గోదావరి తీరాన మరణ మృదంగం! – కాకినాడలో భారీ పేలుడు… 20 మంది మృతి

Vetlapalemm Issue
  • రాజమండ్రిలో విషపూరితమైన కల్తీ పాలు
  • ఐదుగురి మృతి… ఆసుపత్రిలో మరో 8 మంది
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారుణాలు
  • వరుస సంఘటనలతో జనంలో భయాందోళన
  • నిద్రపోతున్న అధికారులు.. పోతున్న ప్రాణాలు

సహనం వందే, కాకినాడ/రాజమండ్రి:

ఉమ్మడి గోదావరి జిల్లాలు వరుస విషాదాలతో వణికిపోతున్నాయి. ఒకవైపు శనివారం కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడులో 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరోవైపు మూడు రోజుల క్రితం రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఐదుగురిని బలితీసుకున్నాయి. పారిశ్రామిక భద్రత, ఆహార కల్తీ అంశాల్లో వ్యవస్థల వైఫల్యం ప్రజల ప్రాణాలను గాలిలో కలిపేస్తోంది. యంత్రాంగం నిర్లక్ష్యంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

వేట్లపాలెంలో మృత్యుఘోష
సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం శనివారం మధ్యాహ్నం భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 11 మంది కాకినాడలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతులందరూ పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.

Kakinada Vetlapalem Issue
Rajahmundry Milk Issue

రాజమండ్రిలో పాల విషం
రాజమహేంద్రవరంలో పాల సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమైంది. పాలను నిల్వ చేసే కేంద్రంలో కూలెంట్ రసాయనం లీకై పాలలో కలిసింది. ఈ విషపూరిత పాలు తాగిన ప్రజల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. పాలలో కలిసిన ప్రమాదకర రసాయనాల వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయి. సాధారణ ప్రజలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ప్రమాదం కాదు.. బాధ్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిన వ్యవస్థీకృత నేరమని స్థానికులు మండిపడుతున్నారు.

ప్రాణాలు తీసిన రసాయనం
కల్తీ పాలు తాగిన బాధితుల్లో కిడ్నీలు విఫలమై ఇప్పటివరకు 5 మంది మృతి చెందారు. రక్తంలోని వ్యర్థాలను శుద్ధి చేసే శక్తిని కిడ్నీలు కోల్పోవడంతో ఈ మరణాలు సంభవించాయి. బాధితులు ఆసుపత్రికి చేరే సమయానికే ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో 8 మంది ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతుంది. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న పాల కేంద్రాల నిర్వహణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

నిర్లక్ష్యపు నీడలో భద్రత
కాకినాడ పేలుడు, రాజమండ్రి పాల ఉదంతం రెండూ కూడా అధికారుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. పరిశ్రమల్లో, ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాల్సిన యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. నిబంధనలకు విరుద్ధంగా కాలం చెల్లిన యంత్రాలను వాడటం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. పాల పరిశ్రమలో గుత్తాధిపత్యం కోసమే ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

లోతైన విచారణకు డిమాండ్
గోదావరి జిల్లాల్లో జరిగిన ఈ రెండు వేర్వేరు ఘటనలపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. పేలుడుకు కారణమైన పరిశ్రమ యజమానులు, కల్తీ పాలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. పాల నమూనాల నివేదికలు త్వరగా రావాలని ప్రజలు కోరుతున్నారు. వ్యవస్థల్లో ఉన్న లొసుగులను వాడుకుని అమాయకుల ప్రాణాలతో ఆడుకునే వారిపై రాజీలేని పోరాటం చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే ఇలాంటి ఘోరకలిని అడ్డుకోవడం సాధ్యమవుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *