- ఏడాదికి 200 కోట్ల లక్ష్యంతో పరుగులు
- 2024లో మొదలై రికార్డు స్థాయి ఆదాయం
- ఏడాది తిరగకుండానే 140 కోట్ల మార్కు
- 16 లక్షలకు పైగా ఆర్డర్లతో కస్టమర్ల క్యూ
- ఆధ్యాత్మిక మార్కెట్లో నమ్మకమే పెట్టుబడిగా…
సహనం వందే, హైదరాబాద్:
సాధారణ మధ్యతరగతి యువకుడు ఐటీ ఉద్యోగం వదిలేసి జ్యోతిష్య రంగంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది? పునీత్ గుప్తా ప్రస్థానం సరిగ్గా అలాగే మొదలైంది. ఒక చిన్న ఆలోచన నేడు ఆధ్యాత్మిక వాణిజ్య సామ్రాజ్యంగా మారింది. ఆస్ట్రోటాక్ స్టోర్ ద్వారా కేవలం ఏడాదిలోనే వందల కోట్ల ఆదాయం సాధించి కార్పొరేట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచారు. నమ్మకానికి టెక్నాలజీ తోడైతే సక్సెస్ ఎలా ఉంటుందో ఈ కుర్రాడు నిరూపించాడు.
పునీత్ ప్రస్థానం
ఆస్ట్రోటాక్ వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా ఢిల్లీకి చెందిన వారు. ఆయన చదువులో ఎప్పుడూ టాపరే. పంజాబ్ థాపర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక ముంబయిలో నోమురా వంటి బడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులో ఐటీ ఉద్యోగం చేశారు. అయితే సొంతంగా ఏదైనా చేయాలన్న తపనతో ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. తన భవిష్యత్తు గురించి ఒక జ్యోతిష్కుడు చెప్పిన జోస్యం నిజం కావడంతో ఆయనకు ఈ రంగంపై నమ్మకం పెరిగింది.
ఆధ్యాత్మిక స్టోర్
పునీత్ గుప్తా మొదట ఆస్ట్రోటాక్ యాప్ ద్వారా జ్యోతిష్య సేవలు అందించారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక ఉత్పత్తుల మార్కెట్లో ఉన్న లోపాలను గుర్తించారు. గతేడాది నవంబర్ 2024లో ఆస్ట్రోటాక్ స్టోర్ ప్రారంభించారు. ఈ వేదిక కేవలం ఏడాదిలోనే 140 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రతి ఏటా 200 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే దిశగా శరవేగంగా దూసుకుపోతోంది. జ్యోతిష్కుల సలహాతో వస్తువులను అమ్మడం ఇక్కడ విశేషం.
పూజా సామాగ్రి
ఈ ఆన్ లైన్ స్టోర్ లో దాదాపు అన్ని రకాల ఆధ్యాత్మిక వస్తువులు లభిస్తాయి. ముఖ్యంగా వివిధ రకాల రుద్రాక్షలు, ధ్రువీకరించిన రత్నాలు, స్ఫటిక మాలలు ఇక్కడ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వీటితో పాటు కుబేర యంత్రాలు, శ్రీ యంత్రాలు, వివిధ దేవతా మూర్తుల విగ్రహాలను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో పూజకు కావాల్సిన పసుపు, కుంకుమ నుంచి మొదలుకొని ధూప దీప నైవేద్యాల వరకు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంచారు.


నాణ్యతకు పెద్దపీట
బయట మార్కెట్లో దొరికే రత్నాలు లేదా యంత్రాల అసలైనవా కాదా అనే భయం ప్రజల్లో ఉంటుంది. దీన్ని పోగొట్టేందుకు పునీత్ ఒక పక్కా ప్లాన్ వేశారు. ఆస్ట్రోటాక్ విక్రయించే ప్రతి వస్తువును నిపుణులైన జ్యోతిష్కులు స్వయంగా పరీక్షిస్తారు. ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది… దాని నాణ్యత ఏమిటి అనే వివరాలతో కూడిన సర్టిఫికెట్ ఇస్తారు. ఈ పారదర్శకత వల్లే కేవలం ఒక్క ఏడాదిలోనే 16 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి.
ఐటీ నుంచి ఆధ్యాత్మికత
ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి ఆధ్యాత్మిక రంగంలోకి రావడం ఆశ్చర్యంగా అనిపించినా పునీత్ తన ఐటీ తెలివితేటలను ఇక్కడ వాడారు. యాప్ లో కస్టమర్ల ప్రవర్తనను విశ్లేషించి వారికి ఎలాంటి పూజా సామాగ్రి అవసరమో గుర్తించారు. దీనివల్ల కస్టమర్లకు వెతకాల్సిన అవసరం లేకుండానే కావాల్సినవి దొరుకుతున్నాయి. జ్యోతిష్యం చెప్పించుకున్న వెంటనే దానికి సంబంధించిన పరిహార వస్తువులు అక్కడే కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు.
సక్సెస్ సీక్రెట్
దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక రంగం చాలా అస్తవ్యస్తంగా ఉండేది. దాన్ని పునీత్ ఒక పద్ధతి ప్రకారం స్ట్రీమ్ లైన్ చేశారు. నమ్మకమైన వస్తువులను సరసమైన ధరలకే అందించడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఐటీ రంగంలో ఉన్న వేగవంతమైన పనితీరును ఆధ్యాత్మిక వ్యాపారానికి జోడించడం వల్లే ఇంతటి భారీ వృద్ధి సాధ్యమైంది. రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక ఉత్పత్తుల మార్కెట్లో ఆస్ట్రోటాక్ మరింత కీలక పాత్ర పోషించనుంది.