- ఏకంగా 10 పాలసీలు అంటగట్టిన ఎస్‌బీఐ
- బీమా రంగంలో బ్యాంకుల భారీ కుంభకోణం
- కమీషన్ల కోసం వృద్ధులతో అధికారుల ఆట
- ఫిక్స్‌డ్ డిపాజిట్ అని చెబుతూ మోసం
- లక్షల మంది ఫిర్యాదు చేసినా డోంట్ కేర్
- ఐదేళ్లకే సగం పాలసీలు రద్దుతో కోట్లు మాయం
సహనం వందే, హైదరాబాద్:
భారతదేశంలో ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ అనేది ఒక నిశ్శబ్ద ఆర్థిక నేరంలా వేళ్లూనుకుంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి సామాన్యుల నమ్మకాన్ని యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నాయి. రిటైర్ అయిన వృద్ధుల జీవితకాల పొదుపు మొత్తమే లక్ష్యంగా ఈ వ్యవస్థీకృత దందా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పాలసీలు అంటగడుతూ అమాయకుల జీవితాలను రోడ్డున పడేస్తున్న ఈ దారుణం ఇది.

నమ్మించి గొంతు కోసిన ఎస్‌బీఐ
కోల్‌కతాకు చెందిన మీరా దాస్ ఉదంతం ఈ వ్యవస్థీకృత మోసానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన 12 లక్షల రూపాయలను ఎస్‌బీఐ మేనేజర్ మాట నమ్మి ఇన్సూరెన్స్‌లో పెట్టారు. ఆ వృద్ధ దంపతులు దానిని ఫిక్స్‌డ్ డిపాజిట్ అని నమ్మారు. కానీ ఆ పాలసీ 2046లో మెచ్యూరిటీకి వస్తుంది. అప్పటికి మీరా దాస్ వయసు 85 ఏళ్లు. అంటే ఆమె బతికున్నప్పుడు ఆ డబ్బు చేతికి అందే అవకాశం లేదు. బ్యాంక్ అధికారులపై నమ్మకంతో ఖాళీ పత్రాలపై సంతకాలు చేసినందుకు ఆమె కష్టార్జితం ఇప్పుడు లాక్ అయిపోయింది.
దేశవ్యాప్తంగా విస్తరించిన విషవలయం…
ఈ దోపిడీ కేవలం ఒక నగరానికో లేదా ఒక వ్యక్తికో పరిమితం కాలేదు. ముంబైకి చెందిన అశ్విన్ జయంతిలాల్ షాకు 40 లక్షల వడ్డీ లేని లోన్ ఇస్తామని నమ్మించి మూడు పాలసీలు అమ్మారు. చెన్నైలో ప్రధేబన్ అనే వ్యక్తికి ఐఆర్డీఏఐ డైరెక్టర్‌గా ఫోన్ చేసి డమ్మీ పాలసీల పేరుతో 10 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఢిల్లీలో సత్యపాల్ అనే హాస్పిటల్ అటెండెంట్‌ను అంబుడ్స్‌మెన్ ప్రతినిధులమని నమ్మి మోసం చేశారు. అధికారుల టార్గెట్లు, భారీ కమీషన్ల కోసం సామాన్యుల అవసరాలను కాలరాస్తున్నారు.
మానవత్వం మరచిన వికృత దందా
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘటన ఇన్సూరెన్స్ రంగంలోని కుళ్లును ఎత్తి చూపుతోంది. 82 ఏళ్ల వృద్ధుడైన కుశాల్ సింగ్ బోరా బిస్త్‌కు ఏకంగా 10 ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మారు. అతనికి కనీసం ఓటీపీ ఎలా వాడాలో కూడా తెలియదు. ఒక 82 ఏళ్ల వ్యక్తికి దీర్ఘకాలిక పాలసీలు అమ్మడం వెనుక ఉన్న నైతికతను బ్యాంకులు పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ బ్యాంక్ వేర్వేరు సంస్థలని కస్టమర్లకు చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు. 15 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ గురించి కూడా వివరించకుండా మోసాలకు పాల్పడుతున్నారు.
లక్షల్లో ఫిర్యాదులు…
గణాంకాలు పరిశీలిస్తే ఈ దోపిడీ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. 2025లో అనుచిత వ్యాపార పద్ధతుల కింద 26 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. బీమా భరోసాలో 2.5 లక్షల గ్రీవెన్సెస్ నమోదయ్యాయి. ఇన్సూరెన్స్ సమాధాన్ వంటి సంస్థల వద్దకు వేల కేసులు వస్తున్నాయి. విచారకరమైన విషయం ఏంటంటే ఐదేళ్ల తర్వాత కేవలం 50 శాతం పాలసీలు మాత్రమే కొనసాగుతున్నాయి. దీనివల్ల మధ్యలోనే పాలసీ రద్దు చేసుకునే కస్టమర్లకు భారీగా పెట్టుబడి నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టమే కంపెనీలకు లాభంగా మారుతోంది.
నివేదికలను తొక్కిపెట్టిన వ్యవస్థ
ఈ ప్రమాదం గురించి 2009లోనే స్వరూప్ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 2015లో బోస్ కమిటీ కూడా తప్పుడు పద్ధతులపై సమగ్ర నివేదిక ఇచ్చింది. మొదటి ఏడాది ఇచ్చే భారీ కమీషన్లే ఈ మిస్ సెల్లింగ్‌కు ప్రధాన కారణమని తేలింది. ఇన్సూరెన్స్ ఏజెంట్లలో 90 శాతం మందికి పాలసీలపై కనీస అవగాహన ఉండటం లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు లేకపోవడమే ఈ దందాకు బలం చేకూరుస్తోంది. ఐఆర్డీఏఐ పర్యవేక్షణ లోపం వల్ల ఇన్సూరెన్స్ రంగం ఒక విషవలయంలా మారింది.
నిర్మలమ్మ హెచ్చరికలు పనిచేసేనా
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బ్యాంకులను తీవ్రంగా హెచ్చరించారు. మిస్ సెల్లింగ్ అనేది ముమ్మాటికీ నేరమని ఆమె స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గత నెలలో కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. పాలసీల ఫీచర్లు సరళంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. కమీషన్లు జీవితకాలం వచ్చేలా మార్పులు చేస్తేనే ఈ వేట ఆగుతుంది. ఫిర్యాదుల డేటాను బహిరంగపరచడం ద్వారా కంపెనీల జవాబుదారీతనాన్ని పెంచవచ్చు. అప్పుడే మీరా దాస్ వంటి బాధితులకు భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్