- ఆర్థికంగా అనుసంధానం చేసే కుట్ర
- బుల్లెట్ రైలు ప్రాజెక్టు అందులో భాగమే
- అదానీకి భూములను కట్టబెట్టే పన్నాగం
- బీజేపీతో ముంబైకి పొంచి ఉన్న ముప్పు
- ఉత్తరాది వలసదారులకు రాజ్ థాక్రే వార్నింగ్
- మరాఠీ అస్తిత్వం కోసం ఆఖరి పోరాటం
- బీజేపీ నకిలీ హిందుత్వను ఎండగట్టిన ఉద్ధవ్
- రేపు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
సహనం వందే, ముంబై:
ముంబైపై రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. కార్పొరేషన్ ఎన్నికల వేళ 20 ఏళ్ల వైరం వీడి థాక్రే సోదరులు చేతులు కలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే… మరాఠీ మనోభావాలను అస్త్రంగా మలచుకుని బీజేపీపై యుద్ధం ప్రకటించారు. హిందీ భాషా ప్రయోగంపై వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

హిందీపై హెచ్చరిక
హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే సహించేది లేదని… అటువంటి శక్తులకు బుద్ధి చెబుతామని రాజ్ థాక్రే ఘాటుగా హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే వారు హిందీ తమ మాతృభాష కాదని గుర్తించాలన్నారు. భాష మీద తనకు ద్వేషం లేదని చెబుతూనే… పెత్తనం చేయాలని చూస్తే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. మరాఠీ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే తన లక్ష్యమని రాజ్ గర్జించారు.
ఆఖరి పోరాటం
మరాఠీ బిడ్డలకు ఇదే ఆఖరి ఎన్నికని రాజ్ థాక్రే పిలుపునిచ్చారు. ఈ అవకాశం చేజారితే మరాఠీ జాతి ఉనికి కాలగర్భంలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూమి, భాష పోతే మనిషికి విలువ ఉండదని హెచ్చరించారు. ఎంతో మంది త్యాగాల వల్ల ముంబై మహారాష్ట్రలో భాగమైందని గుర్తు చేశారు. ఓట్ల రోజు అప్రమత్తంగా ఉండి దొంగ ఓట్లను అడ్డుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కలిసిన సోదరులు…
ముంబైకి పొంచి ఉన్న ముప్పును అడ్డుకోవడానికే తాము కలిశామని ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మరాఠీ మనుషుల కోసం శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ చేతులు కలిపినట్లు వెల్లడించారు. మరాఠీ ప్రేమికులు ఈ ఐక్యతను గుండెల్లో నింపుకోవాలని కోరారు. బయటి శక్తుల పెత్తనం నుంచి ముంబైని కాపాడటమే ఈ థాక్రే కూటమి ప్రధాన లక్ష్యమని సోదరులిద్దరూ చాటిచెప్పారు.
బీజేపీపై ధ్వజం
ముంబై సంపదను దోచుకోవడమే బీజేపీ పని అని థాక్రే సోదరులు మండిపడ్డారు. ముంబైని ఆర్థికంగా గుజరాత్‌తో అనుసంధానం చేసే భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు అందులో భాగమేనని పేర్కొన్నారు. అదానీ వంటి వ్యాపారవేత్తలకు భూములను కట్టబెట్టేందుకే బీజేపీ తహతహలాడుతోందని విమర్శించారు. కార్పొరేషన్ పీఠం చేజారితే ముంబైని అమ్మేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

నకిలీ హిందుత్వ
బీజేపీ ప్రదర్శిస్తున్నది నకిలీ హిందుత్వ అని ఉద్ధవ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు హిందూ ముస్లిం చిచ్చు పెట్టడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ముంబైని అంతర్జాతీయ నగరం అంటూ మహారాష్ట్ర నుంచి వేరు చేసేలా కొందరు బీజేపీ నేతలు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ముంబై పేరును మళ్ళీ బాంబేగా మార్చాలని చూస్తున్నారా అని నిలదీశారు. ఇది మహారాష్ట్ర ఆత్మగౌరవ పోరాటమని ప్రకటించారు.
అవినీతి భాగోతం
కార్పొరేషన్‌లో గత ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్ల రూపాయల మేర భారీ అవినీతి జరిగిందని ఉద్ధవ్ ఆరోపించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో సిమెంట్ కొనుగోలు కూడా అదానీ సంస్థల నుంచే చేస్తున్నారని విమర్శించారు. ముంబై ప్రజల కష్టార్జితాన్ని గుజరాత్ పాలు చేయనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ నెల 15న జరిగే పోలింగ్‌లో ఓటర్లు కమలం పార్టీకి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.