- కామారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో కుక్కలకు విషం
- పంచాయతీ ఎన్నికల్లో హామీతో కుక్కల బలి
- కొందరు సర్పంచులపై క్రిమినల్ కేసులు
- సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కలకలం
- వెలుగులోకి తెచ్చిన ‘పీటీఐ’ వార్తా సంస్థ
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో కొన్ని గ్రామాల్లో కుక్కల సంహారం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన నాయకులు కుక్కల వేట మొదలుపెట్టారు. వీధి కుక్కల బెడద తీరుస్తామని ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రక్తం చిందించారు. మూగజీవాలను రాక్షసంగా అంతమొందించారు. కుక్కలను విషపు ఇంజక్షన్లతో చంపేసి గుంతల్లో పాతేశారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దాన్ని ఇండియా టుడే మీడియా వెలుగులోకి తెచ్చింది.

హామీ తీరింది… ప్రాణం పోయింది
తెలంగాణలోని కామారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో గత వారం రోజుల్లో భయంకరమైన ఘటనలు వెలుగుచూశాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు గట్టి హామీ ఇచ్చారు. గ్రామంలో కుక్కలు, కోతుల బెడద లేకుండా చేస్తామని ఓటర్లకు మాట ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ హామీని నెరవేర్చేందుకు నడుం బిగించారు. సుమారు 500 వీధి కుక్కలకు విషం ఇచ్చి చంపారు. కామారెడ్డి జిల్లాలోని భవానిపేట, పాల్వంచ, ఫరీద్‌పేట, వాడి, బండరామేశ్వరంపల్లి గ్రామాల్లో ఈ దారుణాలు ఎక్కువగా జరిగాయి. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే గత వారం రోజుల్లో 200 కుక్కల ప్రాణాలు పోయాయి.
బయటపడ్డ బాగోతం
జంతు సంక్షేమ కార్యకర్త అదులాపురం గౌతమ్ ఫిర్యాదుతో ఈ దారుణకాండ బయటకు వచ్చింది. జనవరి 12వ తేదీన ఆయనకు కుక్కల సామూహిక హత్యలపై సమాచారం అందింది. వెంటనే ఆయన తన స్నేహితుడితో కలిసి భవానిపేట గ్రామానికి వెళ్లారు. అక్కడ ఒక దేవాలయం సమీపంలో కుప్పలుగా పడి ఉన్న కుక్కల కళేబరాలను చూసి షాక్ తిన్నారు. గ్రామ సర్పంచుల కనుసన్నల్లోనే ఈ ఘాతుకం జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా పథకం ప్రకారమే విషపు ఇంజక్షన్లు ఇచ్చి కుక్కలను చంపేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ క్రూరత్వంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

పోలీసుల కొరడా
ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. కామారెడ్డి జిల్లాలో ఐదుగురు సర్పంచులతో పాటు కుక్కలను చంపడానికి కిరాయికి వచ్చిన కిషోర్ పాండే అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. హన్మకొండ జిల్లాలోని శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో కూడా ఇలాగే 300 కుక్కలను చంపేశారు. అక్కడ కూడా ఇద్దరు మహిళా సర్పంచులు, వారి భర్తలు, పంచాయతీ కార్యదర్శులు సహా 9 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. మొత్తం మీద ఆరు గ్రామాల ప్రజాప్రతినిధులు ఈ కుక్కల వేటలో నిందితులుగా ఉన్నారు. పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
సంతాన నిరోధక శస్త్రచికిత్సలు ఎక్కడ?
కుక్కల నియంత్రణకు చట్టబద్ధమైన మార్గాలు ఉన్నా కొన్నిచోట్ల అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయించడంలో విఫలమయ్యారు. వాటి జనాభా పెరిగిపోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా చంపడం ఒక్కటే పరిష్కారం కాదని మేధావులు చెబుతున్నారు. యంత్రాంగం పర్యవేక్షణ లోపం వల్లే సర్పంచులు ఇలాంటి సాహసాలకు ఒడిగడుతున్నారు. చనిపోయిన కుక్కల కళేబరాలను ఊరి బయట గొయ్యి తీసి పూడ్చిపెట్టి సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం చేశారు.
సుప్రీంకోర్టు హెచ్చరిక
ఇదే సమయంలో సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్క కాటుకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. కుక్కలకు ఆహారం పెట్టే వారు కూడా బాధ్యత వహించాలని సూచించింది. వీధి కుక్కల సమస్య పరిష్కారంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కలను పెంచుకోవాలనుకునే వారు ఇంట్లోనే ఉంచుకోవాలని.. రోడ్లపై ఇతరులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించకూడదని స్పష్టం చేసింది. అయితే చంపడం అనేది రాజ్యాంగ విరుద్ధమని జంతు ప్రేమికులు గుర్తు చేస్తున్నారు.
భవిష్యత్తుపై ఆందోళన
తెలంగాణలో జరిగిన ఈ ఘటనలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఓట్ల కోసం మూగజీవాలను బలిపశువులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదికల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. విష ప్రయోగం జరిగిందని తేలితే దోషులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. మరోవైపు గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని… కానీ ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడకూడదని స్థానికులు కోరుతున్నారు. పల్లెల్లో నెలకొన్న ఈ ఉద్రిక్తత ఎటు దారితీస్తుందో చూడాలి.