ఎంఎన్జే డైరెక్టర్ నియామకంపై రచ్చ -ప్రొఫెసర్లు, డాక్టర్ల తీవ్ర నిరసన

MNJ Director issue
  • సీనియార్టీకి అన్యాయం జరిగిందని ఆవేదన
  • బయటి వ్యక్తికి పగ్గాలు ఇవ్వడంపై ఫైర్
  • పునఃపరిశీలించాలని డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:

దశాబ్దాలుగా సంస్థను నమ్ముకుని సేవలందిస్తున్న నిపుణులను కాదని, పారదర్శకత లేని రీతిలో బయటి వ్యక్తిని ఎంఎన్జే డైరెక్టర్‌గా నియమించడంపై హైదరాబాద్‌లోని ఎంఎన్జేలో పెను తుఫానుకు దారి తీసింది. ఈ నిర్ణయం కేవలం ఒక పదవికి సంబంధించింది మాత్రమే కాదు… ప్రభుత్వ క్యాన్సర్ చికిత్స నాణ్యతను, అంతర్గత నైపుణ్యాన్ని అవమానించడమేనని అక్కడి సీనియర్ ప్రొఫెసర్లు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్హతలకు పాతర
ఎంఎన్జేలో డైరెక్టర్ నియామకం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. సంస్థలో దశాబ్దాల తరబడి సేవలందిస్తున్న సీనియర్ ప్రొఫెసర్లు, విభాగాధిపతులు అందుబాటులో ఉన్నప్పటికీ వారిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అక్కడి వైద్యులు విమర్శిస్తున్నారు. ఈ మేరకు అక్కడి ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రఘురాం, డాక్టర్ డీఆర్ ప్రకాష్, డాక్టర్ రాధిక, టీజీజీడీఏ ఉస్మానియా యూనిట్-2 ప్రెసిడెంట్ డాక్టర్ వినోద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంధ్యా రాణి, నాయకులు శివకుమార్, చంద్రశేఖర్ నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అర్హత ఉన్న అంతర్గత అధికారులను పక్కన పెట్టడం వెనుక ఉన్న మతలబు ఏమిటో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య సంస్థలోని నిపుణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని వైద్యులు ఆరోపిస్తున్నారు.

అనుభవానికి దక్కని గౌరవం
ఎంఎన్జే సంస్థలో పనిచేస్తున్న సీనియర్లకు సంస్థ పరిపాలన, ఇక్కడి వైద్య సేవలపై సంపూర్ణ అవగాహన ఉంది. విద్యా, పరిశోధన కార్యక్రమాల్లో వీరికి ఉన్న అనుభవం వెలకట్టలేనిది. అటువంటి వారి సీనియార్టీని పరిగణనలోకి తీసుకోకుండా బయటి సంస్థకు చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగించడంపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. సంస్థ సంప్రదాయాలను, వ్యవస్థను గౌరవించకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో పరిపాలనాపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

వైద్య సేవలకు విఘాతం
డైరెక్టర్ నియామకం అనేది కేవలం ఒక వ్యక్తి ఎంపిక కాదు, అది వేలాది మంది క్యాన్సర్ రోగుల చికిత్సతో ముడిపడి ఉన్న అంశం. సంస్థలో స్థిరత్వం లేకపోతే రోగులకు అందే నాణ్యమైన వైద్య సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నిరంతరాయంగా నాణ్యమైన చికిత్స అందించాలంటే సంస్థ మూలాలు తెలిసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు కోరుతున్నారు. అంతర్గత నిపుణులకు అవకాశం ఇస్తేనే రోగులకు మెరుగైన సేవలందుతాయని వారు గట్టిగా నమ్ముతున్నారు.

నిర్ణయంపై పునరాలోచన
ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయాన్ని తక్షణమే పునఃపరిశీలించాలని ఎంఎన్జే సీనియర్ వైద్యులు, సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ ఎంపికను సరిదిద్దాలని కోరుతున్నారు. సంస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే సంస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

న్యాయం కోసం నిరీక్షణ
ఈ నియామకం వల్ల ఏర్పడిన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వైద్యులు ఆశిస్తున్నారు. అర్హులైన అంతర్గత సీనియర్ అధ్యాపకులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. పారదర్శకమైన పద్ధతిలో నియామకాలు జరగాలని కోరుతూ ఎంఎన్జే సీనియర్ వైద్యులు, సిబ్బంది సంతకాలతో కూడిన వినతిని సిద్ధం చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేస్తుందని వీరంతా వేచి చూస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *