- 5 ఏఎం ట్రెండును వ్యతిరేకిస్తున్న నిపుణులు
- బలవంతంగా మేల్కొంటే అనారోగ్యమే
- నిద్ర లోపంతో గుండెపోటు, డిప్రెషన్ ప్రమాదం
- ఆరోగ్యం కాపాడుకోవడమే విజయ రహస్యం
- ఎవరి శరీరాన్ని బట్టి వాళ్ళు నిద్ర లేవాలి
సహనం వందే, హైదరాబాద్:
ప్రపంచ ప్రఖ్యాత సీఈఓలు, అథ్లెట్లు తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సక్సెస్ కావాలంటే ‘5 ఏఎం క్లబ్’లో చేరాల్సిందేనన్న భ్రమలో యువత తమ నిద్రను పణంగా పెడుతున్నారు. అయితే ఈ ట్రెండ్ మనిషి ప్రాణాల మీదకు తెస్తుందని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

మూర్ఖత్వపు ట్రెండ్
కాలిఫోర్నియాకు చెందిన స్లీపింగ్ నిపుణుడు మైఖేల్ బ్రూస్ ఈ ట్రెండ్‌ను తీవ్రంగా ఖండించారు. తెల్లవారుజామున 5 గంటలకు లేవడం అనేది ప్రపంచంలోనే రెండో అతి మూర్ఖత్వమని ఆయన అభివర్ణించారు. ప్రముఖులను గుడ్డిగా అనుకరిస్తూ శరీరాన్ని హింసించడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని ఆయన స్పష్టం చేశారు. బలవంతంగా నిద్రను ఆపడం వల్ల మెదడు మొద్దుబారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
జన్యువుల ప్రభావం…
ప్రతి మనిషి శరీర గడియారం జన్యుపరంగా నిర్ణయించి ఉంటుంది. దీనినే క్రోనోటైప్ అని పిలుస్తారు. కొందరు సహజంగానే ఉదయం త్వరగా లేచే లయన్స్ కేటగిరీలో ఉంటే… మరికొందరు రాత్రి వేళల్లో చురుగ్గా ఉండే ఉల్ఫ్స్ కేటగిరీలో ఉంటారు. ప్రపంచ జనాభాలో 55 నుంచి 65 శాతం మంది బేర్స్ విభాగంలో ఉంటారు. వీరు ఉదయం 10 గంటల తర్వాతే అత్యంత ఉత్పాదకతతో పని చేయగలరు.
నిద్ర లోపం ముప్పు
శరీరానికి అవసరమైన నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. నిద్రను అణచివేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి పెరిగి డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. నిద్ర అనేది బలవంతంగా చేసే పని కాదని… అది టెడీ బేర్‌ను ఆలింగనం చేసుకున్నంత సహజంగా ఉండాలని ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ రస్సెల్ ఫాస్టర్ సూచిస్తున్నారు.
ఉత్పాదకత పతనం
ఎక్కువ సమయం పని చేయవచ్చనే ఉద్దేశంతో త్వరగా లేవడం వల్ల అసలు పని సామర్థ్యం పడిపోతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే మెదడు వేగంగా నిర్ణయాలు తీసుకోలేదు. 5 గంటలకు లేచి నిద్రమబ్బులో పని చేయడం కంటే… తగినంత విశ్రాంతి తీసుకుని చురుగ్గా పని చేయడం వల్ల నాణ్యమైన ఫలితాలు వస్తాయి. వారమంతా త్వరగా లేచి వీకెండ్లలో ఎక్కువసేపు పడుకోవడం వల్ల శరీర గడియారం గందరగోళానికి గురవుతుంది.
అలవాట్లు మార్చుకోవాలి
మంచి నిద్ర కోసం కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కాఫీ, టీలు తాగడం మానుకోవాలి. నిద్రకు 3 గంటల ముందే మద్యానికి దూరంగా ఉండాలి. పడుకోవడానికి ముందు సెల్ ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల నిద్ర పట్టదు. వ్యాయామం ఉదయం పూట చేయడం ఆరోగ్యకరం. రాత్రి వేళల్లో చేస్తే అది నిద్రను దూరం చేస్తుంది.
సహజత్వమే ముఖ్యం
సక్సెస్ సాధించడానికి నిద్రను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ తమ శరీర తత్వానికి తగ్గట్లుగా నిద్ర సమయాన్ని కేటాయించుకోవాలి. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలి. ఇతరుల లైఫ్ స్టైల్‌ను కాపీ కొట్టడం మానేసి, మన శరీరానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడమే నిజమైన విజయం. తగినంత విశ్రాంతి తీసుకున్నప్పుడే ఆరోగ్యం, ఉత్పాదకత రెండూ సాధ్యమవుతాయి.