- పర్యాటక వీసాలకు తక్కువ వెయిటింగ్
- ముంబై, ఢిల్లీలో కొనసాగుతున్న భారీ జాప్యం
- స్టూడెంట్ వీసాలలో వేగం పెంచిన కాన్సులేట్లు
- వివరాలు వెల్లడించిన అమెరికా విదేశాంగశాఖ
- ట్రంప్ హయాంలో మారిన నిబంధనల ఎఫెక్ట్
సహనం వందే, హైదరాబాద్:
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు వీసా ఇంటర్వ్యూల విషయంలో ఊరట లభిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కాన్సులేట్ లో వీసా స్లాట్లు త్వరగా దొరుకుతున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కొన్ని నగరాల్లో వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గింది. ట్రంప్ సర్కార్ అమలు చేస్తున్న కొత్త నిబంధనల నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

భాగ్యనగరంలో వేగంగా స్లాట్లు…
హైదరాబాదులో అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురుచూసే సమయం గణనీయంగా తగ్గింది. పర్యాటక వీసాల (బి1/బి2) కోసం సగటు వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం రెండున్నర నెలలుగా ఉంది. మరో 4 నెలల వ్యవధిలోనే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు దొరుకుతున్నాయి. కోల్ కతాలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లేవారికి పెద్ద ఊరట లభించినట్లయింది.
చెన్నైలో మరీ తక్కువ…
దక్షిణ భారత్ లోని చెన్నై కాన్సులేట్ లో వెయిటింగ్ సమయం కేవలం నెలన్నర మాత్రమే నమోదైంది. పర్యాటక వీసా దరఖాస్తుదారులకు ఇక్కడ త్వరగా స్లాట్లు లభిస్తున్నాయి. అయితే తదుపరి అందుబాటులో ఉండే తేదీలపై స్పష్టమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. గ్లోబల్ వెయిటింగ్ డేటా ప్రకారం చెన్నైలో ప్రక్రియ వేగంగా సాగుతోంది.
మెట్రో నగరాల్లో జాప్యం…
ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో వీసా వెయిటింగ్ పీరియడ్ దరఖాస్తుదారులను వేధిస్తోంది. ముంబైలో సగటు వెయిటింగ్ రెండున్నర నెలలే ఉన్నా.. తదుపరి ఇంటర్వ్యూ స్లాట్ దొరకడానికి సుమారు 7 నెలల సమయం పడుతోంది. ఢిల్లీలో అయితే ఈ నిరీక్షణ ఏకంగా 8 నెలల వరకు ఉంది. పర్యాటక వీసాల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులకు గుడ్ న్యూస్
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల వీసాల (ఎఫ్, ఎమ్, జె కేటగిరీలు) ప్రక్రియ వేగంగా జరుగుతోంది. న్యూఢిల్లీలో కేవలం ఒక నెలలోనే ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, కోల్ కతాలో 2 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ముంబైలో చదువుల వీసా కోసం 3 నెలల సమయం పడుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విభాగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఉద్యోగ వీసాల పరిస్థితి
ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లే వారికి (హెచ్, ఎల్ కేటగిరీలు) ముంబైలో అత్యంత వేగంగా స్లాట్లు దొరుకుతున్నాయి. అక్కడ కేవలం ఒక నెలలోనే అపాయింట్‌మెంట్ లభిస్తోంది. హైదరాబాద్ లో మాత్రం ఇందుకు రెండున్నర నెలల సమయం పడుతోంది. న్యూఢిల్లీలో ఉద్యోగ వీసాల స్లాట్లపై ప్రస్తుతానికి అనిశ్చితి నెలకొంది. అక్కడ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ క్రమ పద్ధతిలో లేవని నివేదికలు చెబుతున్నాయి.
ట్రంప్ మార్కు ఆంక్షలు
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీసా విధానాల్లో కఠిన మార్పులు వచ్చాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాల నుంచి వలసలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే భారత్ విషయంలో మాత్రం కాన్సులేట్ల పనితీరును మెరుగుపరిచే ప్రయత్నం జరుగుతోంది. నగరాన్ని బట్టి, వీసా రకాన్ని బట్టి వెయిటింగ్ సమయాల్లో భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయి.