- ఖొమైనీ నెత్తురుతో తడుస్తున్న శాంతి
- శాంతి బహుమతి సాక్షిగా ట్రంప్ యుద్ధకాండ
- మరియా నుంచి నోబెల్ గుంజుకున్న డోనాల్డ్
- ఇరాన్ అధ్యక్షుడినే లేపేసిన ‘శాంతి’ దూత
- యుద్ధం వద్దని నీతులు… చేతిలో ఆయుధాలు
- బాంబు దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్
- ఏకిపారేసిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక
సహనం వందే, హైదరాబాద్:
నోబెల్ శాంతి బహుమతి తనకు ఇవ్వలేదని విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధ బాట పట్టారు. పదేళ్ల కిందట ఇతర దేశాల జోలికి వెళ్లనని చెప్పిన ఆయన ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడినే అంతం చేశారు. అమెరికా సైనిక శక్తిని వాడుతూ మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధానికి తెరలేపారు. గతంలో తాను చెప్పిన మాటలన్నీ తుంగలో తొక్కే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయంపై ట్రంప్ విధానాలను అమెరికా ప్రసిద్ధ పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఏకిపారేసింది. ఆ పత్రిక విశ్లేషణ సారాంశం పరిశీలిద్దాం.

మాట తప్పిన అధ్యక్షుడు…
డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల సమయంలో విదేశీ ప్రభుత్వాలను కూల్చడం పెద్ద వైఫల్యమని చెప్పారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోనని అప్పట్లో హామీ ఇచ్చారు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన 2024 ఎన్నికల్లో కూడా తాను కొత్తగా ఏ యుద్ధాలు చేయలేదని గొప్పగా చెప్పుకున్నారు. కమలా హారిస్ గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ప్రజలను భయపెట్టారు. కానీ ఏడాది తిరగకముందే ఆయనే ఇరాన్ మీద యుద్ధానికి దిగారు.
శాంతి బహుమతి గుంజుకొని యుద్ధ తంత్రం…
వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు 2025లో నోబెల్ శాంతి బహుమతి లభించిన సంగతి తెలిసిందే. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం ట్రంప్ అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతగా ఆమె ఆ పురస్కారాన్ని డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం చేస్తూ ఆయనకు బహూకరించారు. ఈ బహుమతిని ట్రంప్ స్వీకరించి దానిని వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఉంచుకున్నారు. ఇది తన శాంతి విధానాలకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా శాంతి బహుమతి బదిలీని నోబెల్ నిర్వాహకులు వ్యతిరేకించినా ఆయన లెక్క చేయలేదు.
ఎనిమిదోసారి సైనిక పంజా
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ దూకుడు పెంచారు. శనివారం ఇరాన్‌పై జరిపిన దాడి ఆయన రెండో దఫా పాలనలో ఎనిమిదో సైనిక చర్య. ఇప్పటికే వెనిజులా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. ఆ దేశ అధ్యక్షుడిని బంధించి అమెరికా జైల్లో ఉంచారు. క్యూబా నియంతను గద్దె దించుతామని హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ ప్రభుత్వాలను కూల్చడం వైఫల్యమని గతంలో చెప్పిన ట్రంప్ ఇప్పుడు అదే పనిలో నిమగ్నమయ్యారు. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని పక్కన పెట్టి అంతర్జాతీయ రాజకీయాల్లో తలదూర్చుతున్నారు.
వైరుధ్యాల ట్రంప్…
ట్రంప్ ప్రకటనల్లో గందరగోళం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడి చేసినప్పుడు అణు కార్యక్రమాన్ని నాశనం చేశానని చెప్పారు. గతవారం తన ప్రసంగంలో కూడా అణు కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పేర్కొన్నారు. కానీ శనివారం తెల్లవారుజామున విడుదల చేసిన వీడియోలో మళ్లీ ఇరాన్ అణు ముప్పు గురించే మాట్లాడారు. ఇప్పటికే సర్వనాశనం చేశానని చెప్పినప్పుడు మళ్లీ దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆయన వివరించలేదు. ఏకంగా అధ్యక్షుడినే చంపాల్సిన అవసరం ఏంటి?
అర్ధరాత్రి సోషల్ మీడియా వీడియో
యుద్ధం ప్రకటిస్తూ ట్రంప్ అర్ధరాత్రి ఒక వీడియోను విడుదల చేశారు. అందులో దాదాపు 50 ఏళ్ల కిందటి విషయాలను ప్రస్తావించారు. 1979 నాటి అమెరికా రాయబార కార్యాలయ ముట్టడిని గుర్తు చేశారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఇటీవల ఇరాన్ నిరసనకారులపై జరిగిన దాడులను కూడా ప్రస్తావించారు. అయితే ఇవన్నీ పాత సమస్యలే అయినప్పుడు ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిందో మాత్రం స్పష్టం చేయలేదు.
మారిన ట్రంప్ వ్యూహం…
ఒకప్పుడు విదేశీ గడ్డపై రక్తపాతం వద్దన్న నాయకుడు ఇప్పుడు పాలనా మార్పును కోరుకుంటున్నారు. ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా అమెరికా పూర్తి సైనిక శక్తిని ఉపయోగిస్తోంది. ఇది ప్రపంచ రాజకీయాల్లో పెద్ద కుదుపుగా మారింది. ట్రంప్ తన రెండో విడతలో ఎందుకు ఇంత హింసాత్మకంగా మారారో విశ్లేషకులకు అంతుచిక్కడం లేదు. మధ్యప్రాచ్యంలో పెచ్చరిల్లుతున్న ఈ మంటలు ఎక్కడికి దారితీస్తాయో అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.
యుద్ధంలో అమెరికా బిడ్డలు
శాంతి అధ్యక్షుడిగా ముద్ర వేయించుకున్న ట్రంప్ ఇప్పుడు యుద్ధ పాలకుడిగా మారారు. అమెరికా యువతీ యువకులను మధ్యప్రాచ్యంలో యుద్ధానికి పంపుతున్నారు. గత పాలకులు అమెరికా బిడ్డలను ఇతర దేశాలకు యుద్ధానికి పంపుతారని విమర్శించిన ట్రంప్ ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు. దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతానని చెప్పిన నాయకుడు ఇప్పుడు ఇరాన్ అగ్నిగుండంలోకి సైన్యాన్ని దించారు. అమెరికా విదేశీ విధానం ఇప్పుడు పూర్తిగా దాడుల దిశగా మళ్లింది.
తప్పని యుద్ధ మేఘాలు
అమెరికా సైనికులు మరోసారి మధ్యప్రాచ్య సుడిగుండంలో చిక్కుకున్నారు. ఇరాన్‌తో యుద్ధం వల్ల ఆర్థిక పరిణామాలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరిపై స్వదేశంలోనూ విమర్శలు వస్తున్నాయి. గతంలో శాంతిని కోరుకున్న ఓటర్లు ఇప్పుడు యుద్ధ అధ్యక్షుడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ దాడులు కేవలం ఇరాన్‌తోనే ఆగుతాయా లేక మరిన్ని దేశాలకు విస్తరిస్తాయా అన్నది వేచి చూడాలి.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్