మాత్రం యాంటీ కోయర్షన్ ఇన్‌స్ట్రుమెంట్ ను అమలులోకి తెస్తుంది. ఇది జరిగితే ప్రపంచ దేశాలన్నీ రెండు వర్గాలుగా చీలిపోయే ప్రమాదం ఉంది. అగ్రరాజ్యం అమెరికాను ఢీకొనేందుకు ఐరోపా దేశాలు సిద్ధమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో ఈ వాణిజ్య యుద్ధం ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *