సహనం వందే, హైదరాబాద్:
ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. పండుగ పూట అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మరీ విలేకరుల ఇళ్లలోకి చొరబడటం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని ఆయన మండిపడ్డారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా లేదా చట్టపరమైన నిబంధనలు పాటించకుండా బలవంతంగా తీసుకువెళ్లడం నిరంకుశ మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. జర్నలిస్టులు నేరస్థులు లేదా ఉగ్రవాదులు కాదని.. వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం వల్ల మీడియా రంగంలో భయం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు వారి కుటుంబ సభ్యులకు తీవ్ర మానసిక గాయాన్ని మిగిల్చాయని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను గౌరవించి అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమని ప్రభుత్వం గుర్తించి ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని జస్టిస్ ఈశ్వరయ్య కోరారు.