టాలీవుడ్ ‘మోస్ట్ వాంటెడ్’ – అనిల్ రావిపూడి కోసం వేట

Anil Ravipudi - Tollywood Most Wanted
  • సినిమాల విజయవంతంతో నిర్మాతల క్యూ
  • అనుకున్న బడ్జెట్ కంటే తక్కువకే నిర్మాణం
  • 78 రోజుల్లోనే చిరంజీవి సినిమా పూర్తి
  • మెగాస్టార్ మూవీతో మరో భారీ సక్సెస్

సహనం వందే, అమరావతి:

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పటాస్ లా మొదలైన అనిల్ రావిపూడి విజయ యాత్ర… ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో తీసిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో పీక్ స్టేజ్‌కు చేరింది. సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్లతో పాటు భగవంత్ కేసరితో సీరియస్ హిట్లు కొట్టిన అనిల్… తాజా చిత్రంతో నిర్మాతలకు ఆణిముత్యంలా మారారు. దీంతో ఆయనతో సినిమా కోసం నిర్మాతలు, హీరోలు క్యూలు కడుతున్నారు. విజయాలు లేని టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఉండటం విశేషం.

Anil Ravipudi Most Wanted

రికార్డు వేగంతో షూటింగ్
మెగాస్టార్‌తో సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగులు జరుగుతాయనే అంచనాలను అనిల్ తిరగరాశారు. గతేడాది మే నెలలో మొదలైన ఈ ప్రాజెక్టును డిసెంబర్ 4 నాటికే పూర్తి చేశారు. మధ్యలో సినీ కార్మికుల సమ్మె కారణంగా 45 రోజులు షూటింగ్ నిలిచిపోయినా… కేవలం 78 రోజుల్లోనే మొత్తం చిత్రీకరణ ముగించి అనిల్ తన వేగాన్ని నిరూపించుకున్నారు.

వానలో మెరిసిన ఐడియా…
షూటింగ్ కోసం కేరళ వెళ్లిన చిత్ర యూనిట్‌కు వాతావరణం షాక్ ఇచ్చింది. పెళ్లి సీన్ తీస్తున్నప్పుడు భారీ వర్షం మొదలవడంతో అంతా ప్యాకప్ అనుకున్నారు. కానీ అనిల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. గొడుగుల మధ్యే పెళ్లి జరుగుతున్నట్లు సీన్ మార్చి చిత్రీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయస్ఫూర్తిని చూసి షూటింగ్ స్పాట్‌లోనే మెగాస్టార్ చిరంజీవి జోహార్లు కొట్టారు.

లోకల్ సెట్లతో గ్లోబల్ లుక్
డెహ్రాడూన్ లో 17 రోజుల పాటు ప్లాన్ చేసిన స్కూల్ షెడ్యూల్ కోసం వెళ్లినప్పుడు కూడా ప్రకృతి అడ్డంకిగా మారింది. అక్కడ టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేని అనిల్… కీలకమైన ఇండోర్ సీన్లను హైదరాబాద్‌లోనే సెట్స్ వేసి కేవలం 5 రోజుల్లోనే పూర్తి చేశారు. దీనివల్ల ప్రయాణ ఖర్చులు తగ్గి నిర్మాతకు సుమారు 75 లక్షల రూపాయలు ఆదా అయ్యాయి.

బడ్జెట్ లో మేజిక్
సినిమా బడ్జెట్ విషయంలో అనిల్ లెక్కలు చూసి టాలీవుడ్ నిర్మాతలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రారంభంలో 50 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని భావించిన ఈ చిత్రాన్ని… అనిల్ తన పక్కా ప్రణాళికతో 32 కోట్లకే ముగించారు. అంటే కేవలం ఒక సినిమాతో నిర్మాతకు 18 కోట్లు మిగిల్చారు. నేటి రోజుల్లో ఇలాంటి క్రమశిక్షణ గల డైరెక్టర్ దొరకడం గ్రేట్ అని ఇండస్ట్రీ కోడై కూస్తోంది.

మెగాస్టార్ మెచ్చిన మేకింగ్
షూటింగ్ సమయంలో అనిల్ వేగాన్ని చూసిన చిరంజీవి.. పాత తరం దిగ్గజ దర్శకుడు కోదండరామిరెడ్డిని గుర్తు చేసుకున్నారు. ‘నీ టైమింగ్ చూస్తుంటే జంధ్యాల గుర్తుకు వస్తున్నారని’ చిరు ప్రశంసించడం అనిల్ కెరీర్ లోనే అతిపెద్ద సర్టిఫికెట్ గా నిలిచింది. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం అనిల్ మార్కు స్టైల్.

అపజయమే లేని ప్రయాణం
పటాస్ నుంచి మొదలుకొని ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి కామెడీ సినిమాలే కాకుండా… బాలయ్యతో తీసిన భగవంత్ కేసరి వరకు అనిల్ ట్రాక్ రికార్డు అద్భుతం. గత ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కూడా తన వినోదాన్ని పండించారు. ఇప్పుడు మెగాస్టార్‌తో సాధించిన విజయంతో టాలీవుడ్ నిర్మాతలకు ఆయన ఒక మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా నిలిచిపోయారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *