24 ఏళ్లు… 340 కోట్లు – చిన్న వయసులో బూట్ల వ్యాపారం

OS Group Founder Oscar 24 Years Young Entrepreneur
  • కాలేజీ వదిలేసి షూ వ్యాపారంలోకి ఎంట్రీ
  • సరఫరా వ్యవస్థలోని లోపాలే అవకాశంగా
  • నాలుగేళ్లప్పుడే పొద్దు తిరుగుడు గింజల స్టాల్
  • అమెరికా యువకుడు ఆస్కార్ బిజినెస్ జర్నీ

సహనం వందే, హైదరాబాద్:

వ్యాపారవేత్త కావడానికి అనుభవం కంటే ఆలోచన ముఖ్యమని నిరూపించాడు 24 ఏళ్ల అమెరికా యువకుడు ఆస్కార్ రాచ్‌మాన్స్కీ. అందరూ చదువుల వెంట పడుతుంటే తను మాత్రం స్పోర్ట్స్ షూస్ అమ్మకాలతో కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కేవలం ఐదేళ్ల క్రితం ఒక చిన్న గదిలో మొదలైన తన ప్రయాణం.. నేడు ఏటా వందల కోట్ల ఆదాయం గడించే స్థాయికి చేరింది. యువతకు ఇదొక స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ.

Oscar  Rachmansky 24 years entreprenuer

అమెరికా కుర్రాడి అద్భుత ప్రయాణం
న్యూజెర్సీకి చెందిన ఆస్కార్‌కు చిన్నప్పటి నుంచే వ్యాపారం అంటే ప్రాణం. మిగిలిన పిల్లలు నిమ్మరసం అమ్ముతుంటే ఈయన నాలుగేళ్ల వయసులోనే పొద్దుతిరుగుడు గింజల స్టాల్ పెట్టాడు. తండ్రి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండగా… తల్లి గృహిణిగా ఉండేవారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆస్కార్.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని నిరంతరం తపించేవాడు. అందుకే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా గమనిస్తూ వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు.

చదువుకు స్వస్తి… లక్ష్యం వైపు అడుగు
హైస్కూల్ పూర్తి కాగానే కెనడాలోని మాంట్రియల్‌లో ఉన్న ప్రసిద్ధ మెక్‌గిల్ యూనివర్శిటీలో ఆస్కార్ చేరాడు. అయితే అక్కడ కేవలం మొదటి నెల గడవకముందే తనకు చదువు అబ్బదని అర్థమైంది. తాను దాచుకున్న సుమారు 25 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని విస్తరించాడు. కేవలం మొదటి ఏడాది ముగియగానే డిగ్రీ మధ్యలోనే వదిలేసి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాడు. 2019లో కేవలం 20 ఏళ్ల లోపే ఓఎస్ గ్రూప్‌ను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సంక్షోభంలోనే అవకాశం
కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. బూట్ల ఉత్పత్తి తగ్గిపోయి ధరలు భారీగా పెరిగాయి. ఆ సమయంలో రిటైలర్లు సరుకు దొరక్క ఇబ్బంది పడుతుంటే ఆస్కార్ మాత్రం తన నెట్‌వర్క్‌తో సరుకును సరఫరా చేశాడు. మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడటమే అతన్ని అందరికంటే ముందు వరుసలో నిలబెట్టింది. తన దగ్గరున్న డబ్బునంతా వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టి రిస్క్ తీసుకున్నాడు.

డబ్బాలతోనే కార్యాలయం
వ్యాపారం మొదట్లో ఆస్కార్ దగ్గర పెద్ద ఆఫీసు కూడా లేదు. ఖాళీగా ఉన్న షూ బాక్సులనే గోడలుగా మార్చుకుని చిన్న కేబిన్లు తయారు చేసుకున్నారు. తనతో పాటు పనిచేసే మొదటి ఉద్యోగితో కలిసి రాత్రింబవళ్లు శ్రమించాడు. రోజుకు 15 గంటల పాటు కష్టపడి కంపెనీని అభివృద్ధి చేశాడు. యజమానిని అని చెప్పుకోకుండా తనే స్వయంగా బాక్సులను ప్యాక్ చేసేవాడు. ఆ అంకితభావమే నేడు అనేకమంది మంది నిపుణులైన ఉద్యోగులతో పనిచేసే స్థాయికి చేర్చింది.

ఆదాయంలో సరికొత్త రికార్డు
2025 నాటికి ఆస్కార్ స్థాపించిన ఓఎస్ గ్రూప్ సుమారు 40 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 340 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. ప్రతి నెలా 25 వేల వస్తువులను న్యూజెర్సీలోని పెద్ద గిడ్డంగి నుంచి సరఫరా చేస్తున్నారు. నైక్, అడిడాస్ వంటి ప్రముఖ బ్రాండ్ల స్పోర్ట్స్ షూస్‌లకు హోల్‌సేల్ మార్కెట్‌లో ఈ సంస్థ ఒక ప్రధాన కేంద్రంగా మారింది.

భవిష్యత్తుపై ధీమా
బూట్ల వ్యాపారంతోనే ఆస్కార్ ఆగిపోవాలని అనుకోవడం లేదు. తన సంస్థను ఒక పూర్తి స్థాయి వ్యాపార భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నాడు. ఇతర కంపెనీలకు ఫైనాన్సింగ్, సాఫ్ట్‌వేర్ సేవలు అందించేలా విస్తరించాలని చూస్తున్నాడు. ఇప్పుడు పని భారం తగ్గించుకుని విదేశీ ప్రయాణాలపై దృష్టి పెడుతున్నాడు. వ్యాపారంలో కష్టపడటం కంటే తెలివిగా పనిచేయడం ముఖ్యమని ఈ యువ బిలియనీర్ చెబుతున్నాడు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *