- బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణే సరైనది
- యంత్రాల వెనుక కుట్ర దాగి ఉందన్న ట్రంప్
- కంప్యూటర్లను హ్యాక్ చేసే అవకాశం ఉంది
- ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై నమ్మకం లేదు
- ఈవీఎంలతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు
- ఈవీఎంలు ఖర్చు ఎక్కువ… నమ్మకం తక్కువ
- గతంలో తాను ఓడిపోవడానికి కారణం ఇవే
- కాగితపు బ్యాలెట్ పద్ధతితోనే పారదర్శకత
- ఎన్నికల వ్యవస్థలో భారీ మార్పులు అవసరం
- మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్ని రద్దు చేయాలి
- ‘న్యూయార్క్ టైమ్స్’కు ట్రంప్ ఇంటర్వ్యూ
సహనం వందే, అమెరికా:
అమెరికాలో ఎన్నికల ప్రక్రియపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) కంటే పాత కాలపు బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో ఎన్నికల నిర్వహణే అత్యుత్తమమని ఆయన తేల్చి చెప్పారు. ఓటింగ్ మెషీన్ల వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించి పారదర్శకమైన పద్ధతిని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ట్రంప్ అమెరికా ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అనేక సంచలన విషయాలు వెల్లడించారు.

ఈవీఎంలతో పెను ప్రమాదం…
ఓటింగ్ యంత్రాలపై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మెషీన్లు అత్యంత ఖరీదైనవని ఆయన మండిపడ్డారు. ఒక్కో యంత్రం ఖర్చు సామాన్యమైనది కాదని చెప్పారు. బ్యాలెట్ పేపర్ల కంటే ఇవి 10 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని పేర్కొన్నారు. వీటివల్ల ఫలితాల్లో ఖచ్చితత్వం ఉండటం లేదని ఆయన ఆరోపించారు. ప్రపంచంలోని అనేక దేశాలు వీటిని వదిలేశాయని ట్రంప్ గుర్తు చేశారు.
మోసాలకు అవకాశం
2020 ఎన్నికల్లో జరిగిన పరిణామాలను… అప్పట్లో తన ఓటమిని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల వల్ల హ్యాకింగ్ ముప్పు ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కంప్యూటర్ ఆధారిత వ్యవస్థలను సులభంగా మానిప్యులేట్ చేయవచ్చని ఆయన వాదిస్తున్నారు. అందుకే పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలని ఆయన పట్టుబడుతున్నారు.
ప్రతి ఓటును భౌతికంగా లెక్కించడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రతిపాదిస్తున్నారు. చేతితో ముద్ర వేసే పేపర్ బ్యాలెట్లు అయితేనే మోసాలకు తావుండదని ఆయన నమ్ముతున్నారు. మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతిపై ట్రంప్ నిప్పులు చెరిగారు. ఈ విధానం వల్లే ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన బలంగా నమ్ముతున్నారు.
ఒక్క రోజే ఎన్నికలు.. అప్పుడే ఫలితాలు
అమెరికాలో వారాల తరబడి సాగే ముందస్తు ఓటింగ్ (ఎర్లీ ఓటింగ్) పద్ధతిని కూడా ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఒకే రోజున ఓటింగ్ జరగాలని, అదే రోజున ఫలితాలు రావాలని ఆయన కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల రిగ్గింగ్‌కు అవకాశం ఉండదని ఆయన వాదన. ఓటు వేయడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు రావాలని, మెయిల్ ద్వారా ఓట్లు వేసే పద్ధతిని రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో రచ్చ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. దీనివల్ల అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ఎన్నికల విశ్వసనీయతపై అనుమానాలు మొదలయ్యాయి. ట్రంప్ వాదనతో అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా గొంతు కలుపుతున్నారు. డెమోక్రాట్లు మాత్రం వీటిని తోసిపుచ్చుతున్నారు.
అంకెల్లో చూస్తే భారీ వ్యయం
ఓటింగ్ యంత్రాల నిర్వహణకు అమెరికా ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. బ్యాలెట్ పేపర్ విధానానికి మారితే దాదాపు 8,400 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని ఒక అంచనా. ఈ భారీ మొత్తాన్ని ఇతర అభివృద్ధి పనులకు వాడొచ్చని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఆర్ధికంగా కూడా పేపర్ బ్యాలెట్లే లాభదాయకమని ఆయన లెక్కలు చూపిస్తున్నారు. ఖర్చు తగ్గించడంతో పాటు నమ్మకాన్ని పెంచాలని ఆయన కోరుతున్నారు.
సంస్కరణల దిశగా అడుగులు
ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు కావాలని ట్రంప్ గట్టిగా కోరుతున్నారు. ఓటరు ఐడీ కార్డులను తప్పనిసరి చేయాలని ఆయన అంటున్నారు. పౌరసత్వం లేని వారు ఓటు వేయకుండా కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు పారదర్శకంగా ఉండాలంటే తన సూచనలు పాటించాలని చెప్పారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.